ఆరు నెలలే! కానీ.. అరవై ఏండ్ల కష్టాలను.. వివక్షను.. రాసిపెట్టుకో.. రూపాయి కూడా ఇవ్వను.. అని విషం చిమ్మిన అనుభవాలను అధిగమించగలమన్న విశ్వాసాన్ని కల్పించిన సమయం!! ఇది మన పాలన! యాచించే దశ నుంచి.. శాసించే దశకు తెలంగాణ చేరుకున్న సందర్భానికి ఆరు నెలలు నిండిన సందర్భం! పాలించేది కేసీఆరే అయినా.. ముద్ర మనదే! మన తెలంగాణదే! ఏ పథకం చేపట్టినా సమగ్ర పరిశీలన..
విశ్లేషణ.. పక్కా ప్రణాళిక! ఎవరెన్ని విమర్శలు చేసినా.. భావి బంగారు తెలంగాణ
నిర్మాణానికే రాళ్లెత్తుతున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలంటే వాయిదా వేసుకుని పోడానికే అన్న పరిస్థితిని మార్చి.. ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధమని ప్రకటించి, చర్చించిన తెగువ! ఆ తెగువకు పునాది.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే! ఆ సాహసానికి ఊపిరి.. తెలంగాణ ఇకనైనా బాగుపడాలన్న తపనే! ఆ తపనలోంచి వచ్చినవే అనేకానేక ప్రజా సంక్షేమ పథకాలు..టీఆర్‌ఎస్ ప్రభుత్వ విజయాల్లో ముఖ్యమైంది రైతు రుణాల మాఫీ. లక్ష రూపాయల వరకున్న పంటరుణాలు మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.4250 కోట్లను విడుదల చేసింది. బోనస్‌గా ఇన్‌పుట్ సబ్సిడీ బకాయలు, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులకు రూ.11.5 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారంగా రూ.480 కోట్లు విడుదల చేసింది.
ఆసరా పింఛన్లు..
టీఆర్‌ఎస్ మరో ముఖ్య వాగ్దానం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ల పెంపు. కేసీఆర్ సీఎం అవ్వగానే ఇచ్చిన మాటకు కట్టుబడి వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తంగా 25 లక్షలకు పైగా పింఛన్‌దారులను గుర్తించారు.
నీటి పారుదల..
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల..
ఎడారిలా మారుతున్న తెలంగాణ భూముల్లో నదీజలాలను మళ్లించే కృషిలో భాగంగా అధికారంలోకి రాగానే మొట్టమొదటగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సర్వేకు ఆదేశించింది. జూరాల వద్ద దాదాపు లక్ష క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నందున వరద నీటి లభ్యత బట్టి ఈ నీటిని జూరాల నుంచి వరంగల్ జిల్లా పాకాల వరకు గ్రావిటీ ద్వారా మళ్లించే పథకాన్ని కూడా చేపట్టనున్నారు.
ఎస్సెల్బీసీ ప్రాజెక్టు..
ఈ ప్రాజెక్టు చిక్కుముడిని ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కరించింది. ఎస్సెల్బీసీ టన్నెల్ విషయంలో ఎలాంటి అపోహలకు అవకాశమివ్వకుండా ఆ జిల్లాలకు చెందిన ప్రతిపక్షనేతలతో సీఎం సంప్రదింపులు జరిపి నిర్ణయానికి వచ్చారు.
హైదరాబాద్...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఐటీఐఆర్‌లాంటి ప్రాజెక్టులు వస్తుండడంతో దాదాపు 2 కోట్ల జనాభా నివసించేందుకు వీలుగా, భవిష్యత్ అవసరాలన్నీ తీర్చేలా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. నగర పోలీసుశాఖకు జీపీఎస్, ఇంటర్నెట్‌తో కూడిన ల్యాప్‌టాప్, ఇతర ఆధునిక వసతులతో రూ.350 కోట్లతో కొత్త వాహనాలు సమకూర్చింది. లక్ష కెమెరాలతో నిఘా ఉంచాలని నిర్ణయించింది. నగరంలో మహిళలపై, మహిళా ఉద్యోగులపై అఘాయిత్యాలు జరగకుండా షీ టీమ్స్‌పేరిట ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేశారు. అభివృద్ధి పయనంలో భాగంగా నగరాన్ని వై ఫై సిటీగా మార్చేందుకు పూనుకుంది. హుస్సేన్‌సాగర్ పరిరక్షణకు రూ.100 కోట్లు కేటాయించింది. దాని పరిసరాల్లో ఆకాశహర్మ్యాలు నిర్మించనుంది. మెట్రోమార్గాలను పెంచడంతో పాటు నగరం నలుమూలలనుంచి ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మించనున్నారు.
క్రీడలు..
రాష్ట్రంలో క్రీడారంగానికి గతంలో ఏనాడూ ఎరుగనంత ప్రోత్సాహం లభిస్తున్నది. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.25 లక్షలు, కాంస్యం సాధించినవారికి రూ.25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. క్రీడాకారుల కోచ్‌లకు కూడా క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. ఎవరెస్టు అధిరోహించి రాష్ర్టానికి గర్వకారణంగా నిలిచిన గిరిజన, దళిత బిడ్డలైన పూర్ణ, ఆనంద్‌లకు చెరో రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం అందించింది.
ఉద్యమకారులు, అమరవీరులు..
తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత 462 మంది అమర వీరుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఉద్యమకారులపై సీమాంధ్ర సర్కార్ బనాయించిన అక్రమ కేసుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
ఉద్యోగులు..
ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకల జనుల సమ్మె లాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించింది. పీఆర్సీపై చర్చలు జరుగుతున్నాయి. హెల్త్‌కార్డులు మంజూరు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయనున్నారు.
గల్ఫ్ బిడ్డలకు చేయూత..
పుట్టి పెరిగిన ఊర్లో పని దొరకని దుర్భర పరిస్థితుల్లో, కుటుంబాన్ని పోషించుకోవడంకోసం గల్ఫ్‌లాంటి దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కేరళ తరహా ప్యాకేజీని అందించాలని నిర్ణయించింది.
సంచలనం.. సమగ్ర సర్వే
తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం ఆగస్టు 19న ఇంటింటి సర్వే చేపట్టారు. నాలుగు కోట్ల జనాభా సమగ్ర వివరాలను 24 గంటల్లో చేపట్టడం ద్వారా కేసీఆర్ సంచలనం సృష్టించారు. హైదరాబాద్‌లో కూర్చుని తయారు చేసే ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదనే ఉద్దేశంతో మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపొందించారు. మేధావులు, నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో సలహా మండలి ఏర్పాటు చేస్తున్నారు.
ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను రద్దు
నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులకు జీవనాధారమైన ఆటోలపై పన్ను రద్దు చేస్తామని కేసీఆర్ ఎన్నికల సమయంలో వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేశారు.
ఆరోగ్యానికి ఆర్థిక దన్ను
గత 60ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ లేని విధంగా ఆస్పత్రుల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు చెరో రూ.100 కోట్లు కేటాయించింది. సుల్తాన్ బజార్, పేట్ల బురుజు మెటర్నిటీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.50 కోట్లు, నీలోఫర్ ఆస్పత్రికి రూ.30 కోట్లు, కింగ్‌కోఠీ దవాఖానకు రూ.25కోట్లు, కంటి, మానసిక, ఛాతి, ఈఎన్‌టీ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.40కోట్ల నిధులు కేటాయించారు. నిమ్స్‌కు రూ.135.98 కోట్లు కేటాయించగా ఆస్పత్రి ఆధునీకరణ పూర్తయింది. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా కేంద్ర ఆస్పత్రులను నిమ్స్‌స్థాయిలో ఆధునీకరించేందుకు చెరో రూ.10కోట్లు కేటాయించారు.
పీహెచ్‌సీల అప్‌గ్రేడ్‌కు రూ.44 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా, సీహెచ్‌సీల బలోపేతానికి రూ.74 కోట్లు కేటాయించారు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి రూ.92కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్‌కు రూ.25కోట్ల వరకు, బోధనాసుపత్రుల్లో భవనాలు, వసతుల మెరుగుకు రూ.152 కోట్లు కేటాయించటంతో అదనపు మెడికల్ సీట్ల రెన్యువల్‌కు ఇబ్బంది లేకుండా పోయింది.
భవిష్యత్ ప్రణాళికలు..
ఉమ్మడి ప్రవేశాలతో తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం అరికట్టేందుకు వరంగల్‌లో కాళోజీ పేరుతో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కేటాయించింది. తెలంగాణకు ప్రత్యేక మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు జరుగనుంది. రాష్ర్టానికి మంజూరైన ఎయిమ్స్ ఏర్పాటుకు హైదరాబాద్ పరిసరాల్లో స్థల పరిశీలన జరుగుతున్నది. దీనివల్ల 100 మెడికల్ సీట్లతో పాటు 960 పడకల ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందనున్నాయి. ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి కొత్తగా ఏర్పాటుచేసే దవాఖానను సర్కారు పరిధికి ఇవ్వాలని ప్రతిపాదించింది.
సాటిలేని సంక్షేమం..
ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల సంక్షేమ మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్నారు. జూన్ 2న సీఎంగా పదవి చేపట్టాక పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన సమావేశంలోనే సీఎం తన నిర్ణయం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీల సంక్షేమం శాఖల నిర్వహణను సవాలుగా స్వీకరించి సంక్షేమానికి కొత్త అర్థాన్నిస్తున్నారు.
దళితులకు మూడెకరాలు
ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి అందులో బోరు, మోటారు, కరెంట్ కనెక్షన్ లాంటి వసతులు కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1220 ఎకరాల భూమిని 465మందికి పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి..
దళితులు గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకానికి రూపకల్పన చేసి నిరుపేద దళిత, గిరిజన ఆడపిల్లల పెండ్లికి రూ.51 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నది.
మైనార్టీల అభివృద్ధి..
విద్య,ఉద్యోగాల్లో వెనకబడిపోయిన మైనార్టీలకు సహాయం కోసం ముస్లిం కుటుంబాల్లో పెండ్లిళ్లకు షాదీ ముబారక్ పేరిట రూ.51వేలు అందించే పథకం ప్రారంభించింది.
గిరిజన సంక్షేమం..
గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తండాలు, ఆదివాసి గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా ప్రకటించింది.
బీసీల సంక్షేమం..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వెలుగులు నింపే దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో విద్యుత్‌పై చిగురిస్తున్న ఆశలు... కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో విద్యుత్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలోనే అనూహ్యమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్‌లోటునుంచి మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేలా ప్రణాళికలు అమలుచేస్తున్నది.
-ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం 1000 మెగావాట్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రెండు రోజులపాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు.
-బహిరంగ మార్కెట్‌లో 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మూడు ప్రైవేటు పవర్ ప్రాజెక్టులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
-తక్షణ విద్యుత్ అవసరాలకు 500 మెగావాట్ల సోలార్ పవర్ కోసం టెండర్లు ఆహ్వానించగా 108 మంది 1,892 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
-వచ్చే ఏడు సంవత్సరాల విద్యుత్ అవసరాల కోసం 2000 మెగావాట్లకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
-తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంగా వచ్చే ఐదేండ్లలో 20,000 మెగావాట్ల ఉత్పత్తికి వీలైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది.
-సోలార్ పంపుసెట్లు ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.200కోట్లు కేటాయించింది.
-జెన్‌కో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వార్షిక బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపులు జరిపింది.
-కొత్తగూడెం(800మెగావాట్లు),మణుగూరు (1080 మెగావాట్లు) ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను బీహెచ్‌ఇఎల్‌కు అప్పగించింది.
-ఎన్టీపీసీ 4000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు ఇప్పటికే కొన్ని భూములను కేటాయించింది.
-సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న 1200 మెగావాట్ల ప్రాజెక్టు వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సాధించేలా చర్యలు తీసుకున్నది.
-కేటీపీఎస్ 600 మెగావాట్ల పవర్‌ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి