తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలమే అయినా పండుగల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. బోనాలు, వినాయక చవితి నిర్వహణపై కూడా ఇదే విధమైన ఆసక్తి కనబరిచింది. తెలంగాణ పునర్నిర్మాణ వ్యూహాలు రచించి అమలు చేసే బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ పండుగల నిర్వహణకు మొదటి ఏడాదిలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది.
"బంతి పూల తోట నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ" అంటూ తన పాటలో ఈ ప్రాంత సాంస్కృతిక జీవనాన్ని హృద్యంగా వర్ణించిండు ప్రముఖ కవి నందినీ సిద్ధారెడ్డి. తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, బంతిపూలు గుర్తుకొస్తయి. బతుకమ్మ పండుగలో తెలంగాణ హృదయం అగుపడతది. వలస పాలనలో తెలంగాణ సంస్కృతి అణచివేతకు గురైంది.
బతుకమ్మ వంటి గొప్ప పండుగ కూడా ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు మన రాష్ట్రం సాధించుకున్నాం. మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం. మన సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటున్నాం. బతుకమ్మ ఆడుకోవడానికి పది కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు, ఈ పండుగ విశిష్టతను, తద్వారా తెలంగాణ సం స్కృతిని ప్రపంచానికి చాటడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. దేశంలోని వివిధ రంగాల మహిళామణులు ఆతిథులుగా టాంక్‌బండ్‌పై తొలి పెద్ద బతుకమ్మను జరుపుకోవడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుంది.
బతుకమ్మ, దసరా, హోలీ మొదలైనవన్నీ తెలంగాణ మనసుకు అద్దం పట్టే సామాజిక ఉత్సవాలు. ఇవి ఇంటిలో తలుపులు బిడాయించుకుని జరుపుకునే పండుగలు కాదు. సామూహికంగా జరుపుకునేవి. బతుకమ్మ వంటి గొప్ప పండుగ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఇవాళ ఎంగిలి పూలు మొదలుకొని సద్దుల వరకు- ప్రతి రోజూ పల్లె పల్లెనా జరిగే ఈ సంబురాలు ప్రజలు జరుపుకునే మహిళా దినోత్సవాలు.
హైదరాబాద్‌తో సహా తెలంగాణవ్యాప్తంగా వరంగల్, కరీంనగర్ తదితర నగరాలలో భారీ ఎత్తున మహిళలు తరలి వస్తారు. మహిళా వ్యాపారస్తులు, విద్యావంతులు, విద్యార్థులు మొదలుకొని సామాన్య కూలీల వరకు అంతా ఒక్క చోట చేరే సందర్భమిది. పెండ్లయిన మహిళలు తల్లిగారింటికి వచ్చి కుటుంబ సభ్యులతో, చిన్ననాటి స్నేహితురాళ్ళతో గడుపుకొని పాత రోజులను గుర్తుకు తెచ్చుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం వల్ల మనసు తేలిక పడుతది. మహిళలంతా ఇంటి నుంచి బయటికి వచ్చి ఆడుతూ పాడుతూ గడపుతరు. ఫలహారాలు పంచుకుని తింటరు.
బొడ్డెమ్మ అయితే టీనేజి పిల్లల పండుగ! బొడ్డెమ్మ, బతుకమ్మలకు ముందు ఆ తరువాత కొద్ది రోజుల పాటు అన్ని రకాల పప్పులు ముద్ద చేసి ఇవ్వడం- కౌమార బాలికలకు పౌష్టికాహారం అందించడమే. ఈ పూల పండుగ మనిషిని ప్రకృతికి మరింత దగ్గర చేస్తుంది. వేల కొద్ది పాటలు మహిళలే పాటలు రచించి పాడుకోవడం ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతం. ఈ పాటలలో అత్తగారింటికి వెళ్ళే బిడ్డకు తల్లి చెప్పే బుద్దులు ఉంటాయి. తల్లిగారింటిపై తల్లడిల్లే మన సు ఉంటుంది.
సున్నితమైన శృంగారం ఉంటుంది. చిరునవ్వులు చిలికే హాస్యం ఉంటుంది. కన్నీటి కథలు ఉంటాయి. స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించే సాహిత్య సంపద ఇది. చారిత్రక ఘటనలపై కూడా పాటలు కట్టి పాడుకోవడం పల్లె స్త్రీల విజ్ఞాన విస్తృతికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమ కాలంలో బతుకమ్మ పండుగ అస్తిత్వానికి, పోరాటానికి చిహ్నంగా మారిపోయింది. వలస పాలకులు ట్యాంక్‌బండ్‌పై ఆడుకోవడానికి అంగీకరించనప్పుడు న్యాయస్థానానికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవలసి వచ్చింది. ఆ విధంగా సీమాంధ్ర దుశ్శాసనానికి ధిక్కారంగా- టాంక్‌బండ్‌పై మహిళలు చిరునవ్వులు చిందిస్తూ బతుకమ్మ ఆడడాన్ని చూసి తెలంగాణ సమాజమంతా మురిసిపోయింది. తెలంగాణ అంతటా ఉద్యమ గౌరమ్మలు ఊరేగాయి. అందుకే తెలంగాణ సాధించుకున్నాం కనుక ఈ బతుకమ్మ ఆటలు విజయోత్సవ సంబురాలు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలమే అయినా పండుగల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. బోనాలు, వినాయక చవితి నిర్వహణపై కూడా ఇదే విధమైన ఆసక్తి కనబరిచింది. తెలంగాణ పునర్నిర్మాణ వ్యూహాలు రచించి అమలు చేసే బరువు బాధ్యతలు ఉన్నప్పటికీ, పండుగల నిర్వహణకు మొదటి ఏడాదిలోనే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది.
భవిష్యత్తులో బతుకమ్మ పండుగ నిర్వహణ మరింత శోభాయమానంగా మారుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పొడుగునా ఉల్లాసంగా బతుకమ్మ ఆడడానికి వీలుగా పాత కట్టడాలను, నిర్మాణాలను తొలగించైనా పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలె. సీమాంధ్ర పాలకుల మాదిరిగా బతుకమ్మ ఆటను ఏ ఒక్క ప్రదేశానికో పరిమితం చేయకూడదు. హైదరాబాద్‌లోని ఇతర చెరువుల దగ్గర కూడా తగినన్ని ఏర్పాట్లు చేయాలె. వలస పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారు. దీనివల్ల తెలంగాణ జీవనమే అస్తవ్యస్థమైంది. తెలంగాణ ప్రభుత్వం చెరువుల మరమ్మత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నది. ఈ చెరువుల మరమ్మత్తు పూర్తయితే ఊర్లు బాగుపడతాయి. అప్పుడు ఊరూరా బతుకమ్మ పండుగ మరింత సంబురంగా సాగుతుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి