గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 26, 2014

శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉన్నా...తెలంగాణ సీఎం నిర్ణయమే కీలకం!

తెలంగాణ సీఎం నిర్ణయమే కీలకం




-ఉమ్మడి రాజధాని అయినా.. కమిషనర్లను ఎంపిక చేసేది ఆయనే
-సీమాంధ్ర ముఖ్యమంత్రి పాత్ర పూర్తిగా శూన్యం
-స్పష్టం చేస్తున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు

వారం రోజుల్లో రానున్న అపాయింటెడ్ డేతో అధికారికంగా రెండు రాష్ట్రాల పరిపాలన ప్రారంభం కావడంతోపాటు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారనుంది. వీలున్నంత కాలం రెండు రాష్ట్రాల పరిపాలనా ఇక్కడి నుంచే సాగనుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో శాంతిభద్రతల అంశం ఉమ్మడి గవర్నర్ చేతికి వెళ్లనుంది. అయినప్పటికీ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ల ఎంపిక మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి, ఇక్కడి క్యాబినెట్ నిర్ణయం మేరకే జరగనున్నాయి. ఈ విషయంలో సీమాంధ్ర సీఎం, ఇతర ప్రజాప్రతినిధుల పాత్ర ఏమాత్రం లేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది.

తెలంగాణ మంత్రిమండలే కీలకం
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ప్రాంతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ గరిష్టంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకూ కలిపి ఒకే గవర్నర్ ఉంటారు. ఉమ్మడి రాజధానిలో నివసించే వారి జీవన భద్రత, ప్రజల స్వేచ్ఛ, ఆస్తుల భద్రత తదితరాలు గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రతపై కూడా గవర్నర్ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ మంత్రిమండలితో గవర్నర్ సంప్రదించిన తరువాతే సొంతగా నిర్ణయం తీసుకోవాలి.

ఈ విషయంలో ఏ అంశమైనా గవర్నర్ నిర్ణయమే తుది నిర్ణయం. గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారుల్ని నియమిస్తుంది. ఉమ్మడి రాజధాని అయినప్పటికీ భౌగోళికంగా హైదరాబాద్, సైబరాబాద్‌లు తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం కావడంతో ఇక్కడ పోలీసు కమిషనర్ల నియామకం మాత్రం ప్రత్యక్షంగా తెలంగాణ మంత్రిమండలి, పరోక్షంగా ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే జరగనున్నాయి.

విపత్కర పరిస్థితుల్లోనే గవర్నర్ జోక్యం
శాంతిభద్రత అంశం ఉమ్మడి గవర్నర్ చేతిలో ఉన్నప్పటికీ ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం ఉండదు. ఉమ్మడి రాజధానిలో నివసించే సీమాంధ్రుల భద్రత విషయాన్ని నేరుగా ‘ప్రత్యేక బిల్లు’లో ఎక్కడా ప్రస్తావించలేదు. జనం ధన, మాన, ప్రాణాల భద్రత, ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎక్కడ నివసించినా రాజ్యాంగబద్ధంగా అక్కడి ప్రభుత్వమే చూడాల్సి ఉంటు ంది. ఈ నేపథ్యంలోనే ఈ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం పైనే ఉంటాయి.

ఉమ్మడి రాజధానిలో ప్రజల భద్రతపై తెలంగాణ మంత్రిమండలితో చర్చించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులు, తీవ్ర సంక్షోభాలు తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్ నేరుగా తన విచక్షణాధికారా ల్ని వినియోగిస్తారు. అలాంటప్పుడు కేంద్రం నియమించే ఇద్దరు సలహాదారులు ఉమ్మడి రాజధానిలో భద్రత వ్యవహారాలకు సంబంధించి గవర్నర్‌కు సూచనలు, సలహాలు అందిస్తారు. అవసరమైతే వినియోగించేందుకు ఐదేళ్ల పాటు ప్రత్యేక రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్)ను హైదరాబాద్‌లో మోహరించి ఉంచుతారు.

చండీగఢ్‌లో ఉమ్మడి అంగీకారంతో...
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కాకముందు హర్యానా, పంజాబ్‌లకు ఉమ్మడి రాజధానిగా ఉండగా అక్కడో ప్రత్యేక విధానాన్ని అవలంభించారు. ఆ నగర పోలీసు కమిషనర్‌ను రెండు రాష్ట్రాల సీఎం అంగీకారంతో నియమించేవారు. నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి పోలీసు కమిషనర్ పోస్టు ఎంతో కీలకమైంది. చండీగఢ్ ఉమ్మడి రాజధాని కావడంతో రెండు ప్రభుత్వాల కార్యాలయాలు, కార్యకలాపాలు, పరిపాలన ఆ నగరం కేంద్రంగానే సాగాయి.

దీంతో ఇరు ప్రభుత్వాల అంగీకారాన్నీ పరిగణనలోకి తీసుకునేవారు. ఇక్కడ వివాదం రేగితే దాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేవారు. రెండు ప్రభుత్వాలు సూచిస్తున్న వ్యక్తుల అనుభవం, పూర్వ చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకునేది. హైదరాబాద్, సైబరాబాద్‌ల విషయంలో ఈ విధానం అమలు చేయడం సాధ్యం కాదన్నది మాజీ పోలీసు బాస్‌ల మాట.

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి