గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 26, 2015

తెలంగాణ స్వయం పాలన...సాంస్కృతిక వైభవం...

image of telangana cultural and historical కోసం చిత్ర ఫలితం


స్వయం పాలనకు ఏడాది కావస్తున్నది. ఈ ఏడాది కాలంలో మన సంస్కృతి, చరిత్ర కొత్త చిగురులు వేసింది. పరాయి పాలకుల నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన తెలంగాణ సంస్కృతి మళ్లీ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడింది. అరవై ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా శ్రమించాల్సి ఉన్నది. మన అభివృద్ధి వికాసానికి తెలంగాణ సంస్కృతిని తిరిగి నిలబెట్టడం కీలకమైన విషయం. పది జిల్లాల్లో ఎక్కడమట్టి పట్టుకున్నా అది శతాబ్దాల చరిత్రను ఎలుగెత్తి చాటుతుంది. తెలంగాణ నేల పూర్వకాలం నుంచి అనేక మంది పాలకుల పాలనలో కొనసాగడం మూలంగా, ఇక్కడి సంస్కృతిలో వైవిధ్యం చోటుచేసుకున్నది. అందువల్ల తెలంగాణ సంస్కృతి ఒక ఉపఖండ లక్షణాలను కలిగినదిగా విశ్లేషకులు చెబుతారు. అలాగే దేశానికి మధ్యలో ఉండడం కారణంగా ఉత్తర దక్షిణ భారతాలకు కూడలిగా కూడా భావిస్తారు. క్రీ.శ.6వ శతాబ్దం నుంచి తెలంగాణలో శాతవాహనుల పాలన కొనసాగిందని చరిత్ర పుస్తకాలు తెలుపుతున్నప్పటికీ, తెలంగాణ చరిత్రకారులు ఇటీవల దొరికిన ఆధారాలతో తెలంగాణలో తెగల జీవనానికి ముందు నుంచే, సింధూ నాగరికతతో సమానమైన నాగరికత విలసిల్లినట్లుగా తెలుస్తున్నది. అలాగే ఇక్కడ దొరికిన ఇనుము, ఉక్కు ఖనిజంతో వ్యవసాయంలో వికసన దశ ఏర్పడిందని, ఇక్కడి అవసరాలకు సరిపోగా మిగిలిన లోహాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర కూడా వెలికితీయడం జరిగింది. తెగలుగా ఉన్న జాతి ఇక్కడి చరిత్రను ఎలుగెత్తిచాటుతుంటే, వ్యవసాయ వికాసం, బౌద్ధ ఆరామాలు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తున్నవి. నాగరికతలో భాగంగా విద్య, వైజ్ఞానిక ఆవిష్కరణలు జరిగిన విధానాన్ని ఇక్కడి సాహిత్యం కళ్ల ముందుంచుతున్నది. 


తెలుగు సాహిత్యంలో తొలి విప్లవకవి పాల్కుర్కి సోమనాథుడు, తెలుగు ప్రజలు గర్వపడేలా భాగవతాన్ని తెనిగీకరించిన మహాకవి బమ్మెర పోతన తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. తన కావ్యాలను పాలకులకు అంకితమివ్వనని శపథం చేసిన పోతన, తన చరమాంక జీవితాన్ని వ్యవసాయం చేయడంలోనే గడిపిన చరిత్ర ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తెలియజేస్తున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ముస్లిం పాలకుల రాకతో తెలంగాణలో మరో నూతనత్వం చోటుచేసుకున్నది. ముస్లిమేతరులైన బహుజనులు, ముస్లింలు, పార్సీలు, సిక్కులు తదితర జాతుల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి, ఇక్కడి సంస్కృతితో మమేకం కావడంతో పాటు, ఇక్కడి మంచిని స్వీకరించి, తమ సంస్కృతిలోని ఉన్నతమైన విషయాలను ఇక్కడి ప్రజలతో కలబోసుకున్నారు. అలా ఇక్కడి సంస్కృతిని గంగా, జమున తహెజీబ్ అని విదేశీ పర్యాటకులు కొనియాడేలా సుసంపన్నం చేశారు.ముస్లిం రాజులు పాలించినప్పటికీ వారు ఇతర మతస్థుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. కులీకుతూబ్‌షా తన ప్రేయసి పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. తన ప్రేమ కోసం ఒక నగరాన్నే నిర్మించిన చరిత్ర ప్రపంచంలోనే అరుదు. అంతే కాకుండా తన పాలనలో అక్కన్న, మాదన్నలను మంత్రులుగా నియమించుకోవడమే కాకుండా, ప్రతి శ్రీరామనవమికి పట్టు వస్త్రాలను తానే స్వయంగా తీసుకెళ్లి సమర్పించిన మత సామరస్యం ఇక్కడనే కనిపిస్తుంది. ఆసఫ్ జాహీల పాలనలో కూడా తెలుగు కవులను ఆస్థాన కవులుగా నియమించుకున్న చరిత్ర ఉన్నది. పాలకులు మారుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం తమ స్థానికత్వాన్ని ఈ నేల స్వభావాన్ని ఏమాత్రం కోల్పోకుండా కాపాడుకున్నారు. గోలుకొండ కేంద్రంగా ఒకప్పుడు కొనసాగిన వజ్రాల వ్యాపారం, హైదరాబాద్‌ను "పెరల్‍సిటీ" అని కీర్తించేలా చేసింది.


ఆ కాలంలో గోలకొం డ ప్రాంతంలో ముత్యాలను రాసులుగా పోసి అమ్మారని ఇప్పటికీ చెప్పుకుంటారు. వ్యాపార సంబంధమైన జీవనం తెలంగాణ పట్టణాలకే పరిమితమయ్యింది తప్ప విశాల సమూహాలుగా ఉన్న తెలంగాణ ప్రజల్లో ప్రకృతితో కలిసి జీవించేతనమే ఇటీవలి కాలం వరకు సజీవంగా ఉన్నది. దొరికిన దానితోనే సంతృప్తిగా జీవించడం మినహా, రేపటి గురించి కూడబెట్టుకుని, దాచుకునే లోభ మనస్తత్వం తెలంగాణ ప్రజల్లో మచ్చుకు కూడా కనిపించదు. స్వార్థ చింతనలేని జీవన విధానం తెలంగాణ ప్రజల్లో కనిపించే మరో సాంస్కృతిక ప్రత్యేకత.ఉత్పత్తి విధానమే ఉపరితలమైన సంస్కృతిని నిర్ణయిస్తుంది అన్న అవగాహనతో చూసినపుడు తెలంగాణ ప్రజలది ఏ సంస్కృతో అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని బ్రిటీషు వలస పాలన ఆక్రమించుకోకపోవడం కారణంగా తెలంగాణ ప్రజలకు వలస వ్యాపార ధోరణులు అలవడలేదు. ఇప్పటికీ పుట్టినూరే కన్నతల్లి అనే భావన తెలంగాణ ప్రజల్లో సజీవంగా ఉంది.


తెలంగాణ నైసర్గిక స్వరూపమే భిన్నమైనది. మౌలికంగా కొండలు, గుట్టలు, వంపులు, డొంకలు, ఎత్తయిన తోపులు ఇట్లా వాతావరణంలోనే ఒక ప్రత్యేకత ఉన్న ది. కోస్తా ప్రాంతంలో నీటి పారుదల సౌకర్యాల వల్ల గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా ఖాళీ కనిపించదు. మైదాన ప్రాంతాలల్ల సాగుజేసి, ప్రకృతిపైన మరింత దాడి చేసి, ప్రకృతిని ఒకరకంగా హింసించి, లాభాల కోసం విపరీతమైన వాణిజ్య పంటల్ని పండిస్తూ, లాభ ప్రాధాన్యతతో ఉన్న జీవన విధానం వారిది. తెలంగాణలో మాత్రం మనుగడ కోసం, ఆహారం కోసం, ఆహార పంటలు, పరిమితమైన వనరులు, పరిమిత ప్రశాంత సాధుజీవనం. ఇప్పటికీ...తెలంగాణ గ్రామాల్లో గ్లోబలైజేషన్ కాలంలో కూడా...దాని ఛాయలు కనబడుతాయి.


మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న వేల ఏండ్ల జానపద కళారూపాలు, శాతవాహన, కాకతీయ శిల్పసంపద తెలంగాణ విశిష్టతను పరిపూర్ణం చేశాయి. జానపద కళారూపాలకు ఆధారమైన కుల పురాణాలు, ఆశ్రిత కులాలు కళలను పూర్వకాలం నుంచి తెలంగాణ గ్రామీణ ప్రజలను అలరిస్తున్నాయి. కేవలం అలరించడమే కాకుండా అనేక చారిత్రక విషయాలను ఈ కథల ద్వారా సమాజానికి బోధిస్తున్నాయి. చిందు, బైండ్ల, ఒగ్గు, శారద, మందహెచ్చులు, పటమొల్లు, బుడుబుడుకలవారు, దాసరులు, జంగాలు, బాలసంతులు, ఫకీర్లు తదితరులు తరతరాలుగా సాంస్కృతిక వారధులుగా నిలుస్తున్నారు. అలాగే తెలంగాణ శ్రమ సంస్కృతిలో భాగంగా ఇక్కడ "పాట" సజీవంగా ఉన్నది. మౌఖిక సంప్రదాయంగా వచ్చిన ఈ పాట తెలంగాణ ప్రాంతంలో ఉన్న దళిత, బహుజన కులాల జీవనాన్ని కండ్ల ముందుంచుతున్నది. 


అందుకే పాట ఇక్కడ మకుటాయమానంగా ఉన్నది. అనేక కళారూపాలు పాశ్చాత్య వలస సంస్కృతి దాడికి కనుమరుగైనా, పాట ఒక్కటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాల కారణంగా సజీవంగా ఉన్నది. ఈ కళారూపాలతో పాటు, తెలంగాణ చారిత్రక వైభవానికి అద్దం పట్టే శిల్ప సంపద శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరలేదు. శాతవాహన, కాకతీయ రాజుల పాలనలోని కట్టడాలు ఇక్కడి ప్రజల కళాభిరుచికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లతో పాటు, ఏ జిల్లా చూసినా, శిల్పకళలతో ఇక్కడి కళావైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తాయి. శిల్ప కళతో పాటు హస్తకళలు కూడా అనేకం తెలంగాణలో వెలుగొందాయి. 


పెంబ ర్తి నగిషీలు, నిర్మల్ బొమ్మలు, భూదాన్ పోచంపల్లి చేనేత పరిశ్రమ తెలంగాణ కళాత్మకతను మరింత ప్రకాశవంతం చేశాయి. కాకతీయుల కాలంలోనే పేరిణి శివతాండవ నృత్యం ఆవిర్భవించి ప్రసిద్ధికెక్కింది. ఇంకా తెలంగాణలో విస్తారంగా ఉన్న అడవుల్లో కోయా, గోండు, చెంచు ప్రజలు తమవైన కళారూపాలను ప్రదర్శించడం మన సాంస్కృతిక చరిత్రకు కొత్త వన్నెను అద్దుతున్నాయి. ఇవే కాకుండా అనేక ప్రదర్శన కళలు సాంస్కృతిక వారసత్వానికి పెట్టని కోటలుగా వర్ధిల్లుతున్నాయి.


(మిగతాది రేపు)
వ్యాసకర్త: సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

నా అజ్ఞతకు మన్నించాలి. పోతనామాత్యులు తెలుగు వారనే ఇన్నాళ్ళూ అందరూ ఆనందంగా చెప్పుకొనే వారం. ఇప్పుడు తెలంగాణా బిళ్ళ తగిలించి ప్రాంతీయతాముద్రవేసి ఆయనను అనుగ్రహించారన్న మాట! ఇలాంటి సంకుచితత్వాలు నిర్వేదాన్ని కలిగిస్తున్నాయి. ఐతే తెలంగాణావారి దృష్టిలో ఇది పోతనకు ఆత్మాభిమానం ప్రసాదించటం కావచ్చును. ఏదో ఒకటి ఇలాంటి పగులు కనిపిస్తూనే ఉంటుంది తెలుగువారు మానసికంగా కూడా ముక్కలు చెక్కలు కావటం గొప్ప అనుకొనే రోజుల్లో. అది విరుగు అనీ, వృధ్ధి అనీ వేర్వేరు వారు వేర్వేరుగా అనుకోవటం తెలుగుభాష కర్మం. తెలుగుజాతి కర్మం. పోనివ్వండి. కాలోదురతిక్రమణీయః

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్యామలరావుగారూ,
మీ బాధ నాకర్థమయింది. కానీ, మీరన్నట్టుగా...’కాలోదురతిక్రమణీయః’ కదా! గతంలో ఒక ఆంధ్ర పండితుడు "నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యం" అని గోలకొండ పత్రిక తొమ్మిదో సంచికలో ఒక అభియోగం చేశాడు. అలాగే ఎందరో ఆంధ్రపండితకవులు కూడా ’తెలంగాణలో కవులే లేరు’ అని ఎత్తిపొడిచారు. దానికి నొచ్చుకున్న సురవరం ప్రతాపరెడ్డిగారు "గోలకొండ కవుల సంచిక"ను ప్రచురించి, 183మంది ప్రాచీన తెలంగాణ కవుల వివరాలనూ, 354మంది ఆధునిక తెలంగాణ కవుల వివరాలనూ పేర్కొన్నారు. ఆయన పేర్కొనక విడిచిన అజ్ఞాత తెలంగాణ కవులెందరున్నారో లెక్కేలేదు. అయినా శ్రీ ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు తమ "ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం"లో ’కొందరు తెలంగాణ కవులు’ అనే పరిచ్చేదాన్ని వెలువరించారంటే, తెలంగాణ కవులపై ఆంధ్రవారికి ఎంత చిన్నచూపున్నదో మీరే గ్రహించండి. పోతనగారు తెలంగాణ కవులలో చేరరా? మీరే చెప్పండి. అందరూ మీలాంటి సహృదయులే ఉండరు కదండీ. గతంలో ఆంధ్రులు మీలాగా సహృదయులై ప్రవర్తించివుంటే, ఈనాడు ఆంధ్ర, తెలంగాణలు విడిపోయేవేకావుగదా! మన మధ్య ఈ చర్చే ఉండేదికాదు గదా! అర్థం చేసుకోగలరు. స్పందించి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి