గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 25, 2015

బాబు అబద్ధం బట్టబయలు!!!

-అనుమతులు లేని పట్టిసీమ
-అక్రమ ప్రాజెక్టుగా నిర్ధారణ
-పోలవరంలో భాగం కాదన్న కేంద్రం
-ఆ ప్రాజెక్టు సంగతి తెలియదని స్పష్టీకరణ
పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో భాగం కాదని తేలిపోయింది. దానికి ఎలాంటి అనుమతులు లేవని, కేంద్రానికి సమాచారం కూడా ఇవ్వకుండా నిర్మాణం జరుపుతున్నారని నిర్ధారణ అయింది. ఇది పోలవరం ప్రాజెక్టులో భాగమంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు వట్టి అబద్ధాలేనని పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది. తన ప్రాజెక్టును ఎవరి అనుమతి లేకుండానే కట్టుకుంటున్న చంద్రబాబు, ఉమ్మడిరాష్ట్రంలో జీవోలు విడుదలైన తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం సైంధవుడిలా అడ్డుపడుతున్నారు. పైగా పాలమూరు, నల్లగొండ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులని, వీటిని అనుమతి లేకుండా చేపడుతున్నారని కేంద్రానికి లేఖ కూడా రాశారు. తెలంగాణ మీద ఉన్న కక్షను ఇలా చాటుకున్నారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని తెలంగాణను దెబ్బ తీయడానికి బాబు ఎత్తు వేస్తే ఇపుడు తన గుట్టే బయటపడింది. 


babu


బాబు వాదన కొట్టేసిన కేంద్రమంత్రి..


సముద్రంలోకి వృథాగా పోయే నీటిని లిఫ్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించడానికి పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చంద్రబాబు ఈ నెల 10న ఢిల్లీలో చెప్పారు. ఇది కొత్త ప్రాజెక్టు కాదని పోలవరంలో భాగమేనని ఆయన నమ్మబలికారు. గోదావరి నదిలో నీళ్ళు కృష్ణాబేసిన్‌కు తరలించడానికే పట్టిసీమ నిర్మిస్తున్నామని చెప్పుకొన్నారు. కానీ పట్టిసీమ పోలవరంలో భాగం కాదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సన్వర్‌లాల్ జాట్ స్పష్టం చేశారు. 


లోక్‌సభలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, కంభంపాటి హరిబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అసలు పట్టిసీమ ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ తమకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు పంపకుండానే, కేంద్రం నుంచి ఆమోదం పొందకుండానే ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోంది. 


ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జీవోలు..


తన ప్రాజెక్టుల్లో లొసుగులు పెట్టుకుని చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల మీద పడి ఏడుస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు కొత్తగా రూపొందించారని దీన్ని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని వాదన ఎత్తుకున్నారు. వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 2009లో తొలిసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీపీఆర్ కోసం ఆగస్టు 2013లో జీవో విడుదలైంది. ఇందుకోసం రూ.6 కోట్లు కూడా మంజూరు చేశారు. పదవీ విరమణ చేసిన ఇంజినీర్లు రూపొందించిన ఒక డిజైన్‌ను కూడా ప్రభుత్వం పరిశీలించింది.


ఇంత జరిగినా చంద్రబాబుకు ఇది కొత్త ప్రాజెక్టులాగా కనిపించింది. ఈ ప్రాజెక్టును మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా తెరమీదకు వచ్చిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి గత నెలలో కేంద్ర జల సంఘానికి లేఖ రాశారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఉమాభారతి, జలవనరుల మంత్రిత్వశాఖ అధికారులతో భేటీ అయ్యి ఫిర్యాదులు చేశారు. 


ఈ ప్రాజెక్టు కొత్తదని, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కృష్ణానది నిర్వహణ బోర్డులో చర్చించలేదని ఆరోపణలు చేశారు. ఎలాంటి అనుమతులు లేవన్న కారణాన్ని చూపి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వరాదని చంద్రబాబు, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అడ్డుపుల్లలు వేశారు. 


కానీ పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మాత్రం అన్నింటినీ తుంగలో తొక్కి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అదేమని మీడియా ప్రశ్నిస్తే పాలమూరు ప్రాజెక్టు కృష్ణా బేసిన్‌లో రెండు రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టు అనీ, పట్టిసీమ మాత్రం గోదావరిలో కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన ప్రాజెక్టు అనే కొత్త వాదన ప్రయోగిస్తున్నారు. అదే నిజమైతే మరి అనుమతులు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర ఏ సమాధానమూ లేదు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి