గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 04, 2014

దొంగ బుద్ధి!

రాష్ట్ర విభజన అనంతరం ఆయా సంస్థల పంపకాలను సజావుగా సాగకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ పాలకులు, తెలంగాణకు చెందవలసిన నిధులను తమ ప్రాంతానికి దొంగచాటుగా జారగొట్టడం క్షమించరాని నేరం. కార్మిక శాఖకు చెందిన ఇద్దరు అధికారులు ఉమ్మడి నిధుల నుంచి 420 కోట్ల రూపాయలను విజయవాడలోని ఒక బ్యాంకుకు తరలించారు. ఆరువందల కోట్లకు పైగా దొంగిలించడానికి పథకం వేసినట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ఫైళ్ళు కూడా మాయమయ్యాయి. తెలంగాణ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండడంతో ఈ బాగోతం బయటపడ్డది. దొంగతనంగా తరలించడమే కాకుండా గుట్టు బయటపడ్డ తరువాత హుందాగా వ్యవహరించకుండా, తప్పించుకునే వేషాలు వేయడం సిగ్గుచేటు! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఈ వ్యవహారం సాగిందని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది.
తమ పెద్దల ఆదేశాల మేరకే ఇందుకు తెగించినట్టు నిధులు తరలించిన అధికారులు చెబుతున్నారు. పైనున్న పెద్దలు వీరిని వెనకేసుకొస్తున్నారు. ఇంత జరిగిన తరువాత, లెక్కలు తీసి నిజాయితీగా పంచి ఇచ్చేందుకే తరలిస్తున్నామని చెప్పుకుంటున్నారు! హైదరాబాద్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉండి ప్రభుత్వాధినేత సకల పరివారంతో ఇక్కడే తిష్టవేసి ఉండగా, లెక్కలు తేలని ఈ ఉమ్మడి నిధులను హడావుడిగా విజయవాడకు తరలించవలసిన అవసరం ఏమొచ్చినట్టు? నిజాయితీ ఉంటే తరలించే ముందు తెలంగాణ ప్రభుత్వానికి ఒక మాట చెప్పవచ్చు కదా!
దొంగచాటుగా విజయవాడకు నిధులు తరలించిన వ్యవహారంలో తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ పెద్దలు బుకాయించవచ్చు.

అయితే ఆంధ్రప్రదేశ్ పాలకులది నిజాయితీ గల మనస్తత్వమా, అల్పబుద్ధా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఇతర ఉదంతాలను పరిశీలించవలసి ఉంటుంది. 

తెలంగాణ నిధులను తమ ఖాతాలో జమ చేసుకోవడం రివాజుగా సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం వాటిని రాబట్టుకోవడానికి అనేక తంటాలు పడవలసి వస్తున్నది. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులను విజయవాడలో ఖాతా తెరిచి అక్కడికి ఆన్‌లైన్‌లో తరలించడంపై ఉద్యోగులు ఆందోళన చేయవలసివచ్చింది.

కేంద్రం నుంచి ఉమ్మడిగా వచ్చిన నిధులను వెంటనే తెలంగాణకు చెల్లించకపోవడం మొదలైన చిల్లర బుద్ధులను ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రదర్శిస్తున్నారు. కొన్ని విద్యా సంస్థలను ప్రస్తుతానికి ఉమ్మడిగా కొనసాగించిన నేపథ్యంలో వాటి నిధులను తమ రాష్ర్టానికి కొత్త వాహనాలు కొనడానికి, ఇంధనానికి ఇతరత్రా యధేచ్ఛగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో ఎక్కడ రాష్ర్టాలు విడిపోయినా ఎక్కడి ఆస్తులు అక్కడి రాష్ర్టానికే ఉంటాయనేది స్థిరపడిన సూత్రం. కానీ హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేషన్ల ఆస్తుల కబ్జాకు సీమాంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు సీమాంధ్ర అధికారులు తెలంగాణ నివేదికను తప్పుల తడకగా రూపొందించడంవల్ల రావలసిన నిధులు ఆగిపోయాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నివేదిక ఆమోదం పొందగా, ఇక్కడ తిష్టవేసిన అధికారుల నిర్వాకం వల్ల మనరాష్ట్ర నివేదిక తిరస్కారం పొందింది.

తెలంగాణ పట్ల సీమాంధ్ర అధికారులలో విద్వేషం పేరుకుపోయి ఉందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు.
నిధుల దొంగతనమే కాదు... కొన్ని చెప్పుకోవడానికి కూడా మనసొప్పని చిల్లర పనులకు సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు పాల్పడుతున్నారు.

ఫర్నిచర్‌ను ఎత్తుకుపోవడం, గదులు ఆక్రమించుకుని ఖాళీ చేయకపోవడం వంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. పోలీసు శాఖకు చెందిన ఒక కార్యాలయాన్ని ఖాళీ చేసినప్పుడు ఫ్యాన్లు, వైర్లు, మరుగు దొడ్డిలోని కమోడ్ వంటివి కూడా పీక్కపోయారు! కొన్ని కార్యాలయాలలో పరిశుభ్రంగా, అందంగా ఉండే గదులు ఆక్రమించుకుని తెలంగాణ వారికి పాతకాలపు గదులు కేటాయించారు. కంప్యూటర్లు అత్యాధునికమైనవి తమ వద్ద పెట్టుకుని కాలంచెల్లినవి తెలంగాణకు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. వాహనాల కేటాయింపులోనూ వివక్షే. ఇవన్నీ నిలదీసి అడిగితే సీమాంధ్ర నాయకులు అధికారులు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. కానీ తెలంగాణ వారు హుందాగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సంఘటన అయితే అది ఆ వ్యక్తి తప్పిదంగా భావించవచ్చు.

ఎక్కడ చూసినా సీమాంధ్ర అధికారుల నిర్వాకం నలుగురు చూసి నవ్వుకునే విధంగా ఉంటున్నది. దాదాపు ఆరు దశాబ్దాలు తెలంగాణ నిధులను కొల్లగొట్టడానికి అలవాటు పడ్డ నాయకులు, అధికార గణం విడిపోయే దశలో కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. కార్మిక శాఖ నిధుల దొంగిలింపు పొరపాటు ఘటన కాదు. సీమాంధ్ర పాలకవర్గ దోపిడీ సంస్కృతికి, సంకుచిత మనస్తత్వానికి మచ్చుతునక.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి