గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, నవంబర్ 07, 2014

విద్యుత్ పాపాలెవరివి?

-నేడు అసెంబ్లీలో కరెంటు సమస్యపై చర్చ
-విపక్షాల విమర్శలకు దీటుగా బదులివ్వనున్న సర్కార్ 
-వాస్తవ స్థితిని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం  
తెలంగాణకు టీడీపీ, కాంగ్రెస్ అన్యాయాలపై గణాంకాలతో చర్చకు సిద్ధమైన అధికారపక్షం

తెలంగాణలో విద్యుత్ సమస్యలపై వాస్తవాలను మరింతగా ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు దీటుగా సమాధానమివ్వడమేకాకుండా సమస్య తీవ్రతకు కారణాలు వివరిస్తూ, అందుకు కారకులు ఎవరనేది తేటతెల్లం చేయాలనీ, టీడీపీ, కాంగ్రెస్‌ల పాపాల మూట విప్పాలని యోచిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు (టీడీపీ, కాంగ్రెస్) తెలంగాణపట్ల ప్రదర్శించిన వివక్షే ప్రస్తుత పరిస్థితులకు కారణమనే వాస్తవాలను సభద్వారా ప్రజలకు స్పష్టం చేయనున్నది. అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో కరెంటు కష్టాలపై నోరు మెదపని పార్టీలు కొత్త రాష్ట్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన ఐదు నెలల ప్రభుత్వంపై ఆరోపణలు చేయడాన్ని అధికారపక్షం తీవ్రంగా పరిగణిస్తున్నది. 

electricity-power-stations

నిజాంకాలంలోనే విద్యుత్‌కాంతులను నింపుకున్న తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయాలు, మౌలిక వనరుల (నీళ్ళు, నిధులు, బొగ్గు) దోపిడీ, తద్వారా ఉద్యోగాల దోపిడీవంటి అంశాలపై గణాంకాలతో సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని సమాచారం. అరవై ఏండ్ల తెలంగాణ పోరాటాలను పలుచన చేసిన కాంగ్రెస్, టీడీపీలు...అవి అధికారంలో ఉండగా తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించకుండా ఇక్కడి సింగరేణి బొగ్గును సీమాంధ్రకు తరలించి విజయవాడ, రాయలసీమలలో కొత్త ప్రాజెక్టులు ఏర్పాటుచేసిన తీరును ప్రభుత్వం ఎండగట్టనున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జిల్లాల విద్యుత్ కేటాయింపులను సీమాంధ్ర అవసరాలకు తరలించిన ఉదంతాలను ప్రస్తావించనుంది. గత రెండేండ్లలో తెలంగాణ విద్యుత్ అవసరాలకోసం కారిడార్ బుక్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పోలవరం ముంపు గ్రామాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుకుని లోయర్ సీలేరు విద్యుత్‌వాటాలో తెలంగాణకు మొండిచెయ్యి ఇస్తున్న వైనాన్ని ప్రభుత్వం సభ దష్టికి తీసుకురానున్నది.

electricity-power-stations

గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో లోయర్ సీలేరు జల విద్యుత్ కేంద్రం 1,263 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది. విభజన చట్ట ప్రకారం ఇందులో 53.89% విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వాలి. కానీ.. లోయర్ సీలేరు ఉత్పత్తి వివరాలను ఆంధ్రా సర్కారు డ్యూలింగ్ చేయకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. వాస్తవానికి గతేడాదిలో అప్పర్ సీలేరు-456 మిలియన్‌యూనిట్లు, లోయర్ సీలేరు- 1,263 మిలియన్ యూనిట్లు, డొంకరాయి-115 మిలియన్ యూనిట్ల చొప్పున సీలేరు బెల్ట్‌లో మొత్తం 1,834 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. సంవత్సరం పొడవునా ఈ మూడు ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి జరగడం విశేషం.

జెన్‌కో ప్రాజెక్టులు రాకుండా..


ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో పరిధిలోనూ కొత్త ప్రాజెక్టులు రాకుండా, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెరగకుండా కాంగ్రెస్ పాలకులు సీమాంధ్ర పెట్టుబడివర్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా కరీంనగర్‌జిల్లా నేదునూరు, రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. సకాలంలో నేదునూరు పూర్తయితే 2100మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి జరిగి ఉండేది. శంకరపల్లి పవర్‌ప్రాజెక్టు భూమి కేటాయింపులు 2000 సంవత్సరంలోనే జరిగినా నిర్మాణం ఊసే లేకుండా పోయింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్‌ఉత్పత్తి చేయాలని భావించారు. అది వ్యయంతో కూడుకున్నది కావడంతో దానిని గ్యాస్ పవర్ ప్రాజెక్టుగా మార్చారు. అయితే శంకరపల్లిని కాదని, దాని తర్వాత వచ్చిన సీమాంధ్రుల పవర్ ప్రాజెక్టుకు 2003లో కేంద్రం గ్యాస్ కేటాయించింది.

గ్యాస్ కేటాయింపులోనూ నేతల హస్తం


ల్యాంకో పవర్‌ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ కాంగ్రెస్ నేతల హస్తం లేకపోలేదు. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్‌ప్రాజెక్టు ఏకంగా విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతో జెన్‌కో స్థలాల మీదుగా ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మించారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలో ఔచిత్యం నాటి పాలకులకే తెలియాలి. అంతే కాకుండా మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు ఎపీ ట్రాన్స్‌కో సిఫార్సు చేయలేదు. ఆ తర్వాత ల్యాంకోకు గ్యాస్ కేటాయింపులకోసం నాటి రాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫార్సు చేయడం గమనార్హం. 

గత పాలకులదే పాపం


గత పాలకుల వివక్ష, ప్రస్తుతం వేసవిని తలపిస్తున్న వాతావరణంతో తెలంగాణ జిల్లాలు కరెంటు కష్టాలను చవిచూస్తున్నాయి. మార్చిని తలపించేలా భానుడి ప్రతాపం ఉండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పారిశ్రామికరంగానికి మొదట్లో వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించడమే కాకుండా పట్టణాలు, ముఖ్యనగరాల్లో కొన్ని గంటలపాటు కరెంటు కోతలను అమలుచేసింది. ఇటీవల హుదూద్ తుఫాన్‌వల్ల వాతావరణం చల్లబడడంతో పరిశ్రమలకు పవర్ హాలిడేను ఒక రోజుకు కుదించారు. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు జరిపి, పంటలను కాపాడే ప్రయత్నంచేసింది. అక్టోబర్‌లో యూనిట్‌కు రూ.8.62ల చొప్పున 14 మిలియన్‌యూనిట్ల విద్యుత్ కొనుగోలుచేసిన సందర్భాలున్నాయి. 

విద్యుత్ సమస్యల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు


దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు చర్యల్లో భాగంగా వచ్చే 25 ఏండ్ల కు 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 500 మెగావాట్లు వినియోగంలోకి రానున్నాయి. 2016 అక్టోబర్ నుంచి ఏడేండ్లపాటు మరో రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఇటీవల టెండర్లను కూడా ఆహ్వానించింది. స్వల్పకాలిక చర్యల్లో భాగంగా 2015 మే 29నుంచి రెండువేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో 1,718 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ధరల విషయంలో చర్చలు జరుగుతున్నాయి. 

రాష్ట్రంలో సౌరశక్తికి అపార అవకాశాలున్న నేపథ్యంలో ప్రైవేటురంగంలో సోలార్ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగవంతంగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్టుల ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు తొలివిడతగా 500 మెగావాట్ల టెండర్లు నిర్వహించగా దాదాపు నాలుగురెట్లు స్పందన లభించడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకుని మరో 500మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల అనుమతుల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం ప్రైవేటురంగంలో విండ్ పవర్ ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నది. ఇటీవలే రంగారెడ్డి జిల్లా పరిధిలో 300 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్టుకు అనుమతించడమే కాకుండా మరో 300 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుపై పరిశీలిస్తున్నది. 

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం


రాష్ట్ర విద్యుత్ అవసరాలకోసం ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈమేరకు ఇటీవల సీఎం కేసీఆర్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి