తెలంగాణ ప్రజలకు స్వయం పాలన సాధ్యం కాదని చెప్పడానికి, తెలంగాణపై మళ్ళా పట్టు సాధించడానికి పరాయి శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణవాదం సుడిగాలిలా అన్ని మూలల్లో , అన్ని పార్శ్వాలలో చుట్టుకొంటున్నది. తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా సీమాంధ్ర వ్యాపార లాబీలు, మీడియా, వారి భుజాన వాలి ఉన్న చిలుకల్లాంటి కుహనా ఉద్యమకారులు, కుహనా మేధావులు కూడబలుక్కుని దాడి చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ శక్తులు ఏకం కావడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి చేస్తున్న యత్నాలకు మద్దతు ఇస్తున్నారు.
సభాపతుల నిర్ణయం ఎట్లా ఉన్నప్పటికీ ఈ విషయమై చర్చ మాత్రం సాగుతూనే ఉన్నది. అసలు ఎమ్మెల్యేలు పార్టీ మారడం సమర్థనీయమా కాదా? వీరు ఏ పరిస్థితులలో మారవలసి వచ్చింది? ఇప్పటి వరకు ఎన్నో సార్లు పార్టీ మారడం జరిగినా, అప్పుడు నోరు విప్పని మేధావులు ఇప్పుడే ఎందుకు దీనినొక చర్చనీయాంశంగా స్వీకరించారు? గతంలో జరగనంత రచ్చ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నదనే అంశాలు చర్చించుకోవడం అవసరం.
ఫిరాయింపు నిరోధక చట్టం ఏ నేపథ్యంలో వచ్చింది? వచ్చినప్పటి నుంచి అది పోషించిన పాత్ర ఎటువంటిది? ఫిరాయింపు నిరోధక చట్టం ప్రజాస్వామ్య బద్ధమైనదేనా? ఈ చట్టానికి కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కొందరు పెద్ద మనుషులు పవిత్రతను ఆపాదించి ముందుకు తెస్తున్నారు ఎందుకు? అనే సందేహాలు కూడా నివృత్తి చేసుకోవలసిన సందర్భమిది.
ఫిరాయింపు నిరోధక చట్టం చేయడం వెనుక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతిని, క్రమంగా బలపడుతున్న కేంద్రీకృత ధోరణులను అర్థం చేసుకోవాలె. 1980 నాటి మన దేశ పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలె. వివిధ దేశాలలో ఉద్యమాలు చెలరేగి హక్కుల కోసం ప్రజలు పాత వ్యవస్థలను కూలదోస్తున్న కాలంలో బ్రిటన్‌లో కానీ ఇతర దేశాలలో కానీ ప్రజాస్వామ్య చట్టాలు చాలానే వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంటు చక్కగా రూపుదిద్దుకుంటున్న కాలంలో- శాసనకర్తకు ఎంతో స్వేచ్ఛ ఉండేది. పార్లమెంటు ఇప్పటితో పోలిస్తే ఆనాడు ప్రభుత్వాన్ని కొంత సమర్థవంతంగానే నియంత్రించేది. కానీ ఆ తరువాత కాలంలో అంతర్జాతీయ పోకడలలో మార్పు వచ్చింది.
ప్రజలు సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేయడం మొదలైంది. పార్లమెంటరీ ప్రభుత్వం క్యాబినెట్ ప్రభుత్వంగా మారింది. పార్లమెంటరీ వ్యవస్థలో ఉండే సార్వత్రిక ఆమోదం, సర్దుబాట్లు స్థానం లేకుండా పోయాయి. పార్లమెంటును, క్యాబినెట్‌ను ప్రధాని తన కనుసైగలతో శాసించడం మొదలైంది. 1980 దశకం అంటే మన దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు భూమిక తయారవుతున్న దశ అది. (ఆర్థిక సంస్కరణలు పీవీతోనే హఠాత్తుగా ప్రారంభం కాలేదని గ్రహించాలె) ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మౌలికంగా మార్చకుండానే, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ఆకాంక్షలు, రాజ్యాంగ నిర్మాతల భావనలకు విరుద్ధంగా కార్పొరేట్ పాలన అడుగుపెట్టడానికి రంగం సిద్ధమవుతున్న కాలం.
కొత్త పారిశ్రామిక విధానంతో సహా అనేక కొత్త సంస్కరణలు అందమైన పేర్లతో వస్తున్న కాలమది. అప్పుడే కీలకమైన పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఫిరాయింపు నిరోధక చట్టం ముందుకు వచ్చింది. అనేక అప్రజాస్వామిక పోకడలు సాగుతున్న కాలంలో ఏ ప్రజా ఉద్యమం లేకుండానే, ఎవరి ఒత్తిడి లేకుండానే ఒక ప్రజాస్వామ్య చర్యను ఆనాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందనేది ఏ మాత్రం ఆలోచించినా అర్థమవుతుంది. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఆనాడు లోక్‌సభలో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు 401 మంది ఉన్నారు. ఇది అసాధారణం.
ఇంత మెజారీటీని చంకలో పెట్టుకొని బలమైన ప్రతిపక్షమంటూ లేనప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఫిరాయింపు నిరోధక చట్టం చేయవలసిన అవసరమే లేదు. దీనిని బట్టి ఈ చట్టం చేయడానికి వేరే కారణాలు ఉన్నాయని అర్థమవుతున్నది. ఆర్థిక రంగంలో విధానపరమైన మార్పు రావడం ప్రధాన కారణం. రాబోయే కాలంలో ప్రజా సంక్షేమ పథకాలు తగ్గిపోవడం, పారిశ్రామిక రంగానికి భారీ రాయితీలు ఇవ్వబోతున్నందున ఏ మాత్రం అసమ్మతి ఉన్నా తుంచి వేయడానికి రంగం సిద్ధమైంది. మరోవైపు వివిధ అస్తిత్వాల వ్యక్తీకరణను తునిమి వేయడానికి దేశంలోని కేంద్రీకృత శక్తులకు ఈ చట్టం అవసరమైంది.
ఫిరాయింపు నిరోధక చట్టం అనేది శాసనకర్తల పాలిట టాడా చట్టం వంటిది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా ప్రతినిధికి పూర్తి స్వాతంత్య్రం ఉండాలె. తాను ఎన్నుకున్న ప్రజల తరఫున స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఓటేయడానికి అవకాశం ఉండాలె. కానీ ఫిరాయింపు నిరోధక చట్టం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన- ప్రజా ప్రతినిధికి ఉండే ఈ స్వేచ్ఛను హరిస్తుంది. తన ప్రజల ప్రయోజనాలకు, తన అభిమతానికి విరుద్ధంగా ఉన్నా సరే, పార్టీ నాయకత్వం చెప్పినట్టు ఓటేయాలె. లేకపోతే సభ్యత్వానికి అర్హులు కావలసి వస్తుంది. ఉదాహరణకు తెలంగాణకు లేదా జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రజా ప్రతినిధులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఎంతగా వాదించినా చివరికి పార్లమెంటులో విప్‌కు అనుగుణంగా ఓటు వేయక తప్పదు. కనీసం ఓటింగ్‌కు గైర్హాజరు అయినా పార్టీ నాయకత్వం సభ్యత్వాన్ని రద్దు చేయించగలదు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధి పాత్రనే కీలకమైంది. మొత్తం ప్రజాస్వామ్య సౌధం నిలబడేదే ఈ స్తంభంపైన. ఎంత గొప్పగా చెప్పుకున్నా- ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఇతర అంగాలైనా, పత్రికా వ్యవస్థ అయినా, స్వచ్ఛంద సంస్థలైనా ప్రజా ప్రాతినిధ్య సంస్థకు సాటిరావు. ప్రజాప్రతినిధి బాధ్యత అంత్యంత గురుతరమైనది, పవిత్రమైనది. రాజ్యాంగంలో ప్రజా ప్రతినిధికి గుర్తింపు ఉంటుంది. కానీ రాజకీయ పక్షాల ప్రస్తావనే లేదు. ఏ పక్షాన ఉన్నాడనే దానికి అతీతంగా ప్రజాప్రతినిధికి స్వీయ గుర్తింపు ఉంటుంది. అటువంటి ప్రజా ప్రతినిధి చేతులు కట్టేయడం ఈ ఫిరాయింపు వ్యతిరేక చట్టం పేరుతో సాధ్యపడింది.
ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటున్నది కదా అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఫిరాయింపు అనేది ఒక రుగ్మత కాదు. ఒక వ్యవస్థను పీడిస్తున్న రుగ్మత వల్ల కనిపిస్తున్న లక్షణమది. రాజకీయాలను వ్యాపార లాబీలు శాసించడం అనేది నేటి సమస్య. ఈ రుగ్మత వల్ల కనిపించే లక్షణమే ఫిరాయింపులు. సరళీకరణ విధానాల వల్ల దేశంలో అవినీతి పెద్ద పెట్టున పెరిగి పోయిందనేది అందరికీ తెలిసిందే. సామాజిక, ప్రకృతి వనరులన్నీ కొన్ని పాలక ముఠాల చేత పెట్టడం వల్ల ప్రజాస్వామ్యం భ్రష్టు పడుతున్నదని, పెరిగిన అంతరాలు సమాన అవకాశాల హక్కులకు భంగకరమని మన అనుభవానికి వచ్చింది. ఈ పోడకలను అరికట్టడానికి బదులు, ఈ విధానాలను మరింత లగాయించి అమలు పరచడానికి వీలుగా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని, ఇతర ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలను అమలుపరిచారు. ఫిరాయింపు నిరోధక చట్టం ముసుగులో మొదలైన ప్రజాస్వామిక హక్కుల హరణం ఆ తరువాత భారీ ఎత్తున సాగింది. ఇరవయవ శతాబ్దం పూర్వార్ధం వరకు సాధించుకున్న హక్కులన్నిటినీ నామమాత్రం చేసింది.
రాజకీయ రంగాన్ని పీడిస్తున్న రుగ్మతను ముదరబెడుతూ దాని లక్షణానికి చికిత్స చేస్తున్నామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే. ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిన వారికి ఫిరాయింపులను నిరోధించి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే ఉద్దేశమే లేదు. అందుకనే ఫిరాయింపు నిరోధక చట్టం ఆచరణలో విఫలమైంది. పైకి చెబుతున్న లక్ష్యం నెరవేరలేదు. ఉదారవాద ప్రజాస్వామ్యంలో చట్టాలు కఠినంగా ఉండకూడదని కోరుకుంటాం. సాధారణంగా చట్టాలు అమలులోకి వచ్చే సరికి బలవంతులకు వర్తించవు. బలహీనుల పాలిట సంకెళ్ళుగా మారుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుంటే ప్రజాస్వామ్యం నిరర్థకమవుతుంది.
ఫిరాయింపు నిరోధక చట్టం ప్రభావం ఇందుకు భిన్నంగా లేదు. ఫిరాయింపు వ్యతిరేక చట్టం వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధి తన అసమ్మతిని ఓటు ద్వారా వ్యక్తం చేసే శక్తిని కోల్పోయాడు. కానీ వ్యాపార లాబీలు ప్రజా తీర్పును, ప్రజాస్వామ్య ఆకాంక్షలను వమ్ము చేయడానికి పెద్ద ఎత్తున ఫిరాయింపులను జరపడం మాత్రం సాధ్యం అవుతున్నది. ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చిన తరువాత ఈ మూడు దశాబ్దాలలో ఈ చట్టం విఫలమైందనడానికి దేశ వ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి లోక్‌సభ స్పీకర్ల తీర్పులలో వైరుధ్యాలున్నాయి. వివిధ సందర్భాలలో న్యాయస్థానాల స్పందన ఒకేలా లేదు.
ఫిరాయింపు నిరోధక చట్టం పాత్ర ఎటువంటిదో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మన కండ్ల ముందే ఉన్నాయి. సీమాంధ్రకు చెందిన ఒక పాలక భూస్వామ్య- పెట్టుబడిదారీ వర్గం ఎన్టీఆర్‌ను కూలదోసి అతి సునాయాసంగా మరో నాయకుడిని ఆ స్థానంలో ప్రతిష్ఠించగలిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి బలమైన ప్రజా ఉద్యమం సాగుతున్న కాలంలో కూడా- వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టీఆరెస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించగలిగారు.
ఆనాడు స్పీకర్ సాగదీసి సాగదీసి శాసన సభ గడువు ముగుస్తున్నప్పుడు వారిని అనర్హులుగా ప్రకటించారు. అప్పుడు ఈ మేధావులు, పత్రికలు ఈ ఫిరాయింపును తూర్పార బట్టాయా? దానిని టీఆరెస్ నాయకత్వ వైఫల్యంగా ముద్రవేసిన ఘనులు కూడా ఉన్నారు. ఇప్పుడు న్యాయవ్యవస్థ తలుపు తట్టిన వారు ఆనాడు ఎక్కడున్నారు? ప్రజల ఆకాంక్షలను అంత బహిరంగంగా అవమానిస్తుంటే ఈ ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నీ ఏ మడుగులో దాక్కున్నాయి?
తెలంగాణకు అనేక సమస్యలున్నాయి. హైదరాబాద్‌ను కాపాడుకోవడం, నీటి వాటా సాధించడం మొదలుకొని అనేక సందర్భాలలో ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఓటేసే హక్కు శాసనకర్తకు ఉండాలె. తెల్లారితే ప్రజలకు జవాబు ఇచ్చుకోవలసింది ప్రజాప్రతినిధే. శాసన సభకు ఎన్నికైన సభ్యుడు మళ్ళా ప్రజల ముందుకు పోయినప్పుడు తాను ఏ విధంగా వారి ప్రయోజనాలను కాపాడిందీ చెప్పుకోగలగాలె. అట్లా కాకుండా, తాను ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం - చంద్రబాబు ఏజెంటు చెప్పినట్టు ఓటేశానని చెప్పుకుంటాడా! అట్లా చెప్పుకుంటే విధి నిర్వహణ అవుతుందా? ప్రజలు క్షమిస్తారా?
తెలంగాణ ఉద్యమం ఇంకా సాగుతున్నది. తెలంగాణ శక్తుల ఏకీకరణ సాగుతున్నది. 1990 దశకంలో ఆకాంక్ష, 2001లో తెలంగాణ రాజకీయ శక్తి (టీఆరెఎస్) ఆవిర్భావం, 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష, 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఘట్టాల నేపథ్యంలో...పరిశీలిస్తూ పోతే తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా ఉద్యమ గమనం, తెలంగాణ శక్తుల ఏకీకరణ ఎట్లా సాగుతున్నదో తెలుస్తుంది. ఈ మొత్తం పోకడకు భిన్నంగా సాగిన పార్టీ మార్పిడుల పట్ల మౌనం వహిస్తారు. కానీ చారిత్రక గమనానికి అనుగుణంగా సాగే పార్టీ మార్పులను మాత్రం ఫిరాయింపులు అంటారా? అందుకే కదా ’మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అంటారా...అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపుల పైనే కాదు, మీ పంచన గల మేధావులు, మీడియా ప్రవచిస్తున్న నీతిసూత్రాలు ఏమిటో, విలువలు ఏమిటో అన్నీ బహిరంగంగా చర్చించడానికి తెలంగాణవాదులు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణ ప్రజలకు స్వయం పాలన సాధ్యం కాదని చెప్పడానికి, తెలంగాణపై మళ్ళా పట్టు సాధించడానికి పరాయి శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయి. ఇందుకు భిన్నంగా తెలంగాణవాదం సుడిగాలిలా అన్ని మూలల్లో , అన్ని పార్శ్వాలలో చుట్టుకొంటున్నది. తెలంగాణ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా సీమాంధ్ర వ్యాపార లాబీలు, మీడియా, వారి భుజాన వాలి ఉన్న చిలుకల్లాంటి కుహనా ఉద్యమకారులు, కుహనా మేధావులు కూడబలుక్కుని దాడి చేస్తున్నారు. ఈ దశలో తెలంగాణ శక్తులు ఏకం కావడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి చేస్తున్న యత్నాలకు మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు రాజకీయాలలో విలువలు ఉండాలనే కోరుకుంటున్నారు. నాభి భాగానికి పైన కొట్టామా కింద కొట్టామా అనేది ధర్మయుద్ధానికి సంకుచితమైన నిర్వచనం. ప్రజల పక్షాన పోరాడడమే ధర్మ యుద్ధం. రేఖకు ఎవరు ఏ వైపున ఉంటారనేది ప్రధానం. ధర్మమేవ జయతే.
వ్యాస రచయిత: పరాంకుశం వేణుగోపాల స్వామి
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి