-31కల్లా కౌన్సెలింగ్ పూర్తిచేయాలి..
-పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిర్వహించాలని ఆదేశం
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదంలో ఫీజులు, స్థానికత అంశాల జోలికి వెళ్లకుండానే సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించింది. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 31వ తేదీకల్లా పూర్తిచేయాలని ఆదేశాలు జారిచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.-పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నిర్వహించాలని ఆదేశం
జస్టిస్ హెచ్‌జే ముఖోపాధ్యాయ, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. గతవారం విచారణ సందర్భంగా జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియను ఆగస్టు 31కల్లా పూర్తిచేయాలని నిర్దేశించింది. సోమవారం విచారణ ప్రారంభం కాగానే ఈ కేసు విషయంలో స్థానికత జోలికి వెళ్ళడం లేదు. అక్టోబర్ 31వ తేదీ వరకు కౌన్సెలింగ్‌కు గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఆగస్టు 31కల్లా పూర్తిచేయాలని ఆదేశించాం.
ఇందుకు ఏమైనా అభ్యంతరాలుంటే వాదించవచ్చు అని డివిజన్ బెంచ్ సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదిస్తూ అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరారు. జస్టిస్ ముఖోపాధ్యాయ జోక్యం చేసుకొని ఆగస్టు 31కల్లా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసేందుకు గతవారం విచారణ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది ఒప్పుకొన్నారని, మళ్ళీ ఇప్పుడు గడువు పెంపు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. మళ్ళీ గడువు పెంపు అడిగితే ఈ పిటిషన్‌నే తిరస్కరించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
అనంతరం ఏవైనా అభ్యంతరాలున్నాయా? అని ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది పీవీ రావును ప్రశ్నించారు. దీనికి పీవీ రావు తమ అభ్యంతరాలను ఇప్పటికే కోర్టుకు సమర్పించామని తెలిపారు. జడ్జి స్పందిస్తూ తమ వద్దకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. తెలంగాణ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం లేకుండానే నోటిఫికేషన్ జారీ అయిందని ప్రస్తావించగా.. తెలంగాణ తరఫున ఇప్పటికే చాలామంది న్యాయవాదులు వాదించారు, ఎంతమంది వాదించాలనుకుంటున్నారని జస్టిస్ ముఖోపాధ్యాయ ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టానికి ఇన్ని సమస్యలు ఉంటే ఎలా అని వ్యాఖ్యానిస్తూ తన స్వంత అనుభవాన్ని మరోమారు ఉదహరించారు.
బీహార్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తాను జార్ఖండ్‌కు చెందుతానా? లేక బీహార్‌కు చెందుతానా? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదని, అందువల్ల ఇండియన్‌గానే చెప్పుకొంటున్నానని వివరించారు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఏర్పడిందని, జూలై 31వ తేదీకల్లా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ కొత్త రాష్ట్రం సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 31 వరకు పొడిగించామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మీద స్పష్టత రాకపోవడం, తగినంతమంది సిబ్బంది లేని కారణంగా కౌన్సెలింగ్‌కు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరిందని చెప్పారు. అన్ని కోణాల నుంచి పరిశీలించి ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాది పీవీ రావు జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్నది కాబట్టి కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను ఏ విధంగా నిర్వహించాలని ప్రశ్నించగా.. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ప్రస్తావించగా, ఇప్పుడు విచారిస్తున్న కేసు ఆ అంశానికి సంబంధినది కాదని, దాని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వేరుగా విచారించవచ్చు అని బదులిచ్చారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి