గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 02, 2014

ప్రజా ఉద్యమ ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం : కేసీఆర్


తెలంగాణ ప్రజల కల సాకారమైన ఈ శుభ తరుణంలో సమస్త తెలంగాణ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో... ఈవిజయం ప్రజలది. అనేక గెలుపులు, ఓటమిల తర్వాత తెలంగాణ వచ్చింది. అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎన్నటికీ మరువలేనిది. తెలంగాణ ఆవిర్భావ ఘట్టంలో అన్ని వర్గాలు భాగస్వాములే. తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేయాలని తలపెట్టింది. అవినీతిని పారదోలడమే లక్ష్యంగా పని చేస్తాం. రాజకీయ అవినీతి అంతానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాజకీయ అవినీతిని పెకిలించినప్పుడే అభివృద్ధి జరగుతుంది. ప్రభుత్వ పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతుంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మురికి వాడల్లేని నగరంగా అభివద్ధి చేస్తాం. మహిళలపై ఆగడాలను మా ప్రభుత్వం ఎంత మాత్రం సహకరించదు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తాం. 

తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్
తెలంగాణ ఉద్యోగులందరికీ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ పే స్కేలు ఇస్తాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వీలైనంత త్వరగా హెల్త్ కార్డులు ఇస్తాం. పీఆర్సీ అమలు చేస్తాం. ఉద్యోగుల సకల జనుల సమ్మె మరువలేనిది. 

ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తాం. వృద్ధులకు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 ఫించన్ తప్పకుండా ఇస్తాం. బలహీన వర్గాలకు గృహలను కట్టిస్తాం. 125 గజాల స్థలంలో ఒక హాలు, రెండు బెడ్‌రూమ్‌లు, కిచెన్ కట్టిస్తాం. రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తాం. 

సంక్షేమానికి పెద్ద పీట
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తాం. దళితులు, గిరిజనులు, మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో దళితులు, మైనార్టీలు, బీసీలు, గిరిజనుల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణను పునీతం చేస్తాం. రియల్ ఎస్టేట్ రంగాన్ని సంస్కరిస్తాం. విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. 

పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు
పోలీసులందరికీ రాష్ట్ర అవతరణ పతకాలు ఇస్తాం. పోలీసుల సమస్యలు నాకు తెలుసు. పోలీసుల సమస్యలపై ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడాను. హోంగార్డులకు మెడికల్ అలవెన్స్ ఇస్తాం. పోలీసుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తా. 

గ్రీన్‌హౌస్ సాగును ప్రోత్సహిస్తాం
దేశానికి విత్తనాగారంగా తెలంగాణ నిలుస్తుంది. గ్రీన్‌హౌస్ సాగును ప్రోత్సాహిస్తాం. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తాం. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక విధానం ప్రకటిస్తాం. రియల్‌ఎస్టేట్‌ను గాడిలో పెట్టి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాం. పారిశ్రామిక వర్గాల నుంచి సలహాలు తీసుకుంటాం. తెలంగాణలో పౌల్ట్రీ, ఫార్మా రంగాలకు భారీ ప్రోత్సాహం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి