గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 02, 2014

మన రాష్ట్రం...మన ముఖ్యమంత్రి...మన పాలన...




నేటినుంచే నవశకం 
- కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా...11 మంది మంత్రులుగా ప్రమాణం...
-పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలు
-గులాబీమయమైన రాజధాని హైదరాబాద్..
- హోరెత్తిన హుస్సేన్‌సాగర్
-అర్ధరాత్రినుంచే టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో సంబురాలు.. 
-జిల్లాల్లోనూ భారీ వేడుకలు

అరవై ఏళ్ల చీకట్లను చీల్చుకొని దూసుకొచ్చిన స్వేచ్ఛాకిరణం! వేయి మందికిపైగా అమరవీరుల స్ఫూర్తి జ్వలిస్తుంటే.. నాలుగు కోట్ల మంది ప్రజలు నిశీధి వీధుల్లో కాంతిరేఖలను అనుభూతించిన అపూర్వ సందర్భం! సంబురం.. సంరంభం..! ఉల్లాసం.. ఉత్సాహం.. పట్టపగ్గాలేని ఆనందం! తెలంగాణ గజ్జె పది జిల్లాల్లోనూ ఘల్లుమన్నది! స్వేచ్ఛను ప్రకటించింది తెలంగాణ డప్పు! జాతిని జాగతపరిచిన గీతాల జనజాతర! గుండెలు నిండిన ఆత్మగౌరవం! పోరాడితే పోయిందేమీ లేదు.. వలసపాలన సంకెళ్లు తప్ప!


అవును.. మన స్వప్నం నిజమైంది! కొన్ని రుధిర ధారలు.. మరికొన్ని అగ్నిజ్వాలలు పునీతం చేసిన గడ్డ ఇది! లక్షల మంది త్యాగాల పునాదులపై ఆవిష్కృతమైన జనసౌధమిది! ఇప్పుడిది విముక్త తెలంగాణ మాగాణం! జూన్ రెండు తొలి ఘడియ.. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం! ఇప్పుడిక మన రాష్ట్రంలో మనం! ఈ అపురూప సందర్భాన్ని పది జిల్లాలు ప్రణమిల్లి స్వాగతించాయి! ఊరూవాడా.. పల్లె పట్నం తన్మయత్వంతో ఊగిపోయాయి! జై తెలంగాణ నినాదాలు.. పటాకుల మెరుపులతో తెలంగాణ ప్రగతిబాట జాజ్వల్యమైంది! ప్రజలు పట్టం గట్టిన మన ఇంటిపార్టీ అధినేత కేసీఆర్.. ఆ వెలుగుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నేటి ఉదయం 8.15 గంటలకు ప్రమాణం స్వీకరించగానే ఇక తెలంగాణకు శాసించే దశ వచ్చింది!

సీమాంధ్ర పాలకులపై తెలంగాణ ప్రజలు జరిపిన ఆరు దశాబ్దాల పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం సాకారమయింది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ నేడు ఆవిర్భవించింది. రాష్ట్రపతిపాలనను ఎత్తివేస్తూ సోమవారం ఉదయమే కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేయడంతో తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చింది.


నూతన రాష్ట్రానికి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌సేన్ గుప్తా రాజ్‌భవన్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అంతకు ముందే కేసీఆర్ ఉదయం 7.30 గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపానికి్ నివాళులు అర్పించి రాజ్‌భవన్ చేరుకున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం,ఆయనతో పాటు తెలంగాణ తొలి మంత్రివర్గం కొలువుదీరింది. 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

కేసీఆర్ మంత్రివర్గం....
1. మహముద్ అలీ (ఎమ్మెల్సీ) - 1953, మార్చి 2న జన్మించారు. విద్యార్హత : బి. కామ్. 2013లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు. 

2. డా. తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే) - 1965, జూలై 12న జన్మించారు. స్వస్థలం - వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత - ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. 

3. నాయిని నర్సింహారెడ్డి - జననం : 1940, మే 12. స్వస్థలం : దేవరకొండ మండలం నేరేడుగొమ్ము(నల్లగొండ జిల్లా). విద్యార్హత : హెచ్‌ఎస్‌సీ. 1978, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 

4. ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మెల్యే) - జననం : 1964, మార్చి 20. విద్యార్హత : బీఎస్సీ, హుజురాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. 2004, 2008, 2009, 2010, 2014 ఎన్నికల్లో విజయం. ఏడేళ్ల పాటు టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా పని చేశారు. 

5. పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ ఎమ్మెల్యే) - 1949, ఫిబ్రవరి 10న జన్మించారు. విద్యార్హత - బీఈ. 1994, 1999, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉంది. 

6. తన్నీరు హరీష్‌రావు (సిద్దిపేట ఎమ్మెల్యే) - జననం : 1972, జూన్ 3. స్వస్థలం : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి. 2004, 2008, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా పని చేశారు. 

7. పద్మారావు(సికింద్రాబాద్ ఎమ్మెల్యే) - రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

8. పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే) - నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం. 

9. కె. తారకరామరావు (సిరిసిల్ల ఎమ్మెల్యే) - జననం : 1976, జూలై 26. స్వస్థలం : మెదక్ జిల్లా చింతమడక. విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంబీఏ. 2009, 2010, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. 

10. జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే) - 1963, జులై 4న జన్మించారు. స్వస్థలం : జైనథ్ మండలం దీపాయిగూడ. విద్యార్హత : ఇంటర్మీడియట్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. 

11. జగదీష్‌రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే) - జననం : 1965, జులై 18. స్వస్థలం : అర్వపల్లి మండలం నాగారం. విద్యార్హత : ఎల్‌ఎల్‌బీ, 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

గుండు మధుసూదనరావు గారు, మీకు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. తెలంగాణా రాష్ట్ర సిద్దికై మీ లాంటి కవులు చేసిన కృషి శ్లాఘనీయం, తెలంగాణా పునర్నిర్మాణంలోనూ మీ వంటి తెలంగాణా కవుల అవసరం ఎంతైనా వుంది. అందుకై మీకు భగవంతుడు సంపూర్ణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించు గాక.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు మల్లికార్జునస్వామిగారూ! తెలంగాణ రాష్ట్రసాధనలో మీరూ నేనూ సమానమైన పాత్రను పోషించాము. మన తెలంగాణ పునర్నిర్మాణంలోనూ తప్పక నా వంతు కృషి వుంటుంది. స్పందించి అభినందించినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి