గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 07, 2015

ఏపీఎస్‌ఎఫ్‌సీలో ఆంధ్రా అధికారుల అజమాయిషీ...!!!

- ఏపీకి కోట్ల రూపాయల ఉమ్మడి నిధుల మళ్లింపు
-వాటాలేదు.. హక్కేలేదంటూ అధికారుల దబాయింపు
రాష్ట్ర విభజన జరిగినా.. కొన్ని సంస్థల్లో ఇంకా ఆంధ్ర పెత్తనం కింద తెలంగాణ నలిగిపోతూనే ఉంది. చట్టం ప్రకారం ఆస్తుల విభజన చేయకుండా ఆంధ్రా అధికారుల ఆధీనంలోనే సంస్థలను కొనసాగిస్తూ.. చివరికి ఆ సంస్థలు తమవేనని, వాటిపై తెలంగాణకు ఎటువంటి హక్కూ లేదనే స్థాయికి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ)గా కొనసాగుతున్న ఆర్థిక సంస్థలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.



ఆంధ్రా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర విభజన జరిగినా తమ సంస్థను మాత్రం విభజించేదిలేదని మొండికేస్తున్నారు. విభజన లేదు.. తెలంగాణకు అసలు వాటాయే లేదంటూ అడ్డంగా వాదిస్తున్నారు. తమకు ఏ విభజన చట్టమూ వర్తించదని, ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. చట్టాలను ధిక్కరించి ఆర్థిక సంస్థలోని కోట్ల రూపాయల ఉమ్మడి నిధులను ఆంధ్రకు మళ్లిస్తున్నారు. తెలంగాణ వాటాగా రావాల్సిన సొమ్ముతో ఆంధ్రలో షోకు చేసుకుంటున్నారు. తాజా ఉమ్మడి నిధుల నుంచి దాదాపు రూ.20 కోట్లు మళ్లించడానికి రంగం సిద్ధం చేశారు.


బుధవారం జరిగే బోర్డు సమావేశంలో ఏకపక్షంగా ఈ నిధుల మంజూరుకు సిద్ధమయ్యారు. ఇదేమిటని తెలంగాణ ఉద్యోగులు, అధికారులు ప్రశ్నిస్తే, మీకు అడిగే హక్కు లేదు.. అసలు తెలంగాణకు వాటాయే లేదు అని తెగేసి చెప్పారు. దీంతో అధికారులు మంగళవారం సాయంత్రం హడావుడిగా పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ మేరకు నిధుల మళ్లింపును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఉమ్మడి నిధులపై ఆంధ్రా అధికారుల కన్ను..


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడాదిన్నర కావస్తున్నా ఏపీఎస్‌ఎఫ్‌సీలో మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్ అధికారుల అజమాయిషీ నడుస్తున్నది. ఉమ్మడి ఆస్తిపై వారే పెత్తనం చెలాయిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో మొత్తం బోర్టు సభ్యులంతా ఆంధ్రవారినే నియమించి తెలంగాణవారికి అప్పటి పాలకులు తీరని అన్యాయం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారులు బలవంతంగా ఒక సభ్యుడిని మాత్రమే బోర్డు డైరెక్టర్‌గా చేర్చుకున్నారు.


ప్రస్తుతం 11మంది సభ్యులున్న కమిటీలో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆస్తుల విభజన చేయకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 53ను ధిక్కరిస్తున్నారు. కార్పొరేషన్‌లో ఉమ్మడి ఆస్తులు, నిధులపై కన్నేసి.. రూ.168 కోట్ల నగదు నిల్వలను పంచకుండా ఖజానా తాళంచెవిని తమ వద్దే ఉంచుకున్నారు. నగదును 52:48 నిష్పత్తిలో విభజించాల్సి ఉండగా ఏపీకి 70శాతం, తెలంగాణకు 30శాతం మాత్రమే అని అడ్డంగా వాదిస్తున్నారు. తాజాగా అసలు ఎస్‌ఎఫ్‌సీకి విభజన చట్టమే వర్తించదంటూ ఏపీఎస్‌ఎఫ్‌సీ చైర్మన్ పీఎస్ అప్పారావు తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 


ఉద్యోగుల విభజనలోనూ అన్యాయం..


కార్పొరేషన్‌లో ఇప్పటివరకు ఉద్యోగుల విభజనలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు 120మందిని, ఆంధ్రకు 240మందిని కేటాయించామని అధికారులు రికార్డుల్లో చూపారు. కానీ దాదాపు 30శాతం ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ కోటాలో కలిపారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల విభజనతో మొదలైన పక్షపాత వైఖరి ఆస్తుల పంపకాల వరకు కొనసాగుతున్నదని ఎస్‌ఎఫ్‌సీ తెలంగాణ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఏ రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 


ఖజానా తాళంచెవితోపాటు బ్యాలెన్స్ షీట్‌ను కూడా వారి వద్దే పెట్టుకుని నిధులను గోల్‌మాల్ చేస్తున్నారని వారు ఆరోపించారు. తెలంగాణ భూభాగంలో రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలోని 271 ఎకరాల విలువైన భూమి, నానక్‌రామ్‌గూడలోని కార్యాలయం కూడా తమదేనని మొండిగా వాదిస్తున్నారని విమర్శించారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం షీలాభిడే కమిటీతో ఆస్తులు, అప్పుల విభజన జరగాల్సి ఉండగా దానిని ఆంధ్ర అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగుల ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిధుల మళ్లింపు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.



జై తెలంగాణ!     జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి