-మూడోరోజుకు చేరిన భద్రాచలం ఎమ్మెల్యే ఆమరణ దీక్ష
-శిబిరంలోని ఐదుగురిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
-ప్రాణం పోయినా దీక్ష ఆపను: సున్నం రాజయ్య స్పష్టీకరణ
-ఆదివాసీల హక్కులపై కేంద్రం దాడి: కోదండరాం
-ఆర్డినెన్స్ అంతిమతీర్పు కాదు: ఎంపీ సీతారాంనాయక్
పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని కోరుతూ ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో స్థానిక ఎమ్మె ల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది. రాజయ్య దీక్ష మూడో రోజు చేరుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. బీపీ, షుగర్, కీటోన్స్ లెవల్స్ పడిపోతున్నట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజులుగా రాజయ్యకు మద్దతుగా దీక్షలో పాల్గొన్న సీపీఎం నేతలు బండారు శరత్, చిచ్చడి మురళి,సోడే దుర్గారావు, కంగాల లక్ష్మీ, సోయం భారతిల ఆరోగ్యం క్షీణించడంతో తహసీల్దార్ సమక్షంలో పోలీసులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీక్షా శిబిరానికి ప్రజలు, వివిధ పార్టీల నేతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ముంపు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించే వరకు దీక్ష కొనసాగుతుందని, ఆదివాసీల కోసం ప్రాణాలు పోయినా ఫర్వాలేదన్నారు.
ఐదు వందలకుపైగా గ్రామాలను నీటముంచి గిరిజనుల సమాధులపై పోలవరం ప్రాజెక్టు పునాదులు తీసేందుకు కేంద్రం చేసిన కుట్రను అన్నివర్గాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలు ఆదివాసీలపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజయ్య దీక్షకు మద్దతు తెలిపిన టీ జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ఆదివాసీల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందని మండిపడ్డారు. ఒకరి కోసం మరొకరిని ముంచడం సరికాదన్నారు. ముంచకుండా నీటిని తీసుకెళ్లే మార్గాలున్నా కేంద్రం ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. కొందరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కోర్టులో కేసులున్నా క్లియరెన్స్ రాకున్నా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం, జలవిద్యుత్ కేంద్రం కోసం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపించారు. రాజయ్యకు మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మద్దతు తెలిపి మాట్లాడారు.
కొత్త ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని భావిస్తారని, బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను విచ్ఛిన్నం చేసే ఆర్డినెన్స్‌ను రహస్యంగా తీసుకొచ్చి అబద్ధాల ప్రభుత్వమనిపించుకుందన్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎంతోకాలం మనుగడ సాగించవన్నారు. గిరిజనులకు భరోసా ఇచ్చే ఐదో షెడ్యూల్‌ను రక్షించాల్సిన ఆర్డినెన్స్‌పై సంతకం చేయడం ఎంతవరకు సరైందని రాష్ట్రపతిని ప్రశ్నించామని వెల్లడించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి