గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 01, 2014

తీసుకునేది ఈ రాష్ట్రం జీతం...! పనిచేసేది పక్కరాఫ్ట్రం కోసం...!!

-ప్రణాళికల రూపకల్పనలో ఆంధ్ర అధికారిణుల పక్షపాతం
-ఏపీ ప్రణాళికకు ఆమోదం...తెలంగాణకు మొండిచేయి
-జాతీయ ఆరోగ్యమిషన్ లక్ష్యానికి తూట్లు
-900 మంది సిబ్బందికి అందని జీతాలు

ఇప్పటికీ అదే పక్షపాత బుద్ధి.. అదే ద్రోహ చింతన.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ఆంధ్ర అధికారుల మైండ్‌సెట్ మాత్రం మారడంలేదు. పక్కరాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణకు నష్టం కలిగించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. తీసుకునేది తెలంగాణ సర్కారు ఇచ్చే జీతమే అయినా.. వారి చూపంతా ఆంధ్రాపైనే.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల ప్రణాళికల రూపకల్పన. ఇద్దరు ఆంధ్రా మహిళా అధికారుల పక్షపాత వైఖరి కారణంగా తెలంగాణ ఏకంగా వందల కోట్ల నిధులను ఈ ఏడాది కోల్పోవలసి వస్తున్నది. ఆ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నల్లగొండ జిల్లాలోని దాదాపు 900మంది సిబ్బందికి ఆగస్టు నెల జీతం ఇంతవరకు అందకపోగా, సెప్టెంబరు మాసానికి చెందిన జీతాలు సైతం చెల్లించలేని దుస్థితి నెలకొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆర్థికసంవత్సరంలో రాష్ట్రంలో దవాఖానాలు, వాటి అవసరాలను గుర్తించి, కావాల్సిన నిధుల వివరాలతో సమగ్ర ప్రణాళిక తయారుచేసి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం వాటిని అధ్యయనం చేసి, అవసరమైన నిధులను మంజూరు చేస్తుంది. సాధారణంగా ప్రతి ఏటా డిసెంబరు, జనవరి మాసాల్లో ఈ ప్రణాళిక కేంద్రానికి సమర్పిస్తారు. ఈసారి మాత్రం మేనెల వరకు కూడా నివేదికలు పంపకపోవడంతో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రాష్ర్టానికి దక్కకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. 
రెండు ప్రణాళికలు వారే రూపొందించినా...

జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఆ ఇద్దరు ఆంధ్రా అధికారిణులే అటు ఆంధ్రప్రదేశ్‌కు, ఇటు తెలంగాణకు అవసరమైన ప్రణాళికలను వేర్వేరుగా తయారు చేసి కేంద్రానికి పంపారు. వారిప్రణాళికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య కమిషన్ కింద ఆంధ్ర ప్రభుత్వ ప్రణాళికను ఆమోదించి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికను మాత్రం తిప్పిపంపింది. ఉద్దేశపూర్వకంగానే ఆ అధికారిణులిద్దరూ తెలంగాణ ప్రణాళికను తప్పులతడకగా తయారుచేసి కేంద్రానికి సమర్పించడం వల్లే తిరస్కరణకు గురైందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన మహిళా అధికారులు తమ స్థానికతను కప్పిపుచ్చి, తెలంగాణవారిగా చెప్పుకొంటూ తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్త వాహనాల పంపిణీలోనూ..

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 108 సేవల కోసం ప్రభుత్వం కొత్త వాహనాలు కొనుగోలు చేసి జిల్లాలకు పంపింది. మే కన్నా ముందే కొత్త వాహనాల్లో చాలా వాటిని ఏపీకి తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్‌జిల్లాకు కేటాయించిన ఏడు కొత్త వాహనాలను తిరిగి తీసుకున్నారని, ఉన్న వాహనాలను సైతం సరిగ్గా నిర్వహించడం లేదంటూ 108 సిబ్బంది ఆరోపిస్తున్నారు.

మాతాశిశు సంరక్షణలో భాగంగా ఉచిత రవాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇస్తుండగా, 108 సేవలకు నిధుల కొరతను సాకు చూపిస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కొసమెరుపేమిటంటే నిధులు ములిగిపోతున్నా జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా కార్యక్రమ నిర్వహణవిభాగంలో పనిచేసే సిబ్బందికి ఆగస్టు జీతం కూడా చెల్లించకపోవడం. ఆరోగ్యమంత్రి రాజయ్య దీనిపై వెంటనే దృష్టి సారించి బతుకమ్మ పండగలోపు తమకు రెండు నెలల జీతాలు అందేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు. జవహర్‌లాల్ ఆరోగ్య రక్ష కింద పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సైతం ఐదునెలలుగా జీతాలు ఇవ్వలేదు. తమ బాధలను ఎవరూ పట్టించుకోవడంలేదని, సకాలంలో జీతాలు ఇప్పించాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లు విజ్ఞప్తిచేస్తున్నారు.

మిగిలిన రూ. 600 కోట్లకు కోత..

ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రభుత్వ దవాఖానాలపైనే ఆధారపడుతారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకే గత ఏడేండ్లుగా ఎక్కువ నిధులు కేటాయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమైక్య పాలకులు చేసిన నిర్లక్ష్యం, లోపాలు ప్రత్యేక రాష్ట్రం అనుభవించాల్సిన దుస్థితి నెలకొన్నది. ముఖ్యంగా సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలపై పూర్తిగా శీతకన్ను వేశారు. వాటి అభివృద్ధిని పాలకులు పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల్లో రూ. 600 కోట్లు ఖర్చుచేయకుండా దవాఖానాల అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం మంజూరు చేసే గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధుల్లో ఖర్చు చేయని రూ. 600 కోట్లకు కోత పడనుంది.
రూ. 600 కోట్లలో తెలంగాణ వాటా కింద రూ. 250 కోట్ల వరకు నష్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా మన రాష్ర్టానికి సుమారు రూ. 750 కోట్ల నిధుల రావల్సి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి విడుదలైన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసి ఉంటే ఈ యేడు మరింత ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి ఉండేవని వైద్యశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించి జాతీయ ఆరోగ్యమిషన్‌లో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులను కీలక బాధ్యతల నుంచి తప్పించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. 

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి