-సచివాలయ నాలుగో తరగతి టీ ఉద్యోగుల ఆందోళన
-సమతా బ్లాక్ ఎదుట బైఠాయింపు
-తెలంగాణలోనే పనిచేసేలా చూస్తా: కేసీఆర్
-ముఖ్యమంత్రి హామీతో ఆందోళన విరమణ
అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తమను పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై సచివాలయంలోని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులు మండిపడుతున్నారు. సచివాలయంలోని 300మందికిపైగా తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జారీచేయడం ఎంతమాత్రం తగదంటూ ఆందోళనకు దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చాంబర్ ఉన్న సమత బ్లాక్ ఎదుట బుధవారం ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కేసీఆర్ వ్యవసాయ రుణాల మాఫీ విధి విధానాలపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఆందోళన విషయం తెలిసి.. సమావేశం అనంతరం కేసీఆర్ నేరుగా ఉద్యోగుల వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడంలో తమకున్న అభ్యంతరాలను ఉద్యోగులు ముఖ్యమంత్రికి వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న కేసీఆర్.. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రకు పంపబోనని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందుకు సంబంధించి సెక్రటేరియట్‌లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నామని అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. తమకు అండగా ఉంటానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.
కాగా, ఉమ్మడి సచివాలయంలో పనిచేస్తున్న అటెండర్లు, స్కావెంజర్లు, జిరాక్స్ ఆపరేటర్లు, వాచ్‌మెన్లు, ఆపరేటర్లతోపాటు నాలుగో తరగతి ఉద్యోగుల్లో 300ల మందిని ఆంధ్రలో పనిచేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను కేంద్రం జారీచేసింది. ఉద్యోగుల అభ్యంతరాలను వినకుండానే ఏకపక్షంగా ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపడం ఎంతమాత్రం సరైందికాదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే.. చేయడానికి సిద్ధమేనని వారు పేర్కొంటున్నారు. ఆంధ్రా ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ విభజనలో కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. నిరసన కార్యక్రమంలో సచివాలయ తెలంగాణ క్లాస్‌ఫోర్ సంఘం అధ్యక్షుడు వెంకటేశం, సీఎన్ మోహన్, తెలంగాణ సచివాలయ రికార్డు అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎన్ నర్సింగరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత భిక్షంనాయక్, గోపాల్, లక్ష్మారెడ్డి, పద్మ, శ్రీకాంత్, జాకీర్ అహ్మద్, మాధవి, రెహానా పాల్గొన్నారు.
ద్వంద్వ వైఖరి వల్లే: నరేందర్‌రావు
ఉద్యోగుల విభజనలో అధికారులు చేపట్టిన ద్వంద్వ విధానాలే తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగుల ఆందోళనకు కారణమైందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితిలోనూ తాము తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రలో పనిచేసేందుకు ఒప్పుకోబోమన్నారు.
అందరినీ కాపాడుకుంటాం: శ్రీనివాస్ గౌడ్
ఆంధ్రాకు బదిలీ అయిన తెలంగాణ ఉద్యోగులందరినీ నెలరోజుల్లోపు తెలంగాణకు తీసుకువస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన తెలంగాణ ఉద్యోగులు విధుల్లో చేరకున్నా.. వారి ఉద్యోగాలకు ఏ ఢోకా ఉండబోదన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం కానున్నామని పేర్కొన్నారు. అనంతరం బీకేఆర్ భవన్‌లోని కార్యాలయం ఎదుట ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు శ్రీనివాస్‌గౌడ్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రచార కార్యదర్శి ఎం మోహన్‌నారాయణ, సంయుక్త కార్యదర్శి ఎంబీ కృష్ణయాదవ్, నాయకులు పీ శ్రీనివాసరావు, హరికృష్ణ, నర్సింగ్‌రావు, వందన పాల్గొన్నారు.
సచివాలయం వారి కబ్జాలో ఉన్నదని రుజువైంది: ఈటెల
ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలో కోస్తా ఉద్యోగులు ఉన్నతస్థానాల్లో.. తెలంగాణ ఉద్యోగులు కిందిస్థానాల్లో ఉన్నారనే విషయం నాలుగో తరగతి ఉద్యోగుల ఆందోళనతో రుజువైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులను తాము ఎట్టిపరిస్థితిలో ఆంధ్రా ప్రభుత్వానికి వెళ్లనీయమన్నారు. ఇప్పటికే గవర్నర్‌తో చర్చించామని, త్వరలోనే విధి విధానాలను తయారు చేయనున్నట్లు తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
ఇది చాలా మంచి విషయం. కేసీ ఆర్ గారు ఈ విషయం లో ఉద్యోగులకి మదద్ చెయ్యాలి
జిలేబి
ధన్యవాదాలండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి