గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 27, 2015

తెలంగాణలో కవులే లేరా...???!!!


ఆంధ్రులందరూ ఒకేజాతికి చెందినవారైనా ఆంధ్రదేశంలోని ప్రాంతాల భేదాన్నిబట్టి నిజామాంధ్రులు, కోస్తా ఆంధ్రులు, రాయలసీమ ఆంధ్రులు, కళింగాంధ్రులు అనే నాలుగు ప్రధాన భేదాలు కనిపిస్తాయి. నిజామాంధ్రులు నివసించే భూభాగాన్నే మనం ‘తెలంగాణ (పూర్వం త్రిలిఙ్గాన్ధ్రము)’ అని వ్యవహరిస్తున్నాం. ఏమి దురదృష్టమో కాని కొన్ని ప్రాంతాల పండితుల్లో, పెద్దల్లో తెలంగాణంలో తెలుగు లేదనీ, ఉన్నా అది సరైన తెలుగు కాదనీ నిష్కారణమైన అసత్యమైన అపోహ నేటికీ ఉంది. ఈ అపోహ కలిగిన వారు తెలంగాణంలోని మారుమూల పల్లెలకు వెళ్లితే తెలంగాణపు తెలుగు బాస సొగసులు వారికి తెలియవస్తాయి.

ఒక పండితుడు ‘నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు పూజ్యము’ అని గోలకొండ పత్రిక తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ఒక అభియోగం కూడా చేసినాడు, దానిని సహింపక తెలంగాణ వైతాళికుడైన సురవరం ప్రతాపరెడ్డిగారు ఎంతో శ్రమపడి తెలంగాణ ప్రాంతంలో కవుల వివరాలను సేకరించి ‘గోలకొండ కవుల సంచిక’ను ప్రచురించినారు. ఇందులో తెలంగాణ ప్రాంతమందలి 354 మంది ఆధునిక కవుల వివరాలను, 183 మంది ప్రాచీన కవుల వివరాలను పేర్కొనడం జరిగింది. తెలంగాణలో విలసిల్లిన సాహిత్యానికి అమూల్యమైన చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యంలోని శిఖరాయమాణులైన కవులెందరో తెలంగాణని పునీతం చేసినవారే. తెలుగు కవులకున్న వైశిష్ట్యాన్ని గుర్తించే ‘ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహా’న్ని రచించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు తమ గ్రంథంలో కొందరు తెలంగాణ కవులు అనే పరిచ్ఛేదాన్ని కల్పించినారు.

దీన్నిబట్టి తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ ప్రాంతపు కవులకు గల ప్రత్యేకతను గమనించవచ్చు. తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటిసారిగా దేశి పద్ధతిలో స్వతంత్ర రచన చేసిన కీర్తి తెలంగాణలోని పాలకుర్తికి చెందిన సోమనాథునికే చెందుతుంది. భాషలో, ఛందస్సులో, వస్తువులో ఎంతో నవ్యతను ప్రదర్శిస్తూ ఇతడు రచించిన బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర కావ్యాలు తెలుగు సాహిత్యానికి మణిదీపాలు. సోమన రచించిన వృషాధిప శతకం మకుట నియమం, సంఖ్యానియమం కలిగిన శతకాల్లో మొట్టమొదటిది. ప్రాచీన తెలుగు రామాయణాల్లో భాస్కర రామాయణం మిక్కిలి ప్రజాదరణను పొందిన గ్రంథం. ఎఱ్ఱన రచించిన రామాయణం లభ్యం కాలేదు కనుక లభ్యమైన మార్గ పద్ధతికి చెందిన రామాయణాల్లో ఇదే ప్రథమం. ఇది హుళక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు- ఈ నలుగురు కవుల సమష్టి కృషి. వీరిలో హుళక్కి భాస్కరుడు ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజుల ఆస్థానంలో ఉన్న కవి. భాస్కర రామాయణాన్ని అంకితం గొన్నది కాకతీయ సైన్యాధ్యక్షుడు సాహిణి మారన.

ఈ విధంగా లభ్యమైన మొదటి మార్గ రామాయణం కవులందరూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారే. భాస్కర రామాయణానికి కొద్ది ముందుగా వచ్చిన ద్విపద రంగనాథ రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి కూడా తెలంగాణ ప్రాంతపువాడే. ఆంధ్రులు అత్యంత భక్తితో ఆరాధించే మహాగ్రంథం పోతన భాగవతం. పోతన వరంగల్లు జిల్లాలోని బమ్మెర గ్రామానికి చెందినవాడు. ఈ కవి ప్రాంతం విషయంలో ఇప్పటికీ కొందరు వివాదాలు లేవనెత్తడం దురదృష్టకరమైన విషయం. మొట్టమొదటగా తెలుగులో అనువదింపబడ్డ పురాణం మార్కండేయ పురాణం. ఈ పురాణాన్ని తెనిగించిన మారన తిక్కన శిష్యుడై కొంతకాలం నెల్లూరులో ఉన్నా తరువాత వరంగల్లులో కొంతకాలం నివసించి రెండవ ప్రతాపరుద్రుని సేనా నాయకుడైన నాగయ్య గన్న నాయకునికి తన గ్రంథం అంకితం చేసినాడని విమర్శకుల అభిప్రాయం.

తెలుగులో మొదటి పురాణానువాదం వెలసిన కీర్తి తెలంగాణకే దక్కుతుందని చెప్పవచ్చు. అచ్చ తెలుగు కావ్యానికి మొట్టమొదటగా పురుడుపోసింది తెలంగాణమే. ఈ కావ్య రచయిత తన యయాతి చరిత్ర కావ్యాన్ని పొట్ల చెరువు (పట చెరువు) పట్టణానికి సర్దారైన అమీన్‌ఖానుకు అంకితం చేసినాడు. యక్షగాన ప్రక్రియకు మొదటిగా నారు పోసినవాడు, కందుకూరి రుద్రకవి. ఈతని సుగ్రీవ విజయం మిక్కిలి ప్రసిద్ధం. ఇలా ఆయా ప్రక్రియల్లో మొదటగా సాహిత్య సృష్టి జరుగడమే కాక ఇంకెంతో సారస్వతం తెలంగాణంలో గణనీయంగా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవల తెలంగాణంలోని సారస్వతాన్ని గురించి ఎంతో కృషి జరుగుతుంది. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఈ విషయంపై ఒక పరిశోధన ప్రణాళిక సాగుతుంది. వివిధ కళాశాలల్లో గోష్ఠులు నిర్వహింపబడుతున్నాయి. అంతేకాక కొందరు పరిశోధకులు స్వయంగా ఈ విషయంపై కృషి చేసి ఎన్నో నూత్నాంశాలను వెలువరిస్తున్నారు.

అట్టి పరిశోధకుల్లో డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి అగ్రగణ్యులు. ఎన్నో సాహిత్య చరిత్ర గ్రంథాలను, శాసనాలను పరిశోధించి, సుమారు ఐదువందలమంది సంస్కృతాంధ్ర కవుల వివరణలతో సుమారు 800 పేజీల గ్రంథాన్ని రచించి తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసినాడనటంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యాఖ్యాతృ చక్రవర్తిగా విశ్వవిఖ్యాతి చెందిన మెదక్‌ జిల్లావాసి మల్లినాథుడు, ప్రతాపరుద్రుని ఆస్థానాన్ని అలంకరించిన విద్యానాథుడు, రాచకొండ ప్రభువు ఆస్థానంలో ఉన్న విశ్వేశ్వరుడు, ఓరుగల్లు నివాసియై సంస్కృతంలో సుమారు 74 కావ్యాలను రచించిన అగస్త్య కవి – ఇలా తెలంగాణంలో విలసిల్లిన సంస్కృత కవుల నెందరినో గుర్తించి ఇందులో వివరించడం విశేషం.

ఇందులో ఆయా కవులను యుగ విభజనానుసారంగా వివరించడం వల్ల తెలంగాణంలో వచ్చిన సాహిత్య పరిణామ క్రమం తెలుసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ గ్రంథం ఒక రకంగా తెలంగాణ సాహిత్య చరిత్ర అవుతున్నది. కవుల వివరణలతో పాటు వారి గ్రంథాలలోని శ్లోకాలనూ, పద్యాలనూ ఈ గ్రంథంలో ఉదాహరించడం వారి కవితా వైశిష్ట్యాన్ని గుర్తించడానికి ఉపకరిస్తుంది. ఐతే కొన్ని చోట్ల ఈ పద్యాలు పరిమితిని దాటినట్లుగా కనిపిస్తుంది. సంస్కృతాంధ్రాలలో రచింపబడ్డ తెలంగాణ శాసనాల్లో కావ్య సంపద ఎంతో ఉంది. సాహిత్య చరిత్రకారులు కావ్యఖండాలనదగిన శాసనకర్తలైన కవులను విస్మరించడం జరిగింది. నారాయణరెడ్డి ఈ విషయంలో కూడా ఎంతో కృషి చేసి అచింతేంద్రయతి, మయూరసూరి, ఈశ్వర భట్టోపాధ్యాయుడు మొదలైన సంస్కృత శాసన కవులను, ఇతర తెలుగు శాసన కవులను పేర్కొని వారి శాసనాల్లోని విషయాలను వింగడించడం విశేషం.

కుల పురాణాలను, జానపద కథలను పట్టించుకున్న సాహిత్య చరిత్రకారులు అరుదు. జాంబ పురాణం, విశ్వకర్మ పురాణం, మడేల్‌పురాణం, గౌడ పురాణం మొదలైన పురాణాలను, నల్లసోమనాద్రి కథ, సదాశివరెడ్డి కథ మొదలైన జానపద కథలను గూర్చి నారాయణరెడ్డి వివరించడం గ్రంథానికి అదనపు మెరుగు. ఈ గ్రంథం తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా వివరిస్తుంది. నారాయణరెడ్డి ఎంతో శ్రమకోర్చి, వివిధ గ్రంథాలు, శాసనాలు మొదలైనవి పరిశోధించి ఈ గ్రంథాన్ని రచించి తెలంగాణా సాహిత్య చరిత్రకే కాక ఆంధ్ర సాహిత్య చరిత్రకు కూడ ఎంతో సేవ చేసినాడు. ఇందుకు మిత్రుడు డా.నారాయణరెడ్డిని మనసారా అభినందిస్తున్నాను. పండితులు, జిజ్ఞాసువులు నారాయణరెడ్డి ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

తెలుగుకూ, తెలుగు కవులకూ ఇక్కయైన తెలంగాణను ప్రశంసిస్తూ శ్రీ మందడి వేంకటకృష్ణ కవి గారు చెప్పిన ఈ క్రింది పద్యంతో నా ‘అభినందన’ను ముగిస్తాను.

సీ.
కవితాలతాంగి స త్కారాళి మొదయదే
     ప్రతి వత్సరమున గ    ద్వాల సభల
ఆంధ్రభారతి మహ    దానంద మొందదే
     ప్రతి వత్సరము వన    పర్తి సభల
పండితమండల    ప్రాభవం బెసఁగదే
     ప్రతి వత్సరమున గో    పాలు పేట
ఆంధ్ర సాహిత్య వి    ద్యావినోదము లేదె
     యాత్మకూర్పురిని ప్ర   త్యబ్దమందు

గీ.
నిట్టియాస్థాన చయముల    కింపు బెంపు
తేజమొసగిన నైజాము    దేశమందు
తెలుగునకు నిక్కయైన యీ    దేశమందు
కవివరేణ్యులు పండితుల్‌    గలరు కలరు.
(గోలకొండ కవుల సంచిక. పుట 309)


  • ఆచార్య రవ్వా శ్రీహరి
  • (ఆగస్టు 2, 2009న హైదరాబాద్‌లోని సీఫెల్‌లో ఆవిష్కరణ జరగనున్న ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ )


(మద్గురుమూర్తులు ఆచార్య రవ్వా శ్రీహరిగారికి కృతజ్ఞతలతో)


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి