మేము విజయమ్మ నడ్డిన మెచ్చుకొనక,
“తీవ్రవాదు లీ తెలబాన్లు! ద్వేషమునను
నడ్డుచుండిరి! రాజ్యాంగ హక్కు నిటులఁ
ద్రోచి రయ వీరు! నేత నాక్రోశమునను
రా వలదటంచుఁ బల్కంగఁ, బ్రజల నెట్లు
తిప్పలను బెట్టెదరొ”యంచుఁ దెలివి తప్పి,
మాటలాడంగ సరియౌనె? మాకు నామె
యిచ్చిన వరాల మాటల వెక్క డయ్య?
“ఓ తెలంగాణ ప్రజలార! నీతి తప్పి
నేను నడువను! తెలగాణ నిచ్చునట్టి
దాన నేఁ గాను! కేంద్రమ్మె దాని నిచ్చు!
మీ తెలంగాణ సెంటిమెంట్ మేము గౌర
వింతు మయ్య! నా భర్త యా వేళ మీకు
నిడఁ దెలంగాణమును బాగనెంచి, ఢిల్లి
హై కమాండుకుఁ దెలిపెను! మాకు మీర
లోటు వేయఁ గృతజ్ఞతఁ జాటుకొందు!”
మనుచు మాట్లాడి, నేఁ డిట్లు మాట తప్పి,
“జై సమైక్యాంధ్ర!” యనుచును సాఁగి వచ్చి,
మా తెలంగాణలో “సానుభూతి యాత్ర”
పేరఁ “దెలగాణ వ్యతిరేకి”, తీరు మార్చి,
యడుగు పెట్టంగ నడ్డరే యామె నపుడు?
మా మనోభావమ్ముల మాత్ర మామె
గాయ పఱుపంగ వచ్చునే? కనుక మేము
నడ్డుకొంటిమి నిరసన నందఁ జేయ!
మాట తప్పిన వారికి మంగళార
తుల నొసంగియు స్వాగతింతురె జనులిట?
“మా స్థలమ్ముకు రావద్దు, మాను”మనుచు
నిరసనముఁ దెల్ప; వచ్చిన నేమి కతము?
మమ్ము పరిహసించుటె కాదె మఱల మఱల?
“నిరసనముఁ దెల్పరా” దన, నేమి యిదియె
బ్రిటిషు పాలనమే? లేక, వేఱె యౌనె?
మా మనోభావముల గాయ మందఁజేయ,
మా నిరసనఁ దెల్పెడి హక్కు మాకు లేదె?
నాఁడు “సైమను గో బ్యా” కనంచు నాంధ్రు
లందఱును నడ్డరే తీవ్రమైన కృతుల!
నేల నడ్డిరి సైమను నిట్టి జనులు?
అట “సమైక్యాంధ్ర” పేర మీ రడ్డగించి
యున్న సీమాంధ్ర నేతల కెన్ని యడ్లు
పెట్టితిరొ మీరు మఱచిరే విలువ తప్పి?
బొత్స బంధువర్గము పైన బూటకంపు
దాడి చేసి, లూటి యొనర్ప ధర్మమౌనె?
హర్ష కుమారుఁ డేమియు ననియె నయ్య?
యతని పైదాడి సేయంగ నగునె నీతి?
మీది తీవ్రవాదము కాక, మాది యౌనె?
సరియె పోనిండు! మొన్న శ్రీశైల భక్తు
లనఁగ, మా హనుమంత రావును ననంగ,
నట వసించునట్టి తెలగాణ జను లనఁగ
నెందు కడ్డితిరో చెప్పు! నీతి మాలి,
నిండు చూలును వైద్యమ్ము నీఁకఁ దఱిమి
కొట్టినట్టి మిమ్మేమందు రట్టి తఱిని?
మా తెలంగాణకును జెందు మహిళ పైన
పేడఁ గొట్టుట నేమండ్రు వెఱ్ఱి యనక?
యిట్లు దాడి చేసిన కత మేమొ చెపుడు!
నిరసనము కాదె? మేమును నిరసనమును
దెల్పినారము! మమ్మేలఁ దిట్టుదు రయ?
మే మిట వసించు సీమాంధ్రు నేమి యైన
నంటిమే? మేమె బాధల నంది, వేయి
యాత్మ బలిదానముల నిడి యడలితి మయ!
మేము తీవ్రవాదులమైన, మీర లెవరు?
మమ్ము తెలబాను లందురే? మమ్మనంగ,
మీరు తెలబాన్ధ్రులరు కారె? మిత హితులరె?
మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
Sir Vallu ajakarulu
Ajakarulu.. razakkarulani tharimi kottamu..
inkaa ajakraulu migili unnaru
దేనికైనా కాలం రావాలి. ఎవరి పాపం వారిని కట్టి కుడుపక మానదు. మీరన్న అజాకార్లు...నేనన్న తెలబాన్ధ్రులు...వాళ్ళంతట వాళ్ళే తట్టాబుట్టా సర్దుకుని పోయే రోజు దగ్గరలోనే వుంది మిత్రమా! స్పందించినందుకు ఆలస్యంగానైనా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. నమస్తే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి