గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 01, 2014

మెట్రోపై సీమాంధ్ర మీడియా చేసే ప్రచారం ఒట్టిదే...!

-ఎల్ అండ్‌ టీ సంస్థ వెనుకకువెళ్లదు
-అదంతా సీమాంధ్ర మీడియా ప్రచారమే
-హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి స్పష్టీకరణ
-వైదొలుగుతామన్న కథనాలు వదంతులే: ఎల్‌అండ్‌టీ
తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మెట్రోరైలు ప్రాజెక్టు ఆగిపోతుందంటూ సీమాంధ్ర మీడియా చిలువలు పలువలుగా చేస్తున్న ప్రచారమంతా ఒట్టిదేనని తేలిపోయింది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టిన దేశంలోని ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ ఆగిపోతుందని, ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగి షాకిస్తుందంటూ సీమాంధ్ర మీడియా ప్రసారం చేసిన కథనాలు ఊహాజనితమేనని రూఢీ అయింది. ఈ కథనాలపై ఎల్‌అండ్‌టీ సంస్థ, హైదరాబాద్ మెట్రోరైలు ప్రతినిధులను ఆరా తీయగా ఇదంతా తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పారు. ప్రాజెక్టు కొనసాగింపు విషయంలో ఎక్కడా అనుమానాలకు తావు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచే మెట్రోరైలు ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఈ సూచనలను విపరీత కోణంలో చూసిన సీమాంధ్ర మీడియా ఈ ప్రాజెక్టుపై కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నదని, ప్రాజెక్టును అడ్డుకొని.. హైదరాబాద్ అభివద్ధికి ఆటంకం ఏర్పరచాలనే దురుద్దేశంతోనే ఇలాంటి గందరగోళపు కథనాలు, వదంతులు ప్రచారం చేస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
train
శరవేగంగా మెట్రో పనులు

హైదరాబాద్‌లోని మూడు కారిడార్లలో మెట్రో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల మేర ట్రాక్‌ను నిర్మించనున్నారు. రూ. 14,132 కోట్లతో మెట్రో ప్రాజెక్ట్‌ను ఎల్‌అండ్‌టీ కంపెనీ గుత్తేదారుగా చేపట్టింది. 10 శాతం సర్దుబాటు నిధి క్రింద సుమారు రూ.1400 కోట్లను కేంద్రప్రభుత్వం కేటాయించనుంది. 2012 ఏప్రిల్ 26న ప్రారంభమైన ప్రాజెక్ట్ పనులు నేటికి మూడేళ్లు పూర్తిచేసుకుంటున్నాయి. ప్రాజెక్ట్ కోసం ఎల్‌అండ్‌టీ ఇప్పటివరకు రూ. 3,500 కోట్లు ఖర్చుచేసింది. ఈ క్రమంలో నగరంలోని చారిత్రాత్మక ప్రాంతాలకు నష్టం కలుగకుండా కొన్ని ప్రాంతాలలో భూగర్భ మార్గంలో ఈ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం సూచనలు చేసింది. దీనిపై ప్రభుత్వమే నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చేయించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులే ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆగిపోతుందంటూ వదంతులు రావడంపట్ల హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్) వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

మెట్రో ఆగదు.. ఎల్‌అండ్‌టీ పోదు:ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎంఆర్ ఎండీ

మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఎలాంటి ప్రతిష్టంభన లేదు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఎల్‌అండ్‌టీ వెనుకకుపోదు. పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కారిడార్ -3లోని స్టేజ్ -1లో నాగోలు-మెట్టుగూడ మార్గంలో ట్రయల్స్, నిర్దేశిత సమయంలోగా కమర్షియల్ ఆపరేషన్స్ చేపట్టడంపై దృష్టిసారించాం. భూగర్భమార్గంపై ప్రభుత్వ సూచనల మేరకు నిపుణుల కమిటీని నియమించాలని మున్సిపల్‌శాఖకు లేఖ రాశాం. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కమిటీని నియమించలేదు. అప్పుడే భూగర్భ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్, ఎల్‌అండ్‌టీ వెనకకుతగ్గుతున్నదని కథనాలు రావడం దురదృష్టకరం. పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు ఇలాంటి పుకార్లు రావడం మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. అయినా వెనక్కితగ్గే ప్రసక్తే లేదు.

వైదొలిగే ఆలోచన లేదు:ఎంపీ నాయుడు , ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ మేనేజర్

మెట్రోరైలు ప్రాజెక్ట్ నుంచి మేం వైదొలుగుతున్నామన్నది అవాస్తవం. అలాంటి అధికారిక ప్రకటన మేం ఎప్పుడూ చేయలేదు. అసలు వైదొలిగే ఆలోచనే లేదు. ఇప్పటికే మెట్రో బోగీలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. కారిడార్ -3లో కారిడార్ -1లో 50 శాతం పనులు పూర్తయ్యాయి. కారిడార్ -2లో 5 శాతం పనులు చేపట్టాం. భూగర్భ మెట్రోను చేపట్టాలంటూ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి లేఖ రాలేదు. లేఖ వస్తే అప్పుడు సాధ్యాసాధ్యాలపై ఆలోచించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తిచేయడానికి రాత్రింబవళ్లు నిబద్ధతతో పనిచేస్తున్నాం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి