గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 07, 2014

సామ్రాజ్యవాదులు, పెత్తందారులకే పోల "వరం"...!

-పార్లమెంట్‌లో చర్చించకుండానే ఆర్డినెన్స్ జారీ దారుణం
-బాబు, వెంకయ్యలదే కుట్ర.. కేంద్రానిది నిరంకుశ ధోరణి
-భద్రాచలం రాముడిని జలసమాధి చేయడం విడ్డూరం
-పోలవరం వ్యతిరేక సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్
పార్లమెంట్‌లో చర్చించకుండానే దొడ్డిదారిలో కేంద్రం పోలవరం పై ఆర్డినెన్స్ జారీచేసిందని ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పోలవరం అక్రమ ఆర్డినెన్స్ వ్యతిరేక సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల పెట్రో కెమికల్, కోస్టల్ కారిడార్ అవసరాల కోసమే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని విమర్శించారు. రాముడి పేరు చెప్పి గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం..పోలవరం నిర్మాణం పేరుతో భద్రాచల రాముడినే జలసమాధి చేయడానికి పూనుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుపై ఆర్డినెన్స్ తెచ్చారని, దీని వెనుక ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అంతర్జాతీయ సామ్రాజ్యవాదుల కుట్ర దాగిఉందన్నారు. 
tpfffపోలవరం నిర్మాణంతో అక్కడి రైతులకు పెద్దగా ఉపయోగంలేదని కేవలం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకే ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర పాలకులకు నిజంగా రైతులను ఆదుకునే ఉద్దేశం లేదని, వారి దృష్టంతా ప్రాజెక్టు కోసం కేంద్రం కేటాయించే రూ.16 వేల కోట్ల నిధులపైనే ఉందన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ నడిపిన ఉద్యమానికి సమాంతరంగా మన్యంలో ఆదివాసీలు ఉద్యమించి బ్రిటీషర్లను తరిమికొట్టిన చరిత్ర ఉందని గుర్తుచేశారు. ఆదివాసీ చట్టాలను గౌరవించకుండా అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సమైక్యంగా ఉద్యమించి ఆదివాసీలకు అండగా నిలవాలని కోరారు. ఆదివాసీలకు నష్టం జరగకుండా పోలవరం డిజైన్ మార్చి నిర్మించవచ్చని జలవనరుల శాఖ మాజీ ఇంజినీరు హన్మంతరావు పేర్కొన్నారని, ఆయన ఆంధ్రా ప్రాంతంవాడేనని గుర్తుచేశారు. సదస్సులో టీజేఏసీ జిల్లా కన్వీనర్ కూరపాటి రంగరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండారెడ్డి, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు

పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలం డివిజన్‌లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లిలో రెండ్రోజులుగా కొనసాగుతున్న దీక్షలను యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ నర్సింహారావు సందర్శించి మాట్లాడారు. దీక్షలో పాల్గొన్న సర్పంచ్‌లకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడానికి అక్రమ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన కేంద్రం ప్రజల పక్షాన ఉంటుందో, ప్రజలను ముంచాలనుకుంటుందో తేల్చాలని డిమాండ్‌చేశారు. ఆర్డినెన్స్‍ను ఉపసంహరించుకోవాలని, తెలంగాణలోనే ముంపు ప్రాంతాన్ని కొనసాగించాలని కోరారు. భద్రాచలంలో కొనసాగుతున్న దీక్షలను టీపీటీఎఫ్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి