గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 05, 2014

ఆయన వృత్తి...వైద్యం! ప్ర‌వృత్తి...క‌బ్జా!


-మహానగరంలో భూ మాఫియా డాన్

-అడ్డదారుల్లో వేల ఎకరాలు స్వాధీనం
-పురావస్తు స్థలాలూ కబ్జా
-హస్మత్‌పేటలో రూ.420 కోట్ల భూమికి ఎసరు
-రెవెన్యూ, పోలీసు అధికారులూ ఆయన చేతిలోనే..
-గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్ భూ దందా
-స్థలాన్ని రక్షించాలని స్థానికుల డిమాండ్ ఎక్కడ ఖాళీ భూమి కనబడితే దానిపై ఆయన కన్నుపడుతుంది.. ఎక్కడ వివాదాస్పద జాగ ఉందని సమాచారం అందితే అక్కడ ఆయన మనుషులు వాలిపోతారు.. కబ్జాచేస్తారు.. బేరసారాలకు దిగుతారు.. రెవెన్యూ అధికారులను లోబర్చుకుంటారు.. ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేస్తారు.. నకిలీ పత్రాలను సృష్టిస్తారు.. ఏదో ఒక పేరుతో రాయించుకుంటారు. ఒక జాగానే ఇద్దరు,ముగ్గురు పేర్ల మీద విక్రయిస్తుంటారు. గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్‌గా, మానసిక వైద్యుడిగా చలామణి అవుతూ దానికి వెనక కబ్జాలు, సెటిల్‌మెంట్లతో భూ దందా సాగిస్తున్న పీఎస్ ప్రసాద్ వ్యవహారమిది. నిజాం కాలంనాటి చారిత్రక స్థలాలు, పురావస్తు భూములను సైతం వదలలేదు. ఇలా హస్మత్‌పేటలో వేల ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. వాటిని ప్లాట్లు చేసి విక్రయించాడు. దీనివల్ల ఎంతో మంది బాధితులు మోసపోయారు.ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోకుండా ఆలయం, మసీదు కూడా కట్టించాడు. సిటీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న రాజకీయ పలుకుబడితో ఎన్ని అక్రమాలు, ఆరోపణలు వచ్చినా పోలీసులుగాని, రెవెన్యూ అధికారులుగాని కిమ్మనకపోవడంతో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ఇప్పటికైనా విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పీఎస్ ప్రసాద్.. వృత్తి డాక్టర్... ప్రవృత్తి కబ్జాలు, సెటిల్‌మెంట్లు, అక్రమ లావాదేవీలు... పేరుకు గోల్డ్‌స్టోన్ గ్రూప్ చైర్మన్... అది అక్రమాలకు ముసుగు మాత్రమే.. దాని ముసుగులో చేసేవన్నీ అక్రమ లావాదేవీలే. అమెరికాలో ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల నుంచి పారిపోయి వచ్చి, రాజధానిలో ఉంటున్న వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భూదందాల భాగోతం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..! వందలాది ఎకరాల ఖాళీ, వివాదస్పద భూములను కొనడం, విక్రయించడం చూస్తుంటే, ఆ లావాదేవీలకు అంతటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికైనా అంతుచిక్కని విషయమే...తమ భూములను కబ్జాచేశారు...అక్రమంగా దక్కించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేసినా, పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ఆయనపై చర్యలు తీసుకోకపోవడాన్ని పరిశీలిస్తే ఆయన వెనుక ఉన్న పవర్ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ భూతిమింగళంపై టీమీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం...
సికింద్రాబాద్ (కళ్లేపల్లి రవిచంద్ర)
శివారు ప్రాంతాల్లో ప్రసాద్ అనుచరుల కబ్జాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. హస్మత్‌పేట గ్రామంలోని సర్వే నెంబర్ 1, 7, 15, 57లలో 160 ఎకరాల ప్రభుత్వ స్థలముంది. ఈ స్థలాన్ని పురవాస్తుశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం 1953, జూన్ 11వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ స్థలం పురవాస్తు శాఖ ఆధీనంలో ఉంది. సర్వే నెంబర్ 1లోని పురాతన ఛత్రీ ఇప్పటికీ దర్శనమిస్తోంది.ఈ ఛత్రీ నుంచి చార్మినార్‌వరకు నిజాం నవాబులు సొరంగ మార్గం నిర్మించారని పూర్వీకుల సమాచారం. కాగా ఈ స్థల వివాదం పురవాస్తుశాఖ, పైగా వంశస్తుల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. పురవాస్తుశాఖకు కేటాయించిన దాదాపు రూ.400 కోట్ల విలువైన 28 ఎకరాల స్థలంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అక్రమంగా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. పురాతన ఛత్రీని సైతం కూల్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఈ స్థలంలో నుంచి 200 గజాల స్థలాన్ని ఓ మత (ఈద్గాకు) సంస్థకు మరో 250 గజాల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి అప్పజెప్పాడు. అదేవిధంగా 2 వేల గజాల స్థలాన్ని ముస్లిం శ్మశానవాటికకు కేటాయించాడు. అయితే ఆయా సంస్థలకు ప్రసాద్ స్థలాలను అప్పగించినప్పటికీ, వారిపేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించకపోవడం గమనార్హం.అదే విధంగా హస్మత్‌పేట బస్టాప్ వద్ద ఉన్న దాదాపు రూ.20 కోట్ల విలువ గల 6200 గజాల స్థలాన్ని ప్రసాద్ తమ ఆధీనంలోకి తీసుకొని ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. ఈ స్థలం సైతం పురవాస్తుశాఖకు చెందినదే. గతంలో ఈ స్థలంలో పురావస్తు శాఖకు సంబంధించిన కార్యాలయం సైతం ఉండేదని స్థానికులు తెలియజేస్తున్నారు.. ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. దీంతో ఈ స్థలాన్ని గత 50 ఏళ్లుగా స్థానికులు మైదానంగా వాడుకుంటున్నారు. దసరా, వినాయక చవితి, ముస్ల్లిం సోదరులు తమ పండగలను ఈ మైదానంలోనే నిర్వహిస్తుంటారు. రెండేళ్ల ముందు వరకు ఈ మైదానంలో ఏ కార్యక్రమం చేపట్టినా పురవాస్తుశాఖ వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే గతేడాది ఈ స్థలంపై కోర్టు తనకు అనుకూలంగా అర్డర్ ఇచ్చిందంటూ ప్రసాద్ సోదరుడు పార్థసారథి మందిమార్బలంతో స్థలంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.ముందు స్థానికులు ఆందోళన చేపట్టినా.. కొందరు నాయకులు భూకబ్జాదారుడి ఆమ్యామ్యాలకు లొంగిపోయి ప్రసాద్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించారు. అయితే గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు రెవెన్యూ అధికారులు మ్యాటిషన్ చేయలేదు. పొజీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అదేవిధంగా కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయం నుంచి ఫెన్సింగ్ నిర్మాణానికి గాను ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ భూమిని నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా క్రయ విక్రయాలు చేయించి తమకు అన్యాయం చేశారని బాధితులు బోయిన్‌పల్లి,అల్వాల్ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా తనకున్న రాజకీయ పలుకుబడిని గొప్పగా చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ప్రలోభాలకు గురిచేసి, అక్రమ లావాదేవీలపై చర్యల నుంచి తప్పించుకుంటారని ఫిర్యాదులున్నాయి. జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు.. 
హస్మత్‌పేటలోని ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జూన్ రెండవ వారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పురవాస్తుశాఖకు చెందిన రూ.400 కోట్ల విలువైన స్థలంపై ప్రైవేటు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్థలాన్ని ప్రజల అవసరాలకు కేటాయించాలని ఆయన సూచించారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్‌కు అదేశాలు జారీ చేసినట్లు సమాచారం.ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసినా.. 
నిజాం కుటుంబానికి చెందిన అత్యంత ఖరీదైన భూములను కూడా అక్రమంగా ప్రసాద్ గ్యాంగ్ రాయించుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఖుర్షీద్ జాహి ఎస్టేట్‌కు చెందిన రూ.40వేల కోట్ల రూపాయల విలువచేసే భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హమీద్ ఉన్నీసాబేగం గతంలో ముఖ్యమంత్రులను కలిసి ఫిర్యాదు చేసింది. సీబీఐ విచారణ జరిపించాలని కూడా కోరింది. దీనికి సంబంధించిన తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆయన పొందుపర్చి క్రయవిక్రయాలు జరిపినట్లు ఆమె వాపోయింది. ఖుర్షీద్ జాహీ ఎస్టేట్ భూములను ఈ విధంగా అన్యాక్రాంతం చేసినట్టుగా ఆమె సీబీఐ అధికారులకు కూడ పంపిన ఫిర్యాదులో పేర్కొంది.మాజీ పీఎంకు సన్నిహితుడు..? 
అమెరికాలో రెండు బ్యాంకుల నుంచి బినామీ రుణాలు తీసుకొని 90 మిలియన్ డాలర్ల వరకు కుచ్చుటోపి పెట్టి, అక్కడ క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవడానికి పారిపోయి అనధికారికంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పీ.ఎన్‌. ప్రసాద్ గత చరిత్ర చాలా పెద్దదిగానే ఉంది. అప్పట్లో ఓ కేంద్ర మంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతూ అమెరికాలో కేసు నుంచి బయటపడ్డారని చెప్పుకుంటారు. హైదరాబాద్‌లో అడ్డూ, ఆదుపులేకుండా పెద్ద ఎత్తున భూకబ్జాలు, లావాదేవీలు చేస్తున్నారంటే ఆయనకు బలమైన రాజకీయ బంధమే వెన్నుదన్నుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రసాద్ 1990కు ముందు సొంత విమానాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.అప్పట్లో ఓ మాజీ ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు అమెరికాలో విడిది చేసిన సమయంలో ప్రసాద్ విమానాన్ని సమకూర్చారని ప్రచారం జరిగింది. ఆ సాన్నిహిత్యం కారణంగానే దేశంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగిన పార్టీకి చెందిన ప్రముఖులకు ప్రసాద్ దగ్గరయ్యారని సమాచారం. ఈ క్రమంలోనే గత పదేళ్ల కాలంలో ఆ పార్టీలో చెందిన ప్రముఖ నాయకుడితో స్నేహం పెరిగింది. ఆయన అండ చూసుకునే గ్రేటర్‌లో భూ దందాలకు ప్రసాద్ తెరలేపారని రాజకీయ వర్గాల్లో సైతం ప్రచారం జరుగుతోంది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి