గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 04, 2014

ఛీ.. ఛీ.. లాలూచీ...

-మహిళా సంఘాలపేరుతోనూ లూటీ
-అమాయక ఆదివాసులకూ కుచ్చు టోపీ
-అవినీతి బాటకు కొత్త ముగ్గులు
-పాత ఇండ్లకు రంగులేసి పంచుకుతిన్నారు
-లేని ఇండ్లపేర నిధులు మింగేశారు
-అవినీతిపరులే విచారణాధికారులు
-గోదాముల నుంచే మాయమైన సిమెంటు
-ఆస్తులు పెంచుకున్న అధికారులు, నేతలు
-కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమాయకులు
-ఇవీ.. వరంగల్, నల్లగొండ,ఖమ్మం అవినీతి ఇండ్ల కతలు..
అవినీతికి ఏదీ అడ్డు కాదని నిరూపించారు గృహనిర్మాణశాఖ అధికారులు. మహిళా సంఘాలను కూడా వదలిపెట్టలేదు. అమాయక ఆదివాసీలను వంచించారు. సంఘాలతో సంతకాలు పెట్టించుకుని లక్షలకు లక్షలు డ్రా చేసుకున్నారు. బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును టోకున కాజేశారు. కొన్నిచోట్ల పాత ఇండ్లకు రంగులు వేయించి బిల్లులు డ్రా చేస్తే.. మరికొన్నిచోట్ల ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు ఎత్తుకున్నారు. గోదాములకు వచ్చిన సిమెంట్ బస్తాలను అక్కడి నుంచే మాయం చేశారు. ఇలా అవినీతి బాటకు కొత్త ముగ్గులు వేశారు. కొన్ని గ్రామాలలో గతంలో నిర్మించిన ఇండ్లకు రంగులు వేయడానికి నిధులు మంజూరయ్యాయని చెప్పి రంగులు వేయించి సంతకాలు తీసుకొని కొత్త ఇండ్లు కట్టినట్లు రికార్డుల్లో చూపించి దండుకున్నారు. పైగా జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు చివరకు విచారణ అధికారులుగా అవినీతికి పాల్పడినవారికే బాధ్యతలు అప్పగించిన తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. రాజకీయనాయకులు, అధికారులు కలిసికట్టుగా చేసిన దోపిడిలో సామాన్యులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఇండ్ల నిర్మాణం పథకంతో లబ్ధి పొందిన అవినీతిపరుల కతలివి..housing

ఇండ్ల నిర్మాణంలో అక్రమార్కులకు ఆశపడినంత అందింది. అవినీతి అధికారులు, నేతలు మిలాఖతై అమాయకులను వంచించారు. నోరులేని ఆదివాసుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకున్నారు. సమాజంలో సగభాగంగా ఎదుగాలనుకుంటున్న మహిళా సంఘాలనూ మోసపుచ్చారు. అక్రమకూటమి చెలరేగితే.. అందుకు అధికారం తోడయితే ఇక అడ్డేముంది?.. అలాగే సాగింది ఇండ్ల పథకం అమలు తీరు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అవినీతిపరులు రకరకాలుగా అక్రమంగా నిధులు దండుకున్నారు. విచారణలూ తూతూమంత్రమయ్యాయి. సస్పెండ్ చేసినవారిని తిరిగి అంతకుమించి అందలాలెక్కించారు. అసలు అవినీతిపరులనే విచారణాధికారులుగా నియమించారు. దొంగలు దొంగలు ఇండ్లు పంచుకుంటే.. అమాయకులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. న్యాయంకోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలోని మరో మూడు జిల్లాల దొంగ ముచ్చట్లివి..
వరంగల్ జిల్లాలో దొంగల చేతికే తాళాలు..

వరంగల్ జిల్లాలో పేదోళ్ల ఇండ్లకు సర్కారు పెద్దలు గండి కొట్టి సర్కారు సొమ్ము అక్రమంగా పంచుకుతిన్నారు. పై స్థాయి నుంచి పరిశీలించాల్సిన ఉన్నతాధికారులు కూడా ఇక్కడ దొంగల చేతికే తాళాలు ఇచ్చారు. ఈ జిల్లాలోని, ఏ ఊర్లో చూసిన ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇండ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై శాంపిల్‌గా 211 గ్రామాలలో,14003 ఇండ్లపై జరిపిన విచారణలో రూ.33.77 కోట్ల భారీ అవినీతి జరిగినట్లు తేలింది. మొత్తంగా సర్వే చేయిస్తే క్షేత్రస్థాయిలో జరిగిన అవినీతి ఇంతకు మూడురెట్లు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వరంగల్ శివారు ప్రాంతాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలిస్తే పాత ఇంటికి రంగులు వేసి బిల్లులు ఎత్తుకున్నట్లు తేలింది. ఈ ఇండ్లు గతంలో ఇదే స్కీమ్‌లో నిర్మించి బిల్లులు తీసుకున్నవి కావడం గమనార్హం. ఈ పద్ధతిలో అధికారులు, నాయకులు కలిసికట్టుగా దోచుకున్నారు. 

మీ ఇండ్లకు రంగులు వేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకొని లబ్ధిదారులకు తెలియకుండా రూ.2.11 కోట్లు కాజేశారు. శాఖాపరమైన విచారణలో చాలామంది అధికారులు దోషులుగా తేలినప్పటికీ, మంత్రులు, నాయకులు వాటాలు పంచుకొని అధికారులను ఒడ్డెక్కించినట్లు ఆరోపణలొచ్చాయి. ఫలితంగా కేవలం రూ.21.15 లక్షలు మాత్రమే తిరిగి వసూలు చేసి మమ అనిపించారు. ఈ జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలో మహిళా సంఘాలతో మూకుమ్మడిగా సంతకాలు చేయించుకొని 10 శాతం వారికి ముట్టచెప్పి మిగతా సొమ్మును అధికారులు, నాయకులు కాజేసినట్లు విచారణలో బయటపడింది. 

అసలు పెద్దలను వదిలేసి, అజ్ఞానంతో మోసపోయిన అమాయక ఏజెన్సీ ప్రజలను క్రిమినల్ కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. మహబూబాబాద్, కురవి మండలాల్లో కూడా ఇలాంటి దోపిడీనే కొనసాగిందని వెల్లడైంది. కురవి మండలంలోని అధికారులు డబ్బులు పంచుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టారు. కానీ సదరు అధికారులు ఆనాటి మంత్రుల అండదండలతో తిరిగి దర్జాగా విధులలో కొనసాగుతున్నారు. ఇంతటి అవినీతిపై నాటి సీమాంధ్ర సర్కారు దొంగలకే తాళాలు ఇచ్చిన సామెతను తలపించే విధంగా వ్యవహరించింది. మరిపెడ, నర్సింహులుపేట, నర్సంపేట, ములుగు, కేసముద్రం, భూపాలపల్లి మండలాల్లో అక్రమాలలో భాగస్వాములైన తహసిల్దార్లనే విచారణ చేపట్టి, అవినీతి సొమ్మును రికవరీ చేయాలని ఆదేశించింది. 

ఈ అవినీతిపర్వంలో 67 మంది ప్రాజెక్టు అధికారులు, 52 మంది రాజకీయ నాయకులు, 21 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 19 మంది మండల అధికారులు భాగస్వాములైనట్లు నివేదికలు స్పష్టం చేసినప్పటికీ, కేవలం ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మాత్రమే తొలగించారు. మిగతా వారందరిని తొలుత సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయనాయకుల అండదండలతో వారిని తిరిగి విధులకు తీసుకొని, ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నోటీస్‌లు అందుకున్న సామాన్యులు ఇండ్ల పథకమని అధికారులు వెళితే భయపడే పరిస్థితి వరంగల్ జిల్లాలో దాపురించింది. వాస్తవానికి ఈ జిల్లాలో 8,88,553 ఇండ్లు ఉండగా, మంచి ఇండ్లు 5,17,572 ఉన్నాయి. నివాసయోగ్యమైన ఇండ్లు 3,08,823 ఉండగా, శిథిలావస్థలో 62,158 ఇండ్లు ఉన్నాయని 2011 జనాభా లెక్కల సర్వే చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు గృహనిర్మాణ పథకం కింద 4,75,567 ఇండ్లకు నిధులు మంజూరు చేయగా, 2.66 లక్షల ఇండ్లు మాత్రమే నిర్మించారు. ఇంకా 2.07 లక్షలు ఇండ్లు నిర్మించాల్సి ఉంది. 

నల్గొండ జిల్లాలో గోదాముల నుంచే సిమెంట్ మాయం..

గత ప్రభుత్వంలో గృహనిర్మాణశాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే.. ఇండ్లు కట్టకుండా బిల్లులు ఎత్తుకున్నారు. బ్యాంకుకు ఇందిరమ్మ ఇండ్ల నిధులు వచ్చాయని తెలియగానే ఏకంగా దరఖాస్తులను బ్యాంకుకే తీసుకువెళ్లి, లబ్ధిదారులతో సంతకాలు చేయించుకొని రూ.25 లక్షల బిల్లులు ఎత్తుకుపోయిన వైనం నల్లగొండ జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో జరిగింది. రేషన్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చి సంతకాలు పెట్టినందుకు లబ్ధిదారులకు రూ.10 వేలు ఇచ్చి ఇందిరమ్మ బిల్లుల మొత్తాన్ని పంచుకుతిన్నారు. 2007 నుంచి ఎలాంటి రికవరీ లేకుండా గడిపేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని సిమెంట్ గోడౌన్ నుంచి 2496 సిమెంట్ బ్యాగులు, ఆత్మకూరు(ఎస్) మండలంలో 650 సిమెంటు బ్యాగులు మాయమైన ఉదంతం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. 

మేళ్లచెరువు మండలంలో మాజీ మంత్రికి అత్యంత సన్నిహితులైన నాయకుల ఆధ్వర్యంలో రూ.12.03 లక్షల అవినీతి జరిగిందని విచారణ అధికారులు తేల్చి వర్క్ ఇన్‌స్పెక్టర్, ఎంహెచ్‌ఓ, ఎంపీడీఓలను సస్పెండ్ చేసి, సంబంధిత సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్‌లిచ్చారు. ఆలేరు మండలంలో ఎనిమిది ఇండ్లు నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు డ్రా చేసినట్లు విచారణలో తేలింది. ఆత్మకూరు(ఎస్), బీబీనగర్, చందంపేట, చింతపల్లి, చౌటుప్పల్, దామరచర్ల, దేవరకొండ, గుండాల, కోదాడ, మర్రిగూడ, మఠంపల్లి, మోత్కూరు, మునగాల, నార్కట్‌పల్లి, వలిగొండ, మునుగోడు మండలాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ఇంటి బిల్లులు తీసుకున్నట్లు స్పష్టమైంది. 

తుంగతుర్తి మండలంలోని గుమ్మడవెల్లి, కుక్కడం గ్రామాలలో రూ.1.07 కోట్ల భారీ అవినీతి జరిగిందని శాఖాపరమైన విచారణలో తేలింది. శాంపిల్‌గా 50 గ్రామాలలోని1674 ఇండ్లపై విచారణ జరిపించగా రూ.24కోట్ల మేర అవినీతి జరిగినట్లు తెలింది. ఈ అవినీతిలో పెద్ద ఎత్తున రాజకీయనాయకులు భాగస్వామ్యం కాగా, 38 మంది ప్రాజెక్టు అధికారులు, ఐదుగురు మండల అధికారులు, 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. ఇందులో 8మంది అధికారులను సస్పెండ్ చేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కేవలం రూ.4.46 లక్షలు రికవరీ చేసి చేతులు దులిపేసుకున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో 8,75,432 ఇండ్లు ఉండగా, 5,45,644 మంచి ఇండ్లున్నాయి. నివాసయోగ్యంగా 2,84,430 ఇండ్లు ఉండగా, శిధిలావస్థలో 45,358 ఇండ్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటివరకు 2.99 లక్షల ఇండ్లు మంజూరు కాగా ఇంకా 1.08 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. 

అవినీతి శాంపిల్..(i)

నిర్వహించింది: 211 గ్రామాల్లో.. 14003 ఇండ్లపై..తేలిన అవినీతి అంచనా: రూ.33.77 కోట్లు
భాగస్వాములు: 67 మంది ప్రాజెక్టు అధికారులు, 52 మంది రాజకీయ నాయకులు, 21 మంది 
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, 19 మంది మండల అధికారులు
తీసుకున్న చర్యలు: ఆరుగురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు. రూ.21.15 లక్షలు రికవరీ.
తర్వాత సంగతి: మిగతా వారందరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన. ఆ తర్వాత మళ్ళీ విధుల్లోకి తీసుకొని, ఉన్నత స్థానాల అప్పగింత.

అవినీతి శాంపిల్..(ii)

నిర్వహించింది: 50 గ్రామాలలోని1674 ఇండ్లపై..తేలిన అవినీతి అంచనా: రూ.24కోట్లు
భాగస్వాములు: పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, 38 మంది ప్రాజెక్టు అధికారులు, ఐదుగురు మండల అధికారులు, 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. 
తీసుకున్న చర్యలు: ఎనిమిదిమంది అధికారుల సస్పెన్షన్. రూ.4.46 లక్షలు రికవరీ.
తర్వాత సంగతి: సస్పెండైన అధికారులు తిరిగి విధుల్లోకి.

అవినీతి శాంపిల్..(iii)

నిర్వహించింది: 67 గ్రామాల్లో.. 1921 ఇండ్ల నిర్మాణంపై..తేలిన అవినీతి అంచనా: రూ.32 కోట్లు 
భాగస్వాములు: 17 మంది ప్రాజెక్టు అధికారులు, ఒక మండల అధికారి, ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి 
తీసుకున్న చర్యలు: 19 మంది సస్పెన్షన్. రూ.4.25 లక్షలు రికవరీ
తర్వాత సంగతి: 19 మందిని పేరుకే సస్పెండ్ చేసి.. పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉండగానే 
తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం.

ఖమ్మం జిల్లాలో విచారణలకే దిక్కులేదు..

ఖమ్మం జిల్లాలో ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై పలు ఆరోపణలురాగా విచారణకు ఆదేశించారు. కానీ పలుచోట్ల ఇప్పటికీ నివేదికలు సమర్పించలేదు. ఖమ్మం శివారు గ్రామాలైన నాగులవంచ, నాగిలిగొండ, తల్లంపాడు, తెల్దారుపల్లి, గుబ్బగుత్తి గ్రామాలలో 175 ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చి, విచారణకు ఆదేశించగా నేటికీ ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు. కల్లూరు మండలంలోని పలు గ్రామాలలో 225 ఇండ్ల నిర్మాణంలో రూ.32 లక్షల మేర అవినీతి జరిగినట్లు విచారణలో తేలినప్పటికీ, సంబంధిత అధికారులు పూర్తి నివేదిక సమర్పించలేదు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో బినామి పేర్లతో రూ.18 లక్షల బిల్లులు ఎత్తుకున్నా ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. అశ్వారావుపేట మండలంలోని సోములగూడెంలో మహిళా గ్రూపులకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే రూ.17.7 లక్షలు పంచినట్లుగా చూపించారు. రికవరీ నోటీస్‌లు అందుకున్న లబ్ధిదారులు బోరుమంటున్నారు. బూర్గంపాడు, పినపాక, ఇల్లందు మండలాల్లో రూ.1.10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. పినపాక మండలానికి విచారణ అధికారిగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌ను నియమించారు. ఇంత భారీ ఎత్తున జరిగిన అవినీతిపై విచారణ జరిపిన అధికారులు కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ గ్రామాలే ఎక్కువ. 

గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నాయకులు, అధికారులు జిల్లాకు వచ్చిన నిధులను పంచుకుతిన్నారు. ఈ జిల్లాలో శాంపిల్‌గా 67 గ్రామాలలో1921 ఇండ్ల నిర్మాణంపై విచారణ చేయగా రూ.32కోట్ల అవినీతి జరిగినట్లు తేలింది. దానిలో రూ.4.25 లక్షలు రికవరీ అయినట్లు అధికారులు చూపిస్తున్నారు. ఈ అవినీతిలో 17 మంది ప్రాజెక్టు అధికారులతోపాటు ఒక మండలాధికారి, మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పాల్గొన్నారు. జిల్లా మొత్తంగా ఒకే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి తతంగమంతా నడిపించినట్లు తెలియవచ్చింది. ఈ 19 మందిని పేరుకే సస్పెండ్ చేసి, పూర్తిస్థాయి విచారణ పెండింగ్‌లో ఉండగానే తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ జిల్లాలో 2.87 లక్షల ఇండ్లకు నిధులు మంజూరుకాగా 2.22 లక్షలు నిర్మించినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇంకా 64 వేల ఇండ్లు నిర్మాణం చేయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఈ జిల్లాలో 7,47,586 ఇండ్లు ఉండగా, మంచి కండిషన్‌లో 4,79,870 ఇండ్లున్నాయి. నివాసయోగ్యంగా 2,34,183 ఇండ్లు ఉండగా, శిధిలావస్థలో 33,533 ఇండ్లు ఉన్నాయని 2011 జనాభా లెక్కలు చెప్తున్నాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి