గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 06, 2014

విశ్వనగరానికి సూపర్ హైవే...మన హైదరాబాద్!


మూడు దశాబ్దాలకు నగర ప్రణాళిక.. దీర్ఘకాలిక దృష్టితో సిద్ధంచేస్తున్న కేసీఆర్ సర్కార్
ఢిల్లీని మించిన జనాభా.. దేశ విదేశాలనుంచి తరలివచ్చినవారితో, సకల వ్యాపారాలతో విశ్వనగరంగా ఖ్యాతి. ఇది హైదరాబాద్ గతం! అడ్డదిడ్డమైన అభివృద్ధి మధ్య.. చినుకుపడితే చెరువులను తలపించే కూడళ్లు.. ముక్కు మూసుకుంటే తప్ప దాటివెళ్లలేని చెత్తకుప్పలు.. ఇరుకు గల్లీలు.. మురికివాడలు. కబ్జాల కథలు! ఇది వర్తమానం!! అదనంగా వచ్చి చేరే కోటిన్నర జనాభా.. అందుకు తగిన రవాణా వ్యవస్థ.. మరో రెండు విమానాశ్రయాలు.. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ చుట్టూ మరిన్ని హైదరాబాద్‌లు. పచ్చటి.. పరిశుభ్రమైన ఓ అంతర్జాతీయ స్థాయి నగరం. ఇది రాష్ట్ర రాజధాని భవిష్యత్ చిత్రం!!

చెత్తబుట్టలా ఉన్న నగరం రూపురేఖలు మార్చేసి.. రానున్న ఐటీఐఆర్ ప్రాజెక్టు వెలుగులో నగరాన్ని న్యూయార్క్, షాంఘై, సిడ్నీ వంటివాటి సరసన విశ్వనగరంగా నిలిపేందుకు తెలంగాణ తొలి సర్కార్ తహతహలాడుతున్నది! రానున్న మూడు దశాబ్దాల కాలంలో నగర జనాభా మరో కోటిన్నర పెరుగనుందన్న అంచనాల నేపథ్యంలో ఆ స్థాయిలో అవసరాలకు ఇప్పటినుంచే పునాదులేస్తున్నది! నగరంపై పచ్చటి దుప్పటేసి.. పరిశుభ్రమైన.. భద్రమైన భాగ్యనగరాన్ని తెలంగాణకే కాదు.. మొత్తం భారతదేశానికే బహుమతిగా ఇచ్చేందుకు సంకల్పిస్తున్నది! అక్రమార్కులపై కొరడా ఝళిపించినా.. కబ్జా చేసి కట్టుకున్న కోటలను కూల్చేసినా.. అది బంగారు తెలంగాణ నిర్మాణానికే! ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకే!
hyd-plan


చినుకు పడితే నగరం నరకం. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు నీళ్ల మడుగు ఏర్పడుతుంది. గవర్నర్ నివాసం వద్ద కార్లు పడవల్లా తేలుతాయి. అసెంబ్లీ ముందు వాహనాల రాకపోకలు స్తంభించిపోతాయి. ఆర్టీఏ ప్రధాన కార్యాలయం వద్ద వరద ఒక చెరువును తలపిస్తుంది. నీరు నిలిచే ఇటువంటి జంక్షన్లు నగరంలో 216దాకా ఉన్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి కారణంగా నగరమంతటా ట్రాఫిక్ స్తంభించి పోతుంది. సుమారు 230 కాలనీలు, బస్తీలు జలమయం అవుతాయి.

నగరం వరదనంతా తీసుకోగల స్వతస్సిద్ధమైన మూసీనది నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్నా బస్తీలు, కాలనీలు మునిగిపోవడం ఆగడం లేదు. నాలాలు, నదులు అన్నీ ఆక్రమించి నీటి ప్రవాహానికి అడ్డం పడితే ఏం జరుగుతుంది? ఇవి కాకుండా మురుగునీరు, మంచినీరు కలసిపోతున్నాయని ఫిర్యాదులు. బస్తీలు మొదలుకుని బంజారా హిల్స్‌వరకు డ్రైనేజీలు పొంగి రోడ్లమీద ప్రవహిస్తుంటాయి. అంతేకాదు నగరంలో 1476 నోటిఫైడ్ మురికివాడలు, 239 గుర్తించని మురికివాడలు ఉన్నాయి. ఇలా ఈ నగరాన్ని చెత్త బుట్టగా మార్చిందెవరు? ఇదేనా అభివృద్ధి? ఇదేనా ఆధునికత? ఇలాగే ముందుకుపోదామా?
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాలంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరం కావాలి.

పూర్తి నియంత్రిత, జీవనయోగ్యమైన, ఎక్కడికయినా తేలికగా ప్రయాణించడానికి వీలైన, భద్రత కలిగిన, పరిశుభ్రమైన, పచ్చని నగరం (గ్యులేటెడ్, సేఫ్, సెక్యూర్, లివబుల్, ఈజీ మొబిలిటీ, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ) కావాలి. ఇప్పుడున్న పరిస్థితులను ఏమీ మార్చకుండా ఈ నగరాన్ని బాగుచేయడం సాధ్యమేనా? అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్‌లు, ఆక్రమణలను పట్టించుకోకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు కేవలం ప్రణాళికలను రచిస్తూ పోతే అంతర్జాతీయ నగరం అవుతుందా? తెలంగాణకు ఎప్పుడయినా ఆర్థిక వెన్నెముక హైదరాబాద్ నగరమే.

హైదరాబాద్ అభివృద్ధే తెలంగాణ అంతటికీ వెలుగులను ప్రసరించాలి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇటీవల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాల్లో చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించింది హైదరాబాద్ మహానగర సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులతోనే. గురుకుల ట్రస్టు భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడాన్ని, గోకుల్ ప్లాట్స్ ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడాన్ని కొందరు రాజకీయ నాయకులు, వారికి తాళం వేసే మీడియా వక్రబుద్ధులు అదేదో కక్ష తీర్చుకోవడంకోసం చేస్తున్నట్టుగా అభివర్ణిస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు కేసీఆర్‍కు లేవు. ప్రాంత భేదాల ముచ్చట అసలే లేదు.

అక్రమార్కులు ఎవరయినా చట్టం ముందు నిలబడాల్సిందే అని ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి చెప్పారు. ఎవరి జోక్యానికీ వీలు ఇవ్వకుండా ఉండడంకోసమే ముఖ్యమంత్రి పట్టణాభివృద్ధి శాఖను తన వద్ద ఉంచుకున్నారని ఒక అధికారి చెప్పారు.

హైదరాబాద్‌లో జరిగిన సకల అక్రమాలకు, ఇక్కడ వేళ్లూనుకున్న సకల అవలక్షణాలకు అండదండలు అందించింది సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియానే. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో మండల రెవెన్యూ కార్యాలయాలు పదే పదే అగ్ని ప్రమాదాలకు గురవుతాయి. రెవెన్యూ రికార్డులు తారుమారవుతాయి. చచ్చినోళ్ల పేరిట జీపీఏలు, పట్టా సర్టిఫికెట్లు పుడతాయి. యథేచ్ఛగా భూ ఆక్రమణలు జరుగుతాయి.

ప్రతి ఐదేళ్లకోసారి ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, భవనాల క్రమబద్ధీకరణ, లే అవుట్‌ల క్రమబద్ధీకరణ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ నగరంలో 60 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వందలాది అక్రమ లేఅవుట్‌లు ఉన్నాయి. వాటికి విద్యుత్ గ్యారెంటీ లేదు. తాగునీరు గ్యారెంటీ లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు. డ్రైనేజీ ప్రవహించే ఏర్పాట్లు ఉండవు. ఏం ఖర్మ? ఈ పరిస్థితి ఎంతకాలం? ఈ ధోరణికి అడ్డుకట్ట వేయకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనా? ఇప్పుడు ఇవేవీ పట్టించుకోవద్దు.. కళ్లు మూసుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు ఆశిస్తున్నాయి అని ముఖ్యమంత్రి వివరించినట్టు ఒక నగరాభివృద్ధి ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి ఒకరు చెప్పారు. ఈ పరిస్థితిని మార్చాలన్నదే ముఖ్యమంత్రి తాపత్రయమని ఆ అధికారి తెలిపారు. గత నాలుగైదేళ్లుగా ఒక్క ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధి గురించి సమీక్షించిన పాపాన పోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్నే ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించడం సంతోషంగా ఉంది అని ఒక అధికారి అన్నారు.

1931కి ముందు నుంచే హైదరాబాద్ కాస్మొపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందింది. ఈ నగరానికి రాజులు పునాదులు వేయడం, సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాలు దక్క రాజ్యానికి రాజధానిగా ఉండడం, దేశ, విదేశాల నుంచి అన్ని జాతులు, అన్ని మతాల ప్రజలు ఇక్కడ స్థిరపడడం ఈ నగరానికి విశ్వనగరంగా ఖ్యాతిని తెచ్చింది. ఇక్కడ అరబ్బులు, అఫ్ఘనీలు, పారసీలు మొదలు గుజరాతీలు, మార్వాడీలు, కాయస్థులు అందరూ కాలనీలు, స్థిరనివాసాలు ఏర్పరచుకున్నారు. సుహృద్భావ వాతావరణంలో కలసిమెలసి హైదరాబాద్‌లో మిళితమైపోయారు.

హైదరాబాద్ పరిసరాలు సమశీతోష్ణ మండలంలో ఉండడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం కూడా ఇక్కడికి ఎక్కువమంది వచ్చి వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోవడానికి కారణం. కానీ సమైక్యాంధ్ర పాలనలో జరిగిన అస్తవ్యస్థ అభివృద్ధి హైదరాబాద్ పరిస్థితులను తారుమారు చేసింది. నగరం విస్తరించడంతోపాటు సకల అవలక్షణాలు, అక్రమాలూ విస్తరించాయి. ఇప్పడు ఆ అక్రమాలను సరిదిద్ది ఒక ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణానికి విధాన రచన చేయవలసి ఉంది అని ఒక అధికారి అన్నారు. పెరగబోయే జనాభాకు తగిన విధంగా విద్య, వైద్యం, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రాపిడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ ద్వారా అన్ని మార్గాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేని రవాణా సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది.

భద్ర నగరంగా

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలతో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 1600 వాహనాలు, వందలాది బైక్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా పోలీసు ఫోర్సును తీర్చిదిద్దాలని యోచిస్తున్నాం అని ముఖ్యమంత్రి మరో సమీక్షా సమావేశంలో వెల్లడించారు.

సమతుల అభివృద్ధి

నగరానికి అన్ని వైపుల సమతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. ఐదు జాతీయ రహదారులను ఆనుకుని ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల చుట్టూ పరిశ్రమలు, అత్యాధునిక వసతుల అనుబంధ నగరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు, వినోద కేంద్రాలు, పరిశోధనా సంస్థలు నెలకొల్పాలి.

మరో రెండు విమానాశ్రయాలు

నవ తెలంగాణ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడం మొదలుపెడితే నగరం విస్తరించడం వేగం పుంజుకుంటుంది. న్యూయార్క్, లండన్‌తోపాటు పలు పాశ్చాత్య నగరాల మాదిరిగా మరో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. ఉత్తర తెలంగాణవైపు షామీర్‌పేట-మేడ్చల్‌ల మధ్య, భువనగిరి-ఘట్‌కేసర్-హయత్‌నగర్‌ల మధ్య మరో రెండు విమానాశ్రయాలు అవసరం అవుతాయి. అదే విధంగా శివార్లలో అతిపెద్ద బస్ సర్క్యూట్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నిర్మాణం జరుగుతున్న మెట్రో కూడా భవిష్యత్తు అవసరాలను తీర్చలేదు. ఇంతకంటే మెరుగైన, పొడవైన మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాల్సి ఉంటుంది.

గ్రీన్ కవర్

నగరంలో వంద సరస్సులు మాయమయ్యాయి. మిగిలి ఉన్న సరస్సులను కాపాడాల్సి ఉంది. వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, మొక్కలు పెంచి, అక్కడి పరిసరాలను జీవనయోగ్యంగా మార్చాలి. నగరంలో ఈ ఏడాది నుంచి ఏటా మూడు కోట్ల మొక్కలు నాటాలి. వచ్చే మూడేళ్లలో మొత్తం పది కోట్ల మొక్కలు నాటి, వాటిని పెంచడానికి కృషి చేయాలి.

నగర వాతావరణంలో కాలుష్యాల శాతం తగ్గించాలంటే గ్రీన్ కవర్ పెంచడం ఒక్కటే మార్గం. అన్ని సంస్థలు, పరిశ్రమలు, నిర్మాణాల్లో మొక్కలు పెంచడాన్ని తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టాలి. బెంగళూరు తరహాలో ఇంటి నిర్మాణం చేసేవారు విధిగా కొన్ని మొక్కలు పెంచేలా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి అని సమీక్షా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు అధికారులు వివరించారు.

నేలపై కూరగాయలు అమ్మడం ఏమిటి?

నేలపై పెట్టి కూరగాయలమ్ముకుంటున్నాం. హైజీనిక్‌గా ఉండాల్సిన కూరగాయల మార్కెట్లు, చేపల మార్కెట్లు, మాంసం మార్కెట్లు ఇప్పటికీ ఈగల మోత, మురికి నీటితో సహజీవనం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారకుండా హైదరాబాద్‌ను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుదామంటే అర్థం ఉందా? కూరగాయల తాజాదనాన్ని కాపాడే కోల్డ్ చైన్ వ్యవస్థ కూడా నగరంలో అందుబాటులో లేదు. మార్కెట్‌లలో కూరగాయలు కచ్చితంగా పెట్టి అమ్మేవిధంగా వాటిని సంస్కరించాలి. ఈగలు, మురుగు, చెత్త చెదారానికి దూరంగా మార్కెట్లు ఉండాలి.

డంపింగ్ యార్డులు

ఇంత పెద్ద నగరానికి చెత్త డంపింగ్ చేయడానికి సరైన యార్డులు లేవు. ఉన్నవి కాస్తా జనావాసాలకు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు నిత్యం ఫిర్యాదులు, ఆందోళనలకు దిగవలసి వస్తున్నది. నగరం అన్ని వైపుల వెయ్యి ఎకరాల భూమిని గుర్తించి ఆధునిక డంపింగ్ యార్డులు వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వీటికి అనుబంధంగానే వైద్య, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ పరికరాల వేస్ట్ డిస్పోజల్‌కు తగిన ఏర్పాట్లు జరగాలి.

శ్మశానవాటికలు

నగరంలో చాలా కాలనీలకు, బస్తీలకు శ్మశానవాటికలు కూడా లేవు. ఎక్కడో దూరంగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి నివాస సముదాయానికి సమీపంలో విధిగా ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వంపై ఉంది. చాలా చోట్ల శ్మశానవాటికలు ఆలనా పాలనా లేకుండా కబ్జాలకు గురవుతున్నాయి.

మురికివాడలు లేని నగరం

మురికివాడలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మురికివాడల్లో వర్టికల్ భవంతులు నిర్మించి, ఎక్కడివాళ్లకు అక్కడే నివాసాలు కేటాయించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నది. మిగిలిన స్థలాన్ని ఆ వాడ ప్రజలకే ఉపయోగపడే విధంగా అన్ని వసతులు కల్పించవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది.

population
ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తిగా అమలయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్), దాని చుట్టూ రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)ల వెంట వందలాది భారీ పరిశ్రమలు రావలసి ఉంది. ఉద్యోగాలకు రెండు మూడు రెట్లు జనాభా పెరుగుతుంది. ఇవి కాకుండా సహజంగా వచ్చే వలసలు కూడా తోడవుతాయి. అంటే రానున్న రెండు మూడు దశాబ్దాల్లో నగర జనాభా రెండున్నర కోట్లు దాటే అవకాశం ఉంటుంది.


నగరానికి వచ్చిపోయే జనాభా (ఫ్లోటింగ్ పాపులేషన్) ఇప్పుడే రోజూ 10 నుంచి 15 లక్షలు ఉంటుంది. కనీసం మూడు లక్షల వాహనాలు రోజూ నగరానికి వచ్చిపోతుంటాయి. రైళ్లు, బస్సు, ఇతర వాహనాల్లో జనం వస్తుంటారు. జనాభా పెరిగితే అది కూడా రెండు మూడు రెట్లు పెరుగుతుంది. అంటే ఇట్లాంటి హైదరాబాద్‌లు మరో రెండు నగరం చుట్టూ అవతరించాల్సి ఉంటుంది. జనాభావృద్ధి, పారిశ్రామికాభివృద్ధిని దష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికను రూపొందించాల్సి ఉంది. జనాభాలో, విస్తృతిలో 1931కి ముందు వరకు హైదరాబాద్ ఢిల్లీ కంటే పెద్ద నగరం. 1901 నుంచి 1931 వరకూ జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి