-హైదరాబాద్‌లో అంగుళం కూడా కబ్జాకానివ్వం
-ఐటీ, గీటీ అన్నవాళ్ళు హైదరాబాద్‌లో పరిస్థితులకు ఏం చెబుతారు?
-నేరస్తులు ఊచలు లెక్కపెట్టాల్సిందే
-గతంలో ప్రభుత్వ పథకాల అమలులో అన్నీ కుంభకోణాలే
-పీపీఏల పేచీ పెట్టింది ఎవరు?
-గత ప్రభుత్వమే కుట్రల ప్రభుత్వం
-మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్
-ఐటీ, గీటీ అన్నవాళ్ళు హైదరాబాద్‌లో పరిస్థితులకు ఏం చెబుతారు?
-నేరస్తులు ఊచలు లెక్కపెట్టాల్సిందే
-గతంలో ప్రభుత్వ పథకాల అమలులో అన్నీ కుంభకోణాలే
-పీపీఏల పేచీ పెట్టింది ఎవరు?
-గత ప్రభుత్వమే కుట్రల ప్రభుత్వం
-మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో గృహనిర్మాణం ఒక జోక్‌గా మారింది. దొంగలుదూరి వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. తెలంగాణ సర్కార్ గృహనిర్మాణ పథకం ఎప్పుడు వస్తుందా అని భోక్తలు ఎదురుచూస్తున్నారు. అక్రమాలు చేసిన వారందరిని జైల్లో పెట్టేంతవరకు వెనుకాడేది లేదు.. అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గృహ నిర్మాణ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు సోషల్ ఆడిట్‌తో గ్రామసభల్లో లబ్ధిదారులను ఎంపికచేయడం జరుగుతుందన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
భూదాన్ బోర్డు భూముల అక్రమాలను ఏం చేస్తారు?
భూదాన్ బోర్డును ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసింది. అధికారులు రికార్డులను సీజ్ చేశారు. ఆ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంది. త్వరలో భూదాన్ చట్టం రాబోతున్నది. భూములను అక్రమంగా కొన్నవాళ్ళు, అమ్మినవాళ్ళు వెంటనే స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే బతికి పోతారు, లేదంటే కఠిన చర్యలు తప్పవు. గత నలభై రోజులుగా నేను ఏమీ మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడక పోయినా ఇతరులు చర్చిస్తుంటారు. సంపూర్ణ అవగాహన లేకుండా మాట్లాడితే బాగుండదనే మీడియా ముందుకు నేను రాలేదు. ఏమి చెప్పినా కచ్చితంగా చెప్పాలి. చెప్తే అది అమలు జరగాలి. పెళ్ళి అయిన 16 రోజుల పండుగకే పిల్లలు పుట్టాలని కొందరంటున్నారు. కేసీఆర్ మౌనంగా ఉండడు, పని జరుగుతున్నది, ఈ రోజు భయంకర పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా వందల, వేల కోట్ల కుంభకోణాలు. గతంలో గృహనిర్మాణ పథకాల్లో కేవలం 590 గ్రామాల్లో 530 కోట్ల అవినీతి జరిగిందని ప్రభుత్వ లెక్కల్లోనే తేలింది. 84 లక్షల మంది పేద కుటుంబాలు ఉంటే, 91 లక్షల తెల్లకార్డులు వినియోగంలో ఉన్నాయి. సబ్సిడీ బియ్యం మాత్రం కోళ్ళ ఫామ్‌లోకి వెళుతున్నది.
అక్రమ నిర్మాణాలను ఏం చేయబోతున్నారు?
అక్రమ నిర్మాణాలకు ఎక్కడ అడ్డు, అదుపు లేదు. రాజధానిలో 60 వేలకు పైగా అనుమతులు లేని నిర్మాణాలు రాష్ట్ర సర్కార్ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. సచివాలయానికి కూతవేటులో వందల వేల, అక్రమ నిర్మాణాలు జరిగాయి. పేకాట క్లబ్‌లు పేద మధ్య తరగతి కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. వాటి పట్ల కఠినంగా వ్యవహరించి మూసివేయాలని నేనే ఆదేశించాను. ఉద్యమ సమయంలో ఒక పారిశ్రామిక సంస్థ నా దగ్గరకు వచ్చి తెలంగాణ వచ్చాక పరిస్థితులు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. అయితే రాష్ట్రం ఏర్పడేవరకే రభస ఉంటుందని చెప్పాం. అంతలో దిల్‌సుఖ్‌నగర్ బాంబు ఘటన జరిగింది. దాంతో ఆ సంస్థ బయటికి వెళ్ళిపోయింది.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు అన్ని కోణాల్లో చూస్తారు. వారికి రెగ్యులేటెడ్ సొసైటీ ఉండాలి. జీహెచ్‌ఎంసీలో అక్రమ భవనాలు కూల్చివేస్తే కొన్ని పార్టీలు బాధపడుతున్నాయి. నాలాలన్నీ ఆక్రమించడం వల్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నది. చినుకు పడితే... రాజ్‌భవన్ ముందు, సచివాలయం ముందు, అసెంబ్లీ ముందు మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడి పోతున్నవి. ఐటీ, గీటీ అన్నవాళ్ళకు ఇదంతా కనబడలేదు. దేవాలయ భూములు కబ్జా, ఇఎన్‌టీ ఆసుపత్రి భూములు కబ్జా.. ఆరునూరైనా హైదరాబాద్‌లో అంగుళం భూమి కబ్జాకానివ్వం. గతంలో ఆదేశాలు ఇక్కడ సాగవు. అన్యాయం మీద అక్రమాల మీద మా కక్ష, గుండాలు, భూబకాసురుల మీద మా కక్ష, మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు సుభిక్షంగా ఉండాలి. అందుకు శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. అక్రమ నిర్మాణాల విషయంలో ఇది ఆరంభం మాత్రమే. ఇకపై ఉగ్రనరసింహ అవతారానికి పోతా. ప్రతి ఇంచు, ఇంచుకు సీసీ కెమెరాలు వస్తాయి.
మరి ఆలయ భూముల ఆక్రమణల మాటేమిటి?
దేవాలయాల భూములను వందశాతం వెనక్కి తీసుకుంటాం. భారత దేశం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ జర్నలిస్టుల భవం ఏర్పాటు చేస్తాం. ఇందు కోసం ఎక్స్‌లెంట్ స్థలాన్ని ఎంపిక చేస్తాం. జలయజ్ఞం సంవత్సరానికి 10 వేల కోట్ల ధనయజ్ఞం. ట్యూషన్ ఫీజులు వేల కోట్ల కుంభకోణం. తెలంగాణలో ఇళ్ళ నిర్మాణం అలా కాకుడదనే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 30 సంవత్సరాల వాడికి కూడా పెన్షన్ వస్తున్నదండి. ఈ మధ్య ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇదేమిటండీ అని అడిగితే నేను తలదించుకున్నాను. సిగ్గుపడటం, బాధపడటం నా వంతైంది.
హైదరాబాద్ అధికారాలపై కేంద్రం లేఖ రాసింది కదా..
హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలపై కేంద్రం లేఖరాసిన మాట వాస్తవం. అయితే గవర్నర్‌కు అధికారాలు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రం దురుసుగా ప్రవర్తిస్తే జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రులతో కలిసి యుద్ధం ప్రకటిస్తాం. తెలంగాణ విద్యార్ధుల కోసం ఫైనాన్షియల్ అసిస్టెట్స్ టూ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ (ఎఫ్‌ఎఎస్‌టి) అనే పథకం ఒక్కటే ఉంటుంది. అవసరమైతే మా పిల్లలకు కొంత ఎక్కువ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఏ ఒక్క తెలంగాణ విద్యార్ధికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వం. ట్యూషన్ ఫీజుల విషయంలో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు పూర్తిస్థాయిలో లేరు.
ఉన్నవాళ్ళు విభజనలో ఎటు పోతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. స్థానికత, సర్టిఫికెట్లు ఇంకా రావాలి. 1956 స్థానికత సర్టిఫికెట్లు విద్యార్ధులు ఇంకా పొందాల్సి ఉంది. ట్యూషన్ ఫీజుల కేసు విషయమై సుప్రీంకోర్టులో గడువు పెంచమని కోరాం. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాలు వారి పరిధిలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని సుప్రీం కోర్టు తీర్పు ఉంది. మధ్యప్రదేశ్ విభజన విషయం దాఖలైన కేసులో ఇది స్పష్టంగా ఉంది. అంతే కాకుండా 1950 షెడ్యూల్ ఏరియాకు సంబంధించి హైకోర్టు కట్‌ఆఫ్ డేట్ కూడా పెట్టింది. తెలంగాణలో రెండునెలల పాటు విద్యా సంవత్సరాన్ని పొడిగిస్తాం. పిల్లల భవిష్యత్తుకు మాదీ భరోసా. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపుదలను తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులను సీరియస్‌గా పరిశీలిస్తున్నాం. ఇంకా ఐదారు రోజుల్లో దానిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు మీరు సిద్ధమా?
ఒక వైపు కారం పెట్టి, మరో వైపు మాట్లాడుదామనడం ఎంతవరకు సమంజసం. మేము ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించలేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) రద్దు చేసింది ఎవరండీ? పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిలో అడ్మిషన్లను మేము వ్యతిరేకించలేదు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే స్తోమత ఉన్న వారికి స్కాలర్‌షిప్‌లు ఎందుకు? లక్షా 50 వేల కోట్ల ఖర్చుతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సింగపూరు వెళ్ళి వచ్చి కొత్త రాజధాని కడతామని చెప్పుకునేవారు... వారి పిల్లల ఫీజులు కట్టలేరా? మీకు ఆ స్థోమత లేదా?, మా ప్రజలకు, మా పిల్లలకు మేము సేవలు చేస్తాం, మీ వాళ్ళ సంగతి మీరు చూసుకోండి.
పక్క రాష్ర్టాలతో సంబంధాలు ఎలా ఉంటాయి?
పొరుగు రాష్ర్టాలతో ఎప్పుడు కూడా సత్స్‌సంబంధాలు కలిగి ఉండాలనేదే మా అభిమతం. ఏపీసీఎంగా మేము ఆయన్ని గౌరవిస్తున్నాం. పొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, సిద్ధరామయ్య, పృథ్వీరాజ్ చౌహాన్‌లతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు అందరూ మాకు సమానమే. మేము అందరిని కలుపుకుని పోవాలని కోరుకుంటాం. బస్తీమే సవాల్‌కు మేము పోం. ఊం అంటే కోర్టుకు వెళుతా అనే వాళ్ళు, నీకు నాతో ఎంత అవసరమో, నాతో నీకు అంత అవసరం, నా ఇంటికి నీ ఇళ్ళు ఎంత దూరమో, నీ ఇంటికి నా ఇళ్ళు అంతే దూరం. డంబాచారాలు, డాంభీకాలు ఇక నడవయి.
ల్యాంకో అక్రమాల సంగతేమిటి?
ల్యాంకో భూములను లాగేస్తాం.వక్ఫ్ భూములను ప్రభుత్వం ఎవరికైనా కేటాయించిన పక్షంలో ఆ భూములకు చెందిన పరిహారాన్ని లేదా ప్రత్యామ్నాయ భూమిని ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు ఇస్తుంది. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్‌లకు ప్రభుత్వమే భూ కేటాయింపులు జరిపింది. ల్యాంకో లాంటి దొంగ సంస్థల నుంచి వక్ఫ్ భూములను ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తుంది. ల్యాంకో తతంగం చాలా ఉంది. దాన్ని వదలం. ల్యాంక్ భూములు ముట్టుకునేందుకు వీళ్లేదన్నట్టుగా ఓ పత్రిక రాస్తున్నది. ఎందుకు వీలుండదు...
వ్యర్ధ రసాయనాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
హైదరాబాద్ చుట్టూ డంపింగ్ యార్డుల అవసరం ఉంది. కనీసం రెండు వేల ఎకరాల స్థలం ఉంటే తప్ప డిస్పోజల్‌కు అవకాశం లేదు. దానిని సీరియస్‌గా తీసుకుంటున్నాం.
చానళ్ళ ఆంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అదేశాలపై మీ స్పందన ఏమిటి?
చానళ్ల నిలిపివేతకు మా ప్రభుత్వానికి సంబంధం లేదు.
వ్యవసాయరంగానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు?
కమతాల ఏకీకరణకు ప్రభుత్వం యోచిస్తున్నది. మన దగ్గర చిన్న చిన్న రైతులు అక్కడక్కడ భూములను కలిగి ఉన్నారు. ఒక రైతుకు నాలుగు చోట్ల భూమి ఉంది. అదంతా ఒక చోటకు వస్తేనే రైతుకు మేలు జరుగుతుంది. దీనికోసం గతంలో తెలంగాణలో రద్దు బదులు పథకం అనేది ఆచరణలో ఉండేది. దానిని ఉర్దూలో రద్దో బదల్ అని అంటారు. ఆ ఆంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నది.
పేదలకు మూడు లక్షలతో ఇంటి నిర్మాణం సంగతేమిటి?
ఇప్పుడు సిమెంట్ ధరలు పెరిగాయి. మూడు లక్షలకు మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మేము అన్న మాటకు, ఇచ్చిన హమీకి కట్టుబడి ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 125 గజాల స్థలంలో ఇళ్ళు. పట్టణాల్లో ఫ్లాట్ రూపంలో ఇంటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి