గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 20, 2014

నిమ్స్ లో డబ్బులకు పాస్ దుమారం...!

-ప్రొఫెసర్ ఆర్‌వీ కుమార్‌పై విచారణ
-ప్రభుత్వానికి నివేదిక: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్
-విచారణ చేయాలి: డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ

NIMSనాణ్యమైన వైద్యం అందించటంలో దేశంలోనే పేరెన్నికగన్న నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ప్రతిష్ఠను ఆస్పత్రి అధికారులే పాతాళానికి తొక్కేస్తున్నారు. ఒక్కో డైరెక్టర్ హయాంలో ఒక్కో వివాదంతో ఆస్పత్రి అక్రమాలకు నిలయంగా మారుతున్నది. తాజాగా వెలుగు చూసిన డబ్బులకు పరీక్ష పాస్ ఉదంతం మరోసారి నిమ్స్ గౌరవాన్ని నడిబజార్లో నిలబెట్టింది.
డబ్బులు ఇవ్వనందుకే కార్డియోథొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఆర్‌వీ కుమార్ తనను పరీక్షల్లో ఫెయిల్ చేశారని జ్యోతీంద్ర సింగ్ అనే విద్యార్థి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖరాయడంతో ఈ విషయం సంచలనంగా మారింది. నిమ్స్‌లో డాక్టర్ జ్యోతింద్రసింగ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో (ఎంసీహెచ్)లో రెసిడెంట్‌గా ఉన్నారు.

పరీక్ష పాస్ అవ్వాలంటే పది లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఫెయిల్ చేస్తానని ప్రొఫెసర్ ఆర్‌వీ కుమార్ వేధించటంతో జూన్ 26న కుమార్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అక్కౌంట్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేశారు. ఇంకా ఇవ్వాలని, లేకుంటే ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ చేస్తానని కుమార్ బెదిరించటంతో జ్యోతీంద్రసింగ్ సీఎం, డిప్యూటీ సీఎంకు లేఖ రాశారు. ఈ ఆరోపణలపై నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ విచారణకు ఆదేశించారు. అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ గోపీనాథ్, ప్రొఫెసర్ ఎల్ కృష్ణ, మరొకరితో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, విచారణ తూతూ మంత్రంగా జరుగుతున్నదని, దీని వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ సురేశ్, కో-కన్వీనర్ విజయభాస్కర్ విమర్శించారు. సీమాంధ్రకు చెందిన ఆర్‌వీ కుమార్‌ను కాపాడేందుకే కమిటీ వేశారని మండిపడ్డారు. నిజాలు వెలికితీసేందకు ప్రభుత్వమే కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

ఆర్‌వీ కుమార్‌పై ప్రాథమిక విచారణ పూర్తి: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్
ప్రొఫెసర్ ఆర్‌వీ కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ పూర్తయ్యిందని, నివేదికను ప్రభుత్వానికి, పోలీసులకు అందజేశామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ నరేంద్రనాథ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షలో పాస్ చేసేందుకు కుమార్ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కుమార్ తన వద్ద రూ.4.5 లక్షలు తీసుకున్నట్టు విద్యార్థి జ్యోతీంద్రసింగ్ తనకు ఈ నెల 16న ఫిర్యాదు చేశారని వెల్లడించారు. 

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి