- మిశ్రమ ఎరువుల మోసం.. నియంత్రణ లేని బయోప్రొడక్ట్స్
- 21 శాంపిళ్లలో 7 బోగస్.. తీసుకున్న చర్యలు శూన్యం
మట్టికి రసాయనాలు పూసి మిశ్రమ ఎరువులంటూ అమ్మేస్తున్నారు. వ్యాపారుల లాభాపేక్షకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన మిశ్రమ ఎరువుల వ్యాపారం విలువ వందకోట్లు. ఇందులో ఉత్తుత్తి ఎరువుల వ్యాపారం రూ. 90 కోట్లుగా అంచనా వేస్తున్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. రైతుల అమాయకత్వం ఆసరాగా చేసుకుని మట్టికి రసాయనాలు పట్టించి మిశ్రమ ఎరువుల పేరుతో రైతులను కంపెనీలు దోచుకుంటున్నాయి.- 21 శాంపిళ్లలో 7 బోగస్.. తీసుకున్న చర్యలు శూన్యం
ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 2013-14లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే 10.734 మెట్రిక్ టన్నుల మిశ్రమ 17:17:17, 14:35:14 ఎరువుల ద్వారా రూ.10 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా మిశ్రమ ఎరువులు తయారుచేసే యూనిట్లు 243 ఉంటే మన రా్రష్ట్రంలో 27 వరకున్నాయి. తెలంగాణ ప్రాంతంలో రైతులు మిశ్రమ ఎరువులు అధికంగా ఉపయోగిస్తారు. ప్రతి ఏటా ఖరీఫ్‌లో డీఏపీ కంటే కాంప్లెక్స్‌లను అత్యధికంగా వాడుతుంటారు. దీనితో మార్కెట్లోకి ప్రఖ్యాతిగాంచిన కంపెనీలే కాకుండా ఇతర కంపెనీలు కూడా రంగప్రవేశం చేశాయి. సాధారణంగా రైతులు భాస్వరం,(డీఏపీ), నత్రజని(యూరియా), పోటాష్ ఎరువులను విడివిడిగా వాడుతుండేవారు. ఇటీవల ఈ మూడు కలిపిన మిశ్రమ ఎరువులు వస్తుండడంతో రైతులు ఉపయోగించడం మొదలు పెట్టారు. దీనితో మార్కెట్లో వీటి వ్యాపారం జోరందుకుంది. లోగుట్టు ఏమిటంటే అనేక కంపెనీలు విక్రయించే ఎరువుల్లో బస్తాపై పేర్కొంటున్న షోషకాల్లో 25శాతం కూడా ఉండడం లేదని పరీక్షల్లో తేలింది. ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న బయోఫర్టిలైజర్స్, బయోకంట్రోల్ ఏజెంట్లు రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రైవేట్ కంపెనీలకంటే అధిక ధరలకు ఉత్పత్తులు విక్రయించమే కాకుండా నాణ్యత పాటించడంలో పాతరవేస్తున్నారు. లైసెన్స్‌లు లేకుండా, వ్యవసాయ శాఖ నిర్వహించే టెండర్లలో పాల్గొన కుండానే ప్రైవేట్ కంపెనీల కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
చర్యలు నామమ్రాతం..
2013-14 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు వివిధ బయోపెస్టిసైడ్లకు సంబంధించి 21 శాంపిళ్లు మాత్రమే సేకరించారు. ఇందులో 7 మాత్రమే నాసిరకంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కానీ గతేడాది మొత్తం 36 బయోపెస్టిసైడ్స్ శాంపి ల్స్ సేకరించినా నామమాత్రపు చర్యలతో వదిలేశారు. ఇందులో 23 కంపెనీలు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 కంపెనీలు కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నాయి. అధికారులు14 కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను పరిశీలనకు కూడా పంపించలేదు. ఈ ఏడాది తెలంగాణలో 7 శాంపిల్స్ నాసిరకంగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బయోలోనూ సమస్యలున్నాయ్..
వాస్తవంగా బయోపెస్టిసైడ్స్ ఉపయోగించడం వల్ల పెరిగే ఉల్లి, దానిమ్మ, గోధుమ, కూరగాయలు, ఆకు కూరలు నిల్వ చేయడానికి అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బయో ప్రొడక్ట్స్ నియంత్రణ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అడపాదడపా నిర్వహించే తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ పురుగు మందులు బయటపడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా సేంద్రీయ సాగుపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో సేంద్రీయ (ఆర్గానిక్), జీవ (బయో) ఎరువులు, పురుగు మందుల వాడకంపై రైతులు మొగ్గు చూపుతున్నారు.
బయో ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ కలుపుతున్నారనే ఉద్దేశంతో గతంలో వ్యవసాయ శాఖ కమిషనర్ నిలుపుదల చేయించారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. చట్టం పరిధిలోకి ఈ ప్రొడక్ట్స్ రావని కోర్టు స్పష్టం చేసింది. పురుగు మందుల తయారీ విక్రయాల కోసం కేంద్ర ప్రభుత్వం క్రిమి సంహారక రసాయనిక పురుగు మందుల చట్టం(ఇన్ సెక్టిసైడ్స్ యాక్ట్-1968)ని రూపొందించింది. దీని ప్రకారం తయారీ దారులు ముందుగా రిజిస్ట్రేషన్ కమిటీలో తమ ఉత్పత్తులను నమోదు చేసుకోవాలి. ఉత్పత్తుల తయారీకి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బయోలు ఈ చట్టంలోకి రావనే సాకుతో ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బయోలను విక్రయిస్తున్న కంపెనీలు 264 రూ.400కోట్లనుంచి 500 కోట్ల పురుగులమందులను రైతులకు అంటగడుతూ వచ్చాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి