-స్కూలు బస్సును ఢీకొన్న రైలు
-16 మంది దుర్మరణం
-14 మంది స్కూలు పిల్లలే
బడికెళ్లనంటూ మారాం చేసినవారు కొందరు.. స్కూల్లో ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనే ఉత్సాహంతో బయల్దేరింది కొందరు.. అంతా 5 నుంచి 15 లోపువారే. ఇప్పుడిప్పుడే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న నర్సరీ చిన్నారులూ ఉన్నారు. గోరుముద్దలు తిని.. అమ్మకు ముద్దులిచ్చి.. నాన్నకు టాటా చెప్పి.. స్కూలు బస్సెక్కి బయల్దేరారు! అంతలోనే ఘోరం జరిగిపోయింది! వారు వెళుతున్న బస్సు.. కాపలాలేని ఒక లెవల్ క్రాసింగ్‌ను దాటుతుండగా నాందేడ్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొంది! అయ్యో.. బిడ్డలు!! చిన్న దెబ్బ తగిలితేనే అమ్మా.. అని కేక పెట్టే ఆ పసి ప్రాణాలు.. ఏకంగా రైలే దూసుకొచ్చి.. తమ బస్సును ఛిద్రం చేయడంతో తట్టుకోలేకపోయాయి. అక్కడికక్కడే 12 మంది చిన్నారులు చనిపోయారు. -16 మంది దుర్మరణం
-14 మంది స్కూలు పిల్లలే
మరో చిన్నారి హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పలువురు విద్యార్థుల కాళ్లు, చేతులు, తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ సహా 13 మంది చనిపోయారు. చికిత్స పొదుతూ ఒక విద్యార్థి, బస్సు క్లీనర్ కూడా చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 16గా ఉంది. 20 మంది గాయపడగా.. వారిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 9 మంది మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
అప్పుడే తమ బిడ్డలను స్కూలు బస్సెక్కించి ఇంటిపనుల్లో, పొలం పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు.. పిడుగులాంటివార్తతో స్థాణువులైపోయారు. పరుగుపరుగున ఘటనా స్థలానికి వెళ్లి.. తమ బిడ్డల కోసం రోదిస్తూ కొందరు వెతుకులాడితే.. కనిపించిన కన్నబిడ్డల మృతదేహాల మీద పడి మరికొందరు గుండెలు బాదుకున్నారు. కొద్దిసేపటి ముందే తమ చేతి గోరుముద్దలు తిని బస్సెక్కారంటూ భోరున విలపించారు.
ఇలా జరిగింది..
తూప్రాన్‌లోని కాకతీయ టెక్నో స్కూలుకు చెందిన బస్సు (ఏపీ 23ఎక్స్,5349) తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్, కిష్టాపూర్, వెంకటయ్యపల్లి తదితర గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకొని వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామానికి వెళుతున్నది.
44 జాతీయ రహదారికి కొద్ది అడుగుల దూరంలోని కాపలా గేటు లేని రైలు పట్టాలను దాటుకుని బస్సు గ్రామానికి వెళ్ళాల్సి ఉంటుంది. సరిగ్గా ఉదయం 9 గంటల ప్రాంతంలో బస్సు పట్టాల వద్దకు చేరుకుంది. అప్పటికే నాందేడ్-హైదరాబాద్ ప్యాసింజర్ రైలు (నం.57564) నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్నది. రైలు సమీపంలోకి వచ్చినా చూసుకోకుండా బస్సు డ్రైవర్ భిక్షపతి (55) బస్సును పట్టాలు దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో రైలు వేగంగా వచ్చి బస్సును బలంగా ఢీ కొట్టింది. పట్టాలపైనే కొద్ది దూరం వరకు ఊడ్చుకెళ్లడంతో బస్సు నుజ్జునుజ్జయింది.
అందులో ఉన్న పిల్లలు ఆర్తనాదాలు చేశారు. కొందరు పిల్లలు బస్సులోంచి ఎగిరి దూరంగా పడిపోయారు. రైలు వస్తున్నదని అక్కడ ఆగిన ఆటోలోని ప్రయాణికులు చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నవారు పోలీసులు, 108కు సమాచారం అం దించారు. బస్సులో ఇరుక్కుపోయి.. తీవ్ర గాయాలై ఆర్తనాదాలు చేస్తు న్న చిన్నారులను అతికష్టం మీద బయటకు తెచ్చారు. ఇందుకోసం ప్రొక్లెయినర్‌ను కూడా వాడాల్సి వచ్చింది. క్షతగాత్రులైన విద్యార్థులను బయటకు తీసి హైదరాబాద్‌లోని యశోద, రంగారెడ్డి జిల్లా కొంపల్లిలోని ఆర్‌ఆర్ ఆస్పత్రులకు తరలించారు. చనిపోయినవారందరికీ తలలకు బలమైన గాయాలున్నాయి. 44వ జాతీయ రహదారి పక్కనే ఈ ప్రమాదం జరగడంతో వేల మంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
హుటాహుటిన రైల్వే అధికారులు, నేతలు
దారుణ ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ఎస్‌సీ ఫాశీ, జిల్లా ఎస్పీ షిమొషీ బాజ్‌పేయ్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైల్వే వైద్యులు కూడా అక్కడికి వచ్చారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చారు.
కాపలాలేని క్రాసింగ్‌ను, రైలు ఢీకొనడంతో ధ్వంసమైన బస్సును పరిశీలించారు. మృతదేహాలను వెంటనే మెదక్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించండతో 108 వాహనాల్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే రైల్వే జీఎం వచ్చే వరకు మృతదేహాలను తరలించనివ్వబోమంటూ కొందరు స్థానికులు, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టి, మృతదేహాలను తరలిస్తున్న క్రమంలో పలువురు యువకులు రాళ్లతో దాడిచేశారు. అక్కడే ఉన్న హరీశ్‌రావు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
అక్కడి నుంచి హరీశ్‌తోపాటు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు మెదక్ ఆస్పత్రికి తరలివెళ్లారు. మృతదేహాలను మెదక్ ఆస్పత్రికి తరలించిన తర్వాత ఘటనా స్థలాన్ని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, మాజీ మాంత్రులు గీతారెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, గద్దర్, టీడీపీ నేతలు ఎల్ రమణ, బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, శశికళయాదవరెడ్డి సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నేతలు మెదక్ ప్రభుత్వాస్పత్రికి వెళ్ళి అక్కడ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆస్పత్రి వద్ద బాధిత తల్లిదండ్రులను ఓదార్చారు.
రెండు కుటుంబాల్లో ఇద్దరేసి బిడ్డలు..
గజ్వేల్, జూలై 24 (టీ మీడియా): ఉన్న ఇద్దరు పిల్లలు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాలు తల్లడిల్లాయి. తమ పిల్లలు తమను విడిచి వెళ్ళిపోతే తామెవరికోసం బతికేదంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు చూపరులను కలచివేశాయి. ఉన్న ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో ఓ తండ్రి గుండెపోటుకు గురికాగా, మరో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన వజీరాబేగం, వలియొద్దీన్‌ల పిల్లలు రషీద్(7), హజియ(4) మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెందగా, పిల్లల మృతదేహాలను చూసి తండ్రి వలియొద్దీన్ గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. సకాలంలో ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. వలియొద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా ఇద్దరు పిల్లలు మృతి చెందడం ఆ కుటుంబంలో పిల్లల్ని లేకుండా చేసింది. గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతల రాములు మొదటి భార్యకు పిల్లలు కాలేదని రెండో పెళ్ళి చేసుకున్నాడు. వారి ఇద్దరి పిల్లలు సుమన్(10), విద్య(7) రైలు ప్రమాదంలో మృత్యువాతకు గురయ్యారు. ఉన్న ఇద్దరు పిల్లలను రైలు ప్రమాదంలో మృత్యువు కబళించడంతో వారు ఒంటరివారయ్యారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి