గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 10, 2014

ఆగని సీమాంధ్ర కుట్రలు...!

-పోలవరం అథారిటీలో తెలంగాణ అవసరం లేదు
-హోంమంత్రికి ఆంధ్ర టీడీపీ ఎంపీలు మెమోరాండం
-సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: ఎంపీ సీతారాంనాయక్
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం ముంపుప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకున్న ఆంధ్రనేతల కళ్లు ఇప్పుడు ఖమ్మంజిల్లాలోని బూర్గంపాడుపై పడ్డాయి. ఆ గ్రామాన్ని కూడాఆంధ్రప్రదేశ్‌లో కలుపాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నేతృత్వంలోని ఒక బృందం పార్లమెంటులో రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి 4పేజీల మెమొరాండంను అందజేసింది. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రతకు ఇబ్బంది ఏర్పడిందని, గవర్నర్‌కు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అధికారాలకు అదనంగా అంతర్గత భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణను కూడా ఆయనకు అప్పగించాలని కోరారు.

SITHARAM-NAYAKరాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టువల్ల ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురవుతున్నట్లు 2005లో అప్పటి సాగు నీటిపారుదల విభాగం జారీ చేసిన ఉత్తర్వులోనే రెవిన్యూ గ్రామాల పేర్లు కూడా స్పష్టంగా ఉన్నాయనన్నారు. ఆ గ్రామాలకుతోడు బూర్గంపాడు, సీతారాంనగరం, కొండ్రెక గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో మూడో సెక్షన్‌లో స్పష్టంగా ఉందని, పోలవరం ఆర్డినెన్సుకు సంబంధించిన బిల్లులో మాత్రం బూర్గంపాడు పేరు కనబడలేదని, అందువల్లే రాజ్‌నాథ్‌ను కలిశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరమే లేదని చౌదరి స్పష్టం చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో భద్రాచలం పట్టణానికి, రామాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైతే కేంద్రం ప్రత్యేకంగా జాతీయ రహదారిని నిర్మిస్తుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

సీమాంధ్ర పెత్తనాన్ని సహించం: సీతారాంనాయక్

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్సును తీసుకురావడంలో సీమాంధ్ర నాయకుల ప్రవర్తనను యావత్తు తెలంగాణ సమాజం స్పష్టంగా గమనిస్తున్నదని మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ చెప్పారు. ముంపు ప్రాంతాలను పరిరక్షించుకునేందుకు మరో ఉద్యమం చేస్తామన్నారు. పోలవరం డిజైన్ మార్చడం ద్వారా సుమారు 2లక్షల మంది గిరిజనులు నిర్వాసితులు కాకుండా చూడడంతో పాటు ప్రాజెక్టు వల్ల ఒనగూరే ప్రయోజనాలను కూడా సాధించుకోవచ్చునని స్పష్టం చేశారు. గతంలో అనేక ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన గిరిజనులకు ఇప్పటివరకూ పరిహారం, పునరావాసం లభించలేదని, ఇప్పుడు పోలవరం విషయంలో ఏ మేరకు న్యాయం జరుగుతుందో కూడా చెప్పడం లేదని అన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోనూ ముంపు ప్రాంతాలు ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్సులు రూపొందించలేదని ఆయన ప్రశ్నించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి