గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 27, 2014

ఏపీజీఏడీకి విభజన బాధ్యతా?

-తెలంగాణ సర్కారుకు భాగస్వామ్యం ఇవ్వాల్సిందే
-కమల్‌నాథన్ ఉత్సవ విగ్రహం
-మార్గదర్శకాలపై ఢిల్లీలోనే తేల్చుకుంటాం
-తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ
ఉద్యోగుల విభజన ప్రక్రియలో కమల్‌నాథన్ కేవలం ఉత్సవ విగ్రహంగా మారిపోయారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఘాటుగా విమర్శించింది. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మొత్తం అవశేష ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలనా శాఖకు ధారపోయడాన్ని తీవ్రంగా విమర్శించింది. దీనివల్ల తెలంగాణ ఉద్యోగులకు ఎట్టి పరిస్థితిలోనూ న్యాయం జరిగే అవకాశమే లేదని పేర్కొంది. దీనితో పాటు ప్రక్రియ మార్గదర్శకాల్లో అడుగడునా తెలంగాణ వ్యతిరేక నిబంధనలే పొందుపరిచారని దుయ్యబట్టింది.
deviprasad
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వీటిని రూపొందిస్తే కమల్‌నాథన్ సంతకం చేసి వెబ్‌సైట్లో పెట్టినట్టు ఉందని జేఏసీ విమర్శించింది. ఈ దురన్యాయాలను కేంద్రం దృష్టికి తెచ్చేందుకు ఆగస్ట్ మొదటి వారంలో ఢిల్లీ పర్యటన జరుపుతున్నట్టు ప్రకటించింది. ఆప్షన్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించాలని, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, ఆంధ్ర ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించాలని జేఏసీ డిమాండ్ చేసింది.

తెలంగాణ ఉద్యోగుల మనోభావాలకు విఘాతం కలిగిస్తున్న 18ఎఫ్‌ను పూర్తిగా రద్దు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవో కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం వివరాలను టీఎన్‌జీవో నేత జీ దేవీప్రసాద్ విలేకరులకు వివరించారు. ఆగస్టు 2న మరోసారి ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహిస్తామని, అభ్యంతరాల నివేదికను రూపొందిస్తామని, ఆగస్టు 4న కమల్‌నాథన్‌కు అందజేస్తామని వివరించారు

కేంద్రానిది గుత్తాధిపత్య ధోరణి...

ఉద్యోగుల విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గుత్తాధిపత్యాన్ని తీసుకున్నదని ఆయన విరుచుకుపడ్డారు. ఏపీజీఏడీకి నోడల్ ఏజెన్సీ బాధ్యతలను ధారాదత్తం చేయడం ద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను కాలరాచి వేశారని దుమ్మెత్తిపోశారు. విభజనలో ఏపీ ప్రభుత్వంతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

భార్య లేదా భర్త విధిగా తెలంగాణ ప్రాంతానికి చెందినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని పేర్కొన్నారు. ఉద్యోగి తల్లిదండ్రుల స్థానికత ఆధారంగానే దీన్ని నిర్ధారించాలని కోరారు. ఆప్షన్లంటూ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని భార్యభర్తల పేరుతో తెలంగాణకు కేటాయిస్తే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

18ఎఫ్ వద్దే వద్దు..

తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషాలో ఏదేని శాఖలో 42 శాతం ఉద్యోగులు లేనట్లయితే ఆంధ్రా ఉద్యోగులను బట్వాడా చేస్తామని మార్గదర్శకాలలో 18ఎఫ్ తెలియజేయడం గర్హణీయమన్నారు. 18 ఎఫ్ నిబంధనల ప్రకారం ఆంధ్రా ఉద్యోగులందరూ తెలంగాణలో తిష్ఠవేసే ప్రమాదమున్నదన్నారు. 10వ షెడ్యూల్‌లోని సంస్థలపైన సంవత్సరం తర్వాత నిర్ణయం తీసుకుంటామనడంతో వాటిలో ఆంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలే అవకాశాలు లేవని విమర్శించారు.

ఇప్పటి వరకు 12లక్షల ఉద్యోగాల్లో 56 వేల మంది ఉద్యోగులను మాత్రమే విభజించారని మిగతా 11లక్షల ఉద్యోగుల విభజనపై ఎప్పుడు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ విభాగాలలో 20 శాతం, 30 శాతం, 40 శాతం స్థానికేతర కోటా సృష్టించి వేలాది ఆంధ్రా ఉద్యోగులు చేరిపోయారని వారి కారణంగా తెలంగాణ వేలాది ఉద్యోగాలను కోల్పోయిందని చెప్పారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తూ ఎఫ్ ఫామ్‌లోఉన్న ప్రతి ఉద్యోగి వివరాలను పబ్లిక్ డెమోనియంలో పొందుపర్చాలని కోరారు.

కో ఛైర్మన్ సీ విఠల్ మాట్లాడుతూ కమలనాథన్ ఉత్సవ విగ్రహమై పోయారని, ఆంధ్రా ప్రభుత్వం రాసిచ్చిన మార్గదర్శకాలపైన కమలనాథన్ సంతకం చేసి వెబ్‌సైట్‌లో పెట్టారని విమర్శించారు. విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ ఛైర్మన్ శివాజీ మాట్లాడుతూ తెలంగాణలో మూడు వేల మంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లున్నారని వీరిని ఏపీకే కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్ తెలంగాణ ఉద్యోగులను, అధికారులను తెలంగాణకు కేటాయించాలనే అతిసాధారణ నిబంధనపైన ఎందుకింత గింజుకుంటున్నారని మండిపడ్డారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి