గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 13, 2014

పక్కా ప్రణాళికతోనే...లెక్కప్రకారం...నొక్కేశారు!

-ఉమ్మడిరాష్ట్రంలో మాదిరే డెల్టాకు పది టీఎంసీలు
-ఇప్పటికే తాగునీటి పేరుతో 7.2 టీఎసీలు విడుదల
-మరో మూడు టీఎంసీలూ ఇవ్వాలన్న రివర్‌బోర్డు
-510 అడుగులకు తగ్గితే రాజధానికి నీళ్లు కష్టమే
నోరు ఉన్నోళ్లదే ఊరు అన్నట్లు.. ఇప్పుడు నోరుంటేనే నీరు! గొంతెండుతోందని ఆంధ్రప్రదేశ్ నేతలు పదేపదే నోరువిప్పి తాగునీటి ముగుసుగులో డెల్టా నారుమడులకు నీరు తరలిస్తున్నారు. తాగునీటి కోసం కృష్ణా నీళ్లుకావాలని కోరిన వెంటనే కృష్ణాబోర్డు 3.6 టీఎంసీలు ఇవ్వాలని ఆదేశించింది. నీరు పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి రాలేదనే సాకుతో.. మరో 3.6 టీఎంసీలు తరలించుకుపోయారు. తాజాగా మరో 3 టీఎంసీలకు ఎసరు పెట్టారు.

కృష్ణా డెల్టా, ఏఎమ్మార్పీ కింద చెరువులకు చెరో 3 టీఎంసీలు ఇవ్వాలని తాజాగా కృష్ణా రివర్‌బోర్డు ఆదేశించింది. సాగర్‌లో అందుబాటులో ఉన్న నీళ్ల నుంచి తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కుడి, ఎడమ కాల్వలకు చెరో 10 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి వదిలాక తీసుకోవాలని...త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్‌లో డెల్టా నారుమడుల కోసం 10 టీఎంసీలు విడుదల చేసే విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం జలదోపిడీకి అడ్డుకట్ట వేయడంతో ఎట్టకేలకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఏపీ పాలకులు తాగునీటి ముసుగులో పది టీఎంసీలు పక్కాగా తరలించుకుపోతున్నారు!

ఇప్పుడు జంటనగరాలకు తాగునీటి సమస్య

వాస్తవానికి నాగార్జునసాగర్ నుంచి నాలుగు టీఎంసీలకు మించి వాడుకునే పరిస్థితి లేదు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.045 (590 అడుగులు) టీఎంసీలు. ప్రస్తుతం 136.82 (513 అడుగులు) టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 510 అడుగులు డెడ్‌స్టోరేజీ కాగా.. అప్పటికి 133 టీఎంసీల నీరే ఉంటుంది. ఈ లెక్కన 3.82 టీఎంసీల నీరే వాడుకునే వీలుంది.

సాగర్‌లో నీటి నిల్వలు లేకున్నా 6 టీఎంసీల నీరు ఇప్పటికిప్పుడు ఎలా ఇస్తారనేది అసలు ప్రశ్న. హైదరాబాద్ జంట నగరాలకు నీరందించే ఏఎమ్మార్పీ మోటార్లు నడవాలంటే సాగర్ నీటి మట్టం 510 అడుగులకు తగ్గొద్దు. ఈ నేపథ్యంలో మరో 2 టీఎంసీలు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎగువన శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 834.2 అడుగులు ఉంది. 834 అడుగుల మేర నీటిమట్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలున్నాయి.

మరోవైపు కుడి, ఎడమకాల్వలకు చెరో 10 టీఎంసీలు ఇవ్వాల్సి ఉన్నందున 20 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి సాగర్‌కు వదలాల్సిందే. దీంతో శ్రీశైలంలో ప్రస్తుతం 54 టీఎంసీలు ఉండగా, 20 టీఎంసీలు వదిలితే 34 టీఎంసీలకు పడిపోనుంది. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి నీటి విడుదల మాట ఎలా ఉన్నా, ఇప్పటికిప్పుడు సాగర్ నుంచి ఆరు టీఎంసీలు ఇస్తే మాత్రం ఏఎమ్మార్పీ మోటార్లకు ఇబ్బందులు తప్పవు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి