- అడ్మిషన్లకు మించిన సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు
- అక్రమాలకు తెరదించనున్న తెలంగాణ సర్కార్
- స్థానికత మార్గదర్శకాలపై నిపుణులతో సంప్రదింపులు
- కటాఫ్ సంవత్సరం నిర్ధారణపైనా చర్చలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రస్తుతమున్న జీవోను ప్రభుత్వం రద్దుచేయనున్నదని విశ్వసనీయ సమాచారం. దీని స్థానంలో కొత్త జీవో త్వరలో జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నదని తెలిసింది. అత్యంత కీలకంగా మారిన స్థానికత నిర్ధారణకు ఏ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. మర్రి చెన్నారెడ్డి హెచ్చార్డీలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. కొత్త జీవో జారీ విషయంలో చర్చించారు.- అక్రమాలకు తెరదించనున్న తెలంగాణ సర్కార్
- స్థానికత మార్గదర్శకాలపై నిపుణులతో సంప్రదింపులు
- కటాఫ్ సంవత్సరం నిర్ధారణపైనా చర్చలు
ఈ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలపై న్యాయ సలహాకోసం అడ్వకేట్ జనరల్, లా సెక్రటరీ, ఇతర సీనియర్ న్యాయవాదులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది. ఇతర రాష్ర్టాల్లో కొనసాగుతున్న విధివిధానాలను, అమల్లో ఉన్న చట్టాలను కూలంకషంగా అధ్యయనం చేస్తున్నారు. స్థానికత విషయంలో 1956ను కటాఫ్‌గా తీసుకోవాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ఇతరత్రా అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిధులు తెలంగాణ పేద విద్యార్థులకే చేరాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. పుట్టగొడుగుల్లా వచ్చిన కాలేజీలు కొన్ని ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడుతున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలంటూ మరికొన్ని కనిపిస్తున్నా అవి కూడా ఏదోవిధంగా ప్రభుత్వ ఆర్థికసాయంపైనే మనుగడ సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా పారదర్శక విధానాన్ని పాటించి, స్థానిక విద్యార్థులకు ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వ ఉత్తర్వును రూపొందించేందుకు పరిశీలన జరుగుతోంది.
స్థానికత ధ్రువీకరణ పత్రం జారీలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన విధివిధానాలను పకడ్బందీగా రూపొందిస్తున్నారు. తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల్లో అత్యధికం సీమాంధ్రుల యాజమాన్యంలోనే ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు పలు రకాల మార్కెటింగ్ విధానాలను అవలంబించడం ద్వారా తెలంగాణ విద్యార్థులను ఆకర్షించి, అడ్మిషన్లు పెంచుకుని ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను వినియోగించుకుంటున్నాయి. వివిధ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్యకు మించి ప్రభుత్వం నుంచి జారీ అవుతున్న స్కాలర్‌షిప్‌లు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆధికారులను కాలేజీ యాజమాన్యాలు ప్రలోభాలకు గురిచేసి, తమకు అనుకూలంగా ఎక్కువ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, ఇతర వత్తి విద్యా కళాశాలల మీద ఉన్నది. మరోవైపు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లను అందుకుంటున్న విద్యార్థుల్లో సీమాంధ్రకు చెందిన వారు కూడా అధికశాతంలో ఉన్నట్లు సమాచారం. ఈ లోటుపాట్లను సవరించడంతోపాటు తెలంగాణ విద్యార్థులకు చెందాల్సిన స్కాలర్‌షిప్‌లను వారికే దక్కేలా, దుర్వినియోగం కాకుండా, సీమాంధ్ర కళాశాలల అక్రమాలకు అడ్డుకట్టవేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి