-సచివాలయంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల హవా!
-పెన్నులు, పిన్నులు మొదలు ఫర్నీచర్‌దాకా
-మార్కెట్ రేటుకు రెట్టింపు ధరలతో సరఫరా
-గప్‌చుప్‌గా ఆర్థిక శాఖ అధికారులు
-పర్సంటేజీలు అందుతుండటంతోనే!
దస్‌కా బీస్.. బీస్ కా చాలీస్! ఇదేమీ సిన్మా థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్ల వ్యవహారం కాదు! వందకు వెయ్యి.. వెయ్యికి పదివేలు..! ఇదేమీ కాయ్ రాజా కాయ్ అంటూ సాగే పందాలు కావు! తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో స్టేషనరీ, ఫర్నీచర్, కంప్యూటర్లు వగైరా సరఫరా చేసే కాంట్రాక్టర్ల బిల్లింగ్ వ్యవహారం.-పెన్నులు, పిన్నులు మొదలు ఫర్నీచర్‌దాకా
-మార్కెట్ రేటుకు రెట్టింపు ధరలతో సరఫరా
-గప్‌చుప్‌గా ఆర్థిక శాఖ అధికారులు
-పర్సంటేజీలు అందుతుండటంతోనే!
తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వలసపాలకులు, వారి ఆశ్రితులు అందినంత దోచుకుతింటే.. సచివాలయం సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరమైన స్టేషనరీ, ఫర్నీచర్ తదితరాలు సమకూర్చే ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత కూడా తమతమ స్థాయిలో చిలక్కొట్టుడు కొడుతున్నారు. పిన్నులు, పెన్నులు, ఫైళ్లు, అందులో కాగితాలు మొదలుకుని విద్యుత్ ఉపకరణాలు, కంప్యూటర్లు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్, అధికారుల ట్రావెల్ సదుపాయాల వరకూ సరఫరా చేసే, సమకూర్చిపెట్టే, మరమ్మతులు చేసే కాంట్రాక్టు సంస్థలన్నీ ఆంధ్ర ప్రాంతంవారివే కావడం విశేషం.
సీఎం పేషీ, మంత్రుల కార్యాలయాలు సహా పెద్ద సంఖ్యలో ఆఫీసులు ఉన్న సచివాలయంలో సహజంగానే కాగితాలు, కలాలు, గుండు పిన్నులు వంటి స్టేషనరీ అదే స్థాయిలో అవసరం ఉంటుంది. ఒక్క స్టేషనరీ ఖర్చే రోజుకు వేల రూపాయల్లో ఉంటుంది. ఈ స్టేషనరీ సరఫరాలో భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు అభిప్రాయాలు ఉన్నాయి. చాలామటుకు కేసులలో బయటి మార్కెట్ ధరకు రెట్టింపు బిల్లు వేస్తున్నారని పలువురు సిబ్బంది చెప్తున్నారు.
అధికమొత్తంలో సరఫరా చేసే సంస్థల నుంచి అధికారులకు, కొందరు కీలక ఉద్యోగులకు సరఫరా కాంట్రాక్ట్ సంస్థల నుంచి పర్సంటేజి ముడుతుంటుందని అంటున్నారు. అందుకే సరఫరాదారులు రెట్టింపు బిల్లులు వేసినా.. వాటిని క్లియర్ చేసేస్తుంటారని సమాచారం. కొత్తగా ఐఏఎస్ అధికారులు నియమితులైనప్పుడు, మంత్రులు బాధ్యతలు స్వీకరించినప్పుడు కాంట్రాక్టర్లకు పండుగే.
వారివారి పేషీల్లోకి అవసరమైన ఫర్నీచర్‌ను సరఫరా చేసే సమయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇవి లక్షల రూపాయల్లో ఉండటంతో మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయని చెబుతున్నారు. సర్కారీసొమ్మేకదా.. మనదేం పోయిందని భావించే కొందరు అధికారులు పర్సంటేజీలకు ఆశపడి.. కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే బయట పది రూపాయలకు దొరికే వస్తువుకు సెక్రటేరియట్‌లో ఇరవై, ఇరవై ఐదు రూపాయలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తున్నది.
సాధారణ ప్రజల పనులకోసం చిన్న చిన్న విషయాలకు సైతం కొర్రీలు వేసే ఆర్థికశాఖ అధికారులు ఇలాంటి వాటికి మాత్రం ఎలాంటి అడ్డుపుల్లలు వేయకపోవడం విశేషం. ఐఏఎస్ అధికారులు, మంత్రులకు ట్రావెల్స్ పేరుతో వాహనాలు ఏర్పాటు చేసేవారిది మరో వ్యవహారం. ఈ వాహనాల కోసం నెలకు వేల రూపాయల్లో అద్దెలను అధికారులు చెల్లిస్తుంటారు. వాహనాలు సరఫరా చేసే ట్రావెల్ ఏజన్సీలు కూడా ఆంధ్ర ప్రాంతం వారివే. మరి ఈ చిలక్కొట్టుడుకు ముగింపు ఎప్పుడో?
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి