గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 13, 2014

బడ్జెట్: జైట్లీ చదవని భారీ సంస్కరణలు...!



ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తన నోటితో చదవని భారీ సంస్కరణలు బడ్జెట్‍లో దండిగానే ఉన్నాయి. ఆంగ్లంలో బిగ్ టికెట్ రిఫార్మ్స్‍గా పశ్చిమ కార్పొరేట్ పత్రికలు పిలిచే ఈ సంస్కరణలే బడ్జెట్ అసలు సారాంశం. జనం మెచ్చే కేటాయింపులు సభలో చదివి తక్షణం ప్రతిపక్షాలు, ప్రజల నుండి విమర్శలు ఎదురయ్యే ప్రతిపాదనలను చదవకుండా ఆర్థికమంత్రి జాగ్రత్తపడ్డారు. తద్వారా పేదలది ఎంతమాత్రం కాని బడ్జెట్‍ని "ఇది పేదల బడ్జెట్" అని ప్రధాని నిరభ్యంతరంగా ప్రకటించే వెసులుబాటును కల్పించారు.

మరీ చిత్రం ఏమిటంటే ఈ సంస్కరణాలన్నీ గత యు.పి.ఏ ప్రభుత్వం ప్రతిపాదించినవే. ప్రతిపక్షంలో కూర్చుని వాటిని విమర్శించిన బి.జె.పి ఇప్పుడు యు.పి.ఏ కంటే వేగవంతమైన లక్ష్యాలను వాటికి ప్రతిపాదించడం ఘరానా మోసం. చట్ట సభల సాక్షిగా చేసిన చెవి కట్టు (కనికట్టు లాగా)!

ఉదాహరణకి డీజెల్ ధరలను పూర్తిగా డీ కంట్రోల్ చేస్తామని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. ఇప్పటికే పెట్రోల్ ధరలను డీ కంట్రోల్ చేయడంతో అది సామాన్యుడికి అందుబాటులో లేదు. వ్యవస్థ సృష్టించే వివిధ రకాల ఆటంకాల వలన వాహన ప్రయాణాలు మానుకోలేని మధ్యతరగతి జనం అనివార్యంగా తమ వేతనంలో గణనీయ మొత్తాన్ని ఇంధనం కోసం ఖర్చు చేసి ఇతర ఖర్చులకు డబ్బు మిగుల్చుకోలేని పరిస్థితిలో ఉండగా కాస్త తక్కువకు అందుబాటులో ఉండే డీజెల్‍ను కూడా డీ కంట్రోల్ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. అది కూడా వేగంగా.

మార్చి 2015లోపు డీజిల్ ధరలను పూర్తిగా డీ కంట్రోల్ చేసి మార్కెట్ ఆటు పోట్ల దయా దాక్షిణ్యాలకు జనం అవసరాల్ని వదిలేస్తామని బడ్జెట్ ద్వారా జైట్లీ చెప్పారు. మార్చి లోగా మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా తగ్గిస్తామని బడ్జెట్ లో మంత్రి పేర్కొన్నారు. అనగా 'డీ కంట్రోల్' అన్న పదం ఉపయోగించకుండా డీ కంట్రోల్ చేశారు. డీజిల్ ధర లీటర్ కు రు. 1/- పెంచినందుకు ప్రతిపక్షాలు విమర్శిస్తే యు.పి.ఏ చేసిన నిర్ణయాన్నే మేము అమలు చేశాం అని సమర్థించుకున్న అరుణ్ జైట్లీ డీజెల్ డీ కంట్రోల్ నిర్ణయాన్ని ఎవరి మీదకు నెడతారు? నెట్టడానికి ఎవరూ లేకనే ఆ నిర్ణయాన్ని చదవడం మానేశారా?

మరో శక్తి వనరు సహజవాయువు ధరలను కూడా వాస్తవికతకు సమీపంగా తెస్తామని చెబుతూ 'కీలెరిగి వాత పెట్టే' విద్యను ఆర్థిక మంత్రి ప్రదర్శించారు. కుటుంబానికి సబ్సిడీ రేట్లకు సంవత్సరానికి 12 సిలిండర్లు ప్రస్తుతం ఇస్తున్నారు. ఈ కోటాను వాస్తవిక స్థాయికి తెస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆ వాస్తవికత ఏమిటన్నది రహస్యం ఏమీ కాదు. ఇలాంటి చాటుమాటు పదజాలం గత ప్రభుత్వాలు ఉపయోగించినవే. వాస్తవికత అంటే సహజవాయువు వాస్తవ ధరకు దగ్గరగా ఉండే విధంగా సబ్సిడీని నియంత్రిస్తామని చెప్పడం. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏ మేరకు తగ్గిస్తారో, ఎప్పుడు తగ్గిస్తారో చెప్పలేదు. జనం నెత్తిపై గ్యాస్ పిడుగు వేసే అవకాశాన్ని ఆయన అట్టేపెట్టుకున్నారు.

మంత్రిగారికి తెలుసో లేదో గానీ చమురు ఉత్పత్తుల కోసం ప్రభుత్వం వసూలు చేస్తున్న ధరలకు, చమురు దిగుమతి ధరలకు హస్తిమశకాంతరం ఉంది. జనం చెల్లిస్తున్న పెట్రోలు, డీజెల్ ధరల్లో ముప్పాతిక భాగం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులే. మంత్రిగారు చెప్పిన 'వాస్తవికత'ను ఇంధనం ధరలకు అన్వయిస్తే ప్రజలకు భారీ యెత్తున ఉపశమనం కలుగుతుంది. ఇంకో సంగతి ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ ఆదాయంలో 35 శాతం చమురుపై పన్నుల వల్లనే సమకూరుతోంది. అనగా ఇంధన ధరల్లో ప్రధాన దోషి అంతర్జాతీయ పరిస్థితులు కాదు, భారత ప్రభుత్వ నిలువు దోపిడీయే కారణం.

డీజిల్ ధరలకు ఆహార ధరలతో నేరుగా సంబంధం ఉంటుంది. భారీ వాహనాలన్నీ డీజెల్‍తో నడిచేవే. కాబట్టి ధాన్యం దగ్గరి నుండి కూరగాయల వరకూ తమ తమ ధరల్లో డీజెల్‍ని మోస్తూ ఉంటాయి. అలాంటి డీజెల్‍ని డీ కంట్రోల్ చేస్తే ద్రవ్యోల్బణం మరింతగా కట్లు తెంచుకోవడం ఖాయం. ముఖ్యంగా ఆహార ధరలు శ్రామిక ప్రజలకు అందకుండా పోతాయి. వారి కొనుగోలు శక్తి మరింతగా పడిపోతుంది. 

సహజవాయువు ధర కూడా ప్రైవేటు కంపెనీల లాభాల కోసం ఆకాశంలో ఉంచారు. ఒక మిలియన్ బ్రిటిష్ ధర్మల్ యూనిట్ సహజవాయువుకు 2 డాలర్ల చిల్లర, రిలయన్స్ కంపెనీకి చెల్లిస్తుండగా, యు.పి.ఏ ప్రభుత్వం కాంట్రాక్టు గడువు ముగియకుండానే 4.2 డాలర్లకు పెంచేసింది. ఒక పక్క రిలయన్స్ కంపెనీ మోసపూరితంగా సహజవాయువు ఉత్పత్తి తగ్గిస్తున్నప్పటికీ కాంట్రాక్టు ప్రకారం జరిమానా వసూలు చేయవలసి ఉన్నప్పటికీ మరోపక్క ధరలను మళ్ళీ రెట్టింపు (8.34 డాలర్లకు) చేశారు. ఇది వాస్తవిక ధర కాదన్న సంగతి మంత్రిగారి దృష్టిలో ఉన్నదా? ఒకేసారి కాకుండా దశలవారిగా ఈ పెంచిన ధరను రిలయన్స్ కు చెల్లిస్తామని ఆర్ధికమంత్రి బడ్జెట్‍కు ముందు రాజ్యసభలో చెప్పారు. తద్వారా యు.పి.ఏ నిర్ణయాన్ని కొనసాగిస్తామన్న హామీని కంపెనీకి ఇచ్చారు. 

సహజవాయువును ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చును బట్టి ధర చెల్లించడం వాస్తవికత. కానీ ఉత్పత్తి ఖర్చును వదిలేసి ప్రపంచ మార్కెట్‍తో సమానంగా ఉండాలనీ, ధరలు తక్కువగా ఉంటే విదేశీ పెట్టుబడులు రావని చెబుతూ ధరలను పెంచడం వాస్తవికత కాకపోగా పచ్చి దగా. అసలు వాస్తవికతను పట్టించుకోని పాలకులు ప్రజల వనరులను ప్రజలకు ఇచ్చే విషయంలో ఉనికిలో లేని సరికొత్త వాస్తవికతను సృష్టించడం దగా కాక ఇంకేమిటి?

ఆర్ధిక మంత్రి చదవని మరో సంస్కరణ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (DBT) లేదా నగదు బదిలీ పధకం. యు.పి.ఏ ప్రతిపాదించిన ఆధార్ కార్డు ద్వారానే ఈ పధకాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ పధకాన్ని బి.జె.పి నిన్నటివరకూ విమర్శించింది. అధికారంలోకి రాగానే స్వరం మార్చింది. సబ్సిడీ మొత్తాన్ని తగ్గించడమే ఈ పధకం లక్ష్యం. ప్రజా పంపిణీ వ్యవస్ధ, గ్యాస్, కిరోసిన్, పంచదార తదితర సబ్సిడీలను వస్తు రూపేణా కాకుండా డబ్బు రూపేణా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయడానికి సంకల్పించిన ఈ పధకం పైలట్ దశలోనే సరిగ్గా అమలు చేయలేక యు.పి.ఏ వాయిదా వేసుకుంది. ఆధార్ కు గ్యాస్ సిలిండర్ తదితర సబ్సిడీలకు లంకె పెట్టొద్దని సుప్రీం కోర్టు, హై కోర్టులు ఇటీవల ఆదేశించినా బి.జె.పి ప్రభుత్వం పట్టించుకునే యోచనలో లేదని స్పష్టం అవుతోంది.

ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన మరో తీవ్ర సంస్కరణ చర్య ప్రభుత్వ కంపెనీల ప్రయివేటీకరణ. ప్రభుత్వరంగ కంపెనీల వాటాల అమ్మకం ద్వారా ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 63,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ 9 నెలల్లో సంపాదించాలని లక్ష్యంగా ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ లో యు.పి.ఏ ప్రతిపాదించిన మొత్తం (రు. 56,000 కోట్లు) కంటే ఇది 7,000 కోట్లు ఎక్కువ. ఇంతవరకు ఈ ఖాతా కింద ప్రభుత్వాలు ప్రకటించిన ఆదాయంలో రు 40,000 కోట్లు అత్యధికం. ఆ లక్ష్యాన్ని సైతం అప్పటి (2012) ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పూర్తి చేయలేదు. ఈసారి లక్ష్యాన్ని పూర్తి చేస్తే అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీలు రికార్డు సృష్టించినవారవుతారు.

తెలిసి చెప్పారో, మర్చిపోయి చెప్పారో తెలియదు గానీ ఈ చర్య జాతీయ ప్రయోజనాలకు ఎలా వ్యతిరేకమో ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోనే చెప్పారు. వాటాల అమ్మకం వలన ఇక నుండి ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల ద్వారా వచ్చే లాభాల ఆదాయం పైన ఆధారపడే అవకాశం ఉండదని మంత్రి చెప్పారు. ప్రభుత్వ వాటాలను ప్రైవేటు కంపెనీలకు అమ్ముకోవడం అంటే ఆ మేరకు ఆదాయాన్ని ప్రైవేటు కంపెనీలకు వదులుకోవడమే. కాబట్టి ప్రభుత్వాదాయం తగ్గిపోతుంది. ఈ లోటును పన్ను పునాదిని విస్తరించడం ద్వారా పూడ్చుకోవాలని మంత్రి తలపెట్టారు.

ఒకవైపేమో బడ్జెట్ వ్యయంలో అధికమొత్తాన్ని పెట్టుబడి వ్యయానికి, ఆస్తుల సృష్టికి కేటాయించాలని లక్ష్యం ప్రకటిస్తారు. మళ్ళీ అదే చేత్తో దశాబ్దాల తరబడిన భారతీయుల శ్రమతో సృష్టించిన పారిశ్రామిక ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అయినకాడికి అమ్మేస్తారు. ఫిస్కల్ ప్రుడెన్స్ (కోశాగార మెలకువ) గురించి బడ్జెట్ పత్రంలో పదే పదే నీతిబోధలు కావించిన ఆర్ధిక మంత్రి ఇలాంటి జాతి వ్యతిరేక, జాతీయ వ్యతిరేక ప్రతిపాదనలను ఏ కారణం చెప్పి సమర్ధిస్తారు?

పైన చెప్పినట్లు ఆర్ధిక మంత్రి ప్రతిపాదించిన మరో బిగ్ టికెట్ రిఫార్మ్ ఆదాయాన్ని ఆస్తుల సృష్టికి ప్రధానంగా వినియోగించడం. రాష్ట్రాలకు చెల్లిస్తున్న పన్నుల వాటాలో కూడా అధికమొత్తాన్ని పెట్టుబడి ఆస్తుల సృష్టికి వ్యయం అయ్యేలా చూడాలని బడ్జెట్ లో దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం వివిధ ప్రణాళికా స్కీముల్లో వ్యవస్ధాగత మార్పులు చేయడానికి కొన్ని ప్రతిపాదనలను మంత్రి చేశారు. 2/3 వంతు రెవిన్యూ వ్యయం ఆస్తుల సృష్టికి తరలించడం వాటిలో ఒకటి. ఈ అంశంలో మరిన్ని నిర్దిష్ట చర్యలను మునుముందు ప్రకటిస్తారు. బహుశా గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని ఇందులో చేర్చవచ్చు. ఈ పధకాన్ని ఆస్తుల సృష్టికి, వ్యవసాయ అనుబంధంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోనే మరోచోట చెప్పారు. ప్రభుత్వ ఆదాయాన్ని వృధా ఖర్చులకు వినియోగించడం కాకుండా తిరిగి లాభం వచ్చే విధంగా వ్యయం చేయాలని ఈ చర్యల అంతరార్ధం. స్వతంత్ర పరిశీలనలో ఇది అందమైన ప్రతిప్రాదన. 'చేపలు పట్టడం నేర్పాలి గానీ చేపలు పట్టి ఇవ్వరాదు' అన్న అర్ధంలో చూస్తే ఇది మంచిదే. కానీ మన పాలకుల ఉద్దేశ్యం ఇది కాదు.

ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్త శుద్ధి ఉన్నట్లయితే మిగులు, బంజరు భూములను విచ్చలవిడిగా స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పగించడానికి బదులు భూమిలేని పేదలకు పంచి ఇవ్వవచ్చు. తద్వారా కాగితాలకే పరిమితం అయిన భూ సంస్కరణలను అమలు చేస్తే కోట్లాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ మేరకు అనుబంధ కార్యకలాపాలు కూడా వృద్ధి చెంది ప్రజలకు ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు అభివృద్ధి అవుతాయి. అలాగే ప్రతి యేడూ ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్న రు. 6 లక్షల కోట్లకు పైగా పన్ను రాయితీలను తగ్గించి పెట్టుబడి వ్యయానికి తరలించవచ్చు. ప్రభుత్వ సొమ్ముతో మరిన్ని పరిశ్రమలు స్ధాపించి అక్షరాస్యుల నిరుద్యోగాన్ని బాగా తగ్గించవచ్చు. కానీ ఇక్కడ ప్రభుత్వం అసలు లక్ష్యం వృధా ఖర్చు పేరుతో ప్రజలకు చేస్తున్న నామమాత్ర కేటాయింపులను కూడా వివిధ పేర్లతో కంపెనీలకు తరలించడం.

జి.డి.పితో అప్పుల నిష్పత్తిని బాగా తగ్గించడం ఆర్ధిక మంత్రి ప్రకటించిన మరో సంస్కరణ. ఇది సైద్ధాంతిక ప్రతిపాదన. పశ్చిమ సామ్రాజ్యవాద మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వారి కోసం చేసిన ప్రతిపాదన. ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ తదితర పెట్టుబడులు పెట్టడానికి విదేశీ బహుళజాతి ద్రవ్య, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు పరిగణనలోకి తీసుకునే స్ధూల ఆర్ధిక సూచికల్లో (మేక్రో ఎకనమిక్ ఇండిసెస్)రుణాలు, జి.డి.పి ల నిష్పత్తి. ఒక దేశం యొక్క రుణం ఆ దేశ జి.డి.పిలో ఎంత శాతం ఉండేదీ ఎఫ్.డి.ఐ లు చూస్తాయి. ఇది ఎంత తక్కువగా ఉంటే ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ అంత పటిష్టంగా ఉన్నట్లు పరిగణిస్తాయి. జి.డి.పిలో రుణం శాతం ఎక్కువగా ఉంటే దానిని ఋణ సంక్షోభంగా పరిగణిస్తాయి. దేశ అవసరాల కోసం కాకుండా విదేశీ పెట్టుబడులకు భారతీయ ఆర్ధిక వ్యవస్ధ ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఈ ప్రతిపాదన చేయడం తీవ్ర అభ్యంతరకరం. రుణాలపై ఆధారపడడం తగ్గిస్తే అది నిస్సందేహంగా ఆహ్వానించవచ్చు. కానీ అది ప్రజల కోసం, దేశం కోసం కాకుండా విదేశీ కంపెనీల కోసం చేయడమే అభ్యంతరకరం.

బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి చదివిన బిగ్ టికెట్ సంస్కరణల్లో ముఖ్యమైనవి ఇన్సూరెన్స్, డిఫెన్స్ రంగాల్లో ఎఫ్.డి.ఐ ల పరిమితిని 26% నుండి 49% శాతానికి పెంచడం. రైల్వే మంత్రి కూడా కేబినెట్ అంగీకారం అనంతరం ఎఫ్.డి.ఐ లకు ఆహ్వానించేందుకు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. ఇవి కాకుండా ప్రసంగంలో చదవని సంస్కరణలు పైన పేర్కొన్నవి. ఆర్ధిక మంత్రిగారు ఈ దాపరికాన్ని ఎందుకు ప్రదర్శించారో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రజలు ఈ మోసాన్ని గ్రహించి నిలదీయడానికి ఉద్యుక్తులు కావాలి.

(వి. శేఖర్‍గారి ’జాతీయ అంతర్జాతీయ వార్తలు’ సౌజన్యంతో)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి