-కబ్జా భూముల అక్రమబద్ధీకరణ
-సీఎంకు తెలియకుండానే యూఎల్‌సీ క్లియరెన్స్‌లు
-జీవో14తో సర్కారు ఆశయానికి తూట్లు
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని విలువైన భూములను దొరికినకాడికి కబ్జా చేసిన సీమాంధ్ర భూ బకాసురులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సొంత పాలన నడుస్తున్నా అక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. లాబీయింగ్ శక్తియుక్తులను ప్రదర్శిస్తూ తమ గుప్పిట్లో ఉన్న కోట్ల విలువైన సర్కారీ భూములను యథేచ్ఛగా క్రమబద్ధీకరణ చేయించుకుంటున్నారు. రాజధానిలో ఆక్రమణ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని ప్రజాసంక్షేమానికి ఉపయోగించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృహత్ సంకల్పానికి కొందరు అధికారులు తూట్లు పొడుస్తూ సీమాంధ్రుల కబ్జాదారులకు సహకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూ క్రమబద్ధీకరణపై జారీ అయిన మొట్టమొదటి జీవోనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. -సీఎంకు తెలియకుండానే యూఎల్‌సీ క్లియరెన్స్‌లు
-జీవో14తో సర్కారు ఆశయానికి తూట్లు
గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని ఆక్రమకట్టడాలను ఒకవైపు కూల్చివేస్తుండగానే మరోవైపు దీని పక్కనే ఉన్న సీలింగ్ భూమిని సీమాంధ్రులకు కట్టబెట్టేశారు. జూబ్లీహిల్స్‌కు కూత వేటుదూరంలో ఉన్న గుట్టలబేగంపేట (కావూరిహిల్స్) రెవెన్యూపరిధిలోని సర్వేనంబర్ 32 ప్లాట్ నంబర్లు 49, 50లలోగల 615.95 చదరపు మీటర్ల స్థలాన్ని బీ పద్మ (భర్త బీ శివప్రసాద్) అనే సీమాంధ్ర మహిళలకు క్రమబద్ధీకరణ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం జీవో నంబర్ 14ను జారీ చేశారు. రూ.కోటి విలువైన ఈ ప్లాటును కేవలం రూ.15,14,184కే క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ వ్యవహారానికి ఉమ్మడి రాష్ట్రంలో కబ్జా భూములను క్రమబద్ధీకరించుకొనేందుకు 2008లో తెచ్చిన జీవో 747ను ఆధారంగా చూపుతున్నారు.
క్రమబద్ధీకరణ నాటి సీసీఎల్‌ఏ పనే..
రూ. కోటి విలువైన భూమిని కారుచౌకగా రాసిచ్చిన ఈ తతంగానికి ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీసీఎల్‌ఏగా ఉన్న సీమాంధ్ర అధికారి ఐవైఆర్ కృష్ణారావే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భూమిని క్రమబద్ధీకరించే ఫైల్‌పై మే 26న ఆయన సంతకం చేశారు. భూ ఆక్రమణదారు చెల్లించిన విద్యుత్ బిల్లు ఆధారంగా ఈ క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూ దందాలపై సమీక్షలు నిర్వహించే సమయంలో పాత జీవోలు, ఉమ్మడి రాష్ట్రంలో పంపిణీ అయిన ఫైళ్ల ఆధారంగా ఇలాంటి కీలక జీవోలు విడుదల కావడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పట్టణ భూముల క్రమబద్ధీకరణ మూడు వేలగజాలు దాటితే ఆ ఫైళ్లు నేరుగా సీఎం వద్దకు పంపించాలి. అయితే, ఈ భూమి వేయ్యి గజాలలోపే ఉండటంతో సీఎం వద్దకు పంపాల్సిన అవసరం లేదని భావించి ఏకంగా జీవోను విడుదల చేసినట్లు సమాచారం. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారులను ప్రసన్నం చేసుకుంటే పనులు సులువుగా చేసుకోవచ్చని భూ కబ్జాకోరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి