-కమలనాథన్ కమిటీ తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలు పట్టించుకోలేదు
-దశాబ్దాల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకోలేదు..
- తెలంగాణ ఉద్యోగ సంఘాల మండిపాటు
-సీఎస్ రాజీవ్‌శర్మతో సచివాలయ ఉద్యోగుల భేటీ..
-కమలనాథన్ కమిటీ తీరుపై ఫిర్యాదు
-సీఎం కేసీఆర్‌ను కలువాలని నిర్ణయం
-దశాబ్దాల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకోలేదు..
- తెలంగాణ ఉద్యోగ సంఘాల మండిపాటు
-సీఎస్ రాజీవ్‌శర్మతో సచివాలయ ఉద్యోగుల భేటీ..
-కమలనాథన్ కమిటీ తీరుపై ఫిర్యాదు
-సీఎం కేసీఆర్‌ను కలువాలని నిర్ణయం
ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ర్టానికే కేటాయించకుండా ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని ప్రకటించటంపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు కమలనాథన్ కమిటీ పైరవీకారుల కమిటీగా మారిపోయిందని, తెలంగాణ ఉద్యోగుల కనీస డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను మంగళవారం కలిసి కమలనాథన్ కమిటీ తీరుపై ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రానికి ఉద్యోగుల జాబితాను ఇచ్చిందని విమర్శించారు. ఆప్షన్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులంతా తెలంగాణ రాష్ట్రంలో ఉంటామని కోరుకుంటారని, అదే జరిగితే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 42 శాతం కన్నా ఎక్కువ అవుతుందని, దాన్ని సాకుగా చూపి తెలంగాణ ఉద్యోగులందరినీ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సచివాలయానికి కేటాయించిన 78 మంది సెక్షన్ ఆఫీసర్లను సులభమైన మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పంపించవచ్చని మొరపెట్టుకున్నా కమలనాథన్ కమిటీ వినిపించుకోలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ దేవీప్రసాద్, టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి, టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఏ పద్మాచారి, చైర్మన్ రాములు, సెక్రటేరియట్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం నరేందర్‌రావు, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ విమర్శించారు. ఏ చిన్న సమస్యను లేవనెత్తినా తన పరిధిలో లేదంటూ తప్పించుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు స్వచ్ఛందంగా స్వరాష్ట్రానికి వస్తామంటున్నప్పటికీ ఎందుకు అనుమతించటంలేదని ప్రశ్నించారు. అసలు కమలనాథన్ కమిటీ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ తీరుపైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
సీఎస్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
ఉద్యోగులకు ఆప్షన్లు ఉంటాయని కమలనాథన్ కమిటీ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సచివాలయం ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ రాజీవ్‌శర్మను కలిసి తమ అభ్యంతరాలను వివరించారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1956కు మందు తెలంగాణలో స్థిరపడిన వారినే తెలంగాణ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పనిచేసేలా విభజన జరగాలని కోరారు. సీఎస్‌తో భేటీ అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల క్యాడర్ సంఖ్య ఆధారంగా విభజనకు సీఎస్ ఒప్పుకున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు మరో రెండు నెలలు ఓపిక పట్టాలని సీఎస్ కోరినట్లు చెప్పారు. జూన్ తర్వాత వచ్చిన పోస్టులను కూడా ఉద్యోగుల పంపిణీలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు సీఎస్ తెలిపారని పేర్కొన్నారు. తప్పుడు ధ్రువపత్రాలు గుర్తించేందుకు ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేయటంతోపాటు సర్విస్ రిజిస్టర్‌ను మరోసారి పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అయితే ఉద్యోగుల అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ చెప్పినట్లు వివరించారు.
క్యాడర్ ఆధారంగానే విభజన జరగాలి: టీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు
క్యాడర్ ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్‌రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనకు మరో రెండు నెలలు పట్టే అవకాముందని, తెలంగాణ ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేసేలా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆప్షన్లు ఇవ్వవద్దు: ఉద్యోగ సంఘం నేత పద్మాచారి
ఉద్యోగుల విభజనలో ఎటువంటి ఆప్షన్లకు అవకాశం ఇవ్వవద్దని తెలంగాణ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరం అధ్యక్షుడు పద్మాచారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాజధానిలో ఆప్షన్లు ఇచ్చే అవకాశమే లేదని, ఈ విషయాన్ని గుర్తించాలని కమల్‌నాథ్ కమిటీకీ సూచించారు. ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి అర్థమే లేదన్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి