గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 12, 2014

భద్రాచలం డివిజన్ ఎవరిది ?

- రాజ్‌నాథ్ వ్యాఖ్యల్లో అవాస్తవాలు
- తప్పుదోవ పట్టించిన సీమాంధ్రులు
- వందల ఏళ్లుగా తెలంగాణలోనే భద్రాచలం డివిజన్
- కాకతీయుల నాటినుంచి అనుబంధం
- రామాలయాన్నీ పోషించిందీ నిజామే
- ఆంధ్ర ప్రభుత్వంలోఉన్నది 80 ఏళ్లే
(సవాల్ రెడ్డి) 
పోలవరం ముంపు గ్రామాల బదలాయింపు బిల్లును పార్లమెంటు ఆమోదించింది. మందబలమా.. మరొకటా అనేది ఎలా ఉన్నా..ఇక భద్రాచలం డివిజన్ తెలంగాణకు గత చరిత్రే. కానీ బిల్లు విషయంలో రాజ్‌నాథ్ చెప్పిన గతంలో ఆంధ్రా వారిదే అనే మాటే అభ్యంతరకరం. ప్రచార సాధనాలను, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ఆంధ్రులు తాము చెప్పిందే వేదంగా చెలామణి చేసిన చరిత్రలో భద్రాచలం చరిత్ర కూడా వక్రీకరణకే గురైంది. భద్రాచలం డివిజన్ మొత్తం తెలంగాణదే. వందల ఏళ్ల చరిత్రలో ఆ తాలూకా ఆంధ్రాలో ఉన్నది అతి స్వల్పకాలమే.

ramalayam
చరిత్రను పరిశీలిస్తే కాకతీయుల కాలంలోకూడా భద్రాచలం ఓరుగల్లు సామ్రాజ్యంలో భాగమే. ప్రతాపరుద్రుని కాలంలో పెద మల్లరాజు, చిన్న మల్లరాజు అనే వారు ఇక్కడ వ్యవహారాలు చూసేవారు.1571 నాటినుంచి నుంచి గోల్కొండ నవాబుల కాలంనుంచి భద్రాచలం ప్రాంతం తెలంగాణ సర్కారు ఆధీనంలోనే ఉంది. వారి కాలంలోనే ఇక్కడ తహసీల్దారుగా ఉన్న కంచర్ల గోపన్న రామాలయం కట్టించాడు. ఈ కాలంలో రుస్తుంఖాన్ ఈ ప్రాంత పాలనా వ్యవహారాలు చూసేవాడు. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబుల పాలన అంతమై 1748లో నైజాం నవాబుల పాలన వచ్చింది. 1769లో తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాన్ని నైజాం ఇంగ్లీషు వారికి ఇచ్చాడు. అయితే భద్రాచలం తాలూకా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. 1860లో భద్రాచలం తాలూకాను ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇంగ్లీషు వారికి ఇచ్చాడు అయితే అప్పుడు కూడా అది ఆంధ్రలో కాకుండా మధ్యభారత్‌లో కలిపారు. అప్పుడు ఈ ప్రాంతం భద్రాచలం, రేకపల్లి పేరిట రెండు తాలూకాలుగా ఉండేది. 1874లో మాత్రమే ఇది ఆంధ్రలో చేరింది. పాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ వారు దీన్ని మధ్యభారత్‌నుంచి గోదావరి జిల్లాలో చేర్చారు. అప్పటినుంచి 1959 వరకు ఉన్న ఈ డివిజన్‌ను తిరిగి తెలంగాణలో చేర్చడానికి ఈ చారిత్రక నేపథ్యమే కారణం. 

భద్రాచలం ఆలయం..

భద్రాచలం ఆలయం తెలంగాణ తహశీలు నిధులతో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్వహణ ఆనాటినుంచి నిజాం సర్కారు రద్దయ్యే దాకా నిజాం ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. భద్రాచలం తాలూకాను ఇంగ్లీషు వారికి ఇచ్చినా ఆలయాన్ని మాత్రం నిజామే ఉంచుకున్నాడు. అంతేకాదు ఆ తాలూకాలో అనేక ప్రాంతాల్లో ఈ ఆలయానికి మాన్యాలు కూడా ఉన్నాయి. బ్రిటిషిండియాలో ఉన్నప్పటికీ ఇవి నైజాం ఆస్తులే. ఈ ఆలయాన్ని ఆంధ్రులు ఏనాడూ నిర్వహించలేదు.

ఆ మాటకు వస్తే 19వ శతాబ్దంలో జమిందారీ రద్దు చట్టం వచ్చేదాక ఆంధ్రలో ఏ ఆలయాన్ని ఈస్ట్ ఇండియా ప్రభుత్వం కానీ, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కానీ నిర్వహించలేదు. తిరుపతి వంటి ప్రఖ్యాత ఆలయం కూడా మహంతుల నిర్వహణలో కొనసాగింది. ఇంగ్లీషు వారికి భద్రాచలం తాలూకాను ఇచ్చిన తర్వాత ఈ ఆలయ నిర్వహణకు నిజాం అమీన్ అనే ఒక ఉన్నత ఉద్యోగిని నియమించాడు. ఈ ఆలయ నిర్వహణకు 1915 నాటికే ఏటా రూ. 18 వేలు ఇచ్చేవాడు. ఆలయ ముఖ్య నిర్వాహకుడు అమీన్ కాగా ముగ్గురు గుమస్తాలు, ఐదుగురు పోలీసులు, 12 మంది బంట్రోతులు, 20 మంది అర్చకులు, నలుగురు వేదపండితులు, ఇద్దరు పంచాంగ కర్తలు, 18 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు హరిదాసులు, ముగ్గురు తిరుచూర్ణము వారు, ముగ్గురు వంటల వారు, నలుగరు నాదస్వర వాయిద్యగాళ్లు,ముగ్గురు సాతానులు , 8 మంది రజకులు, ఇద్దరు దేవదాసీలు, మరో 12 మంది ఇతర ఉద్యోగులు ఈ ఆలయంలో ఉండే వారు.

వీరందరికీ నిజాం జీతాలు చెల్లించేవాడు.ఆ రోజుల్లోనే సుమారు రూ 12 వేల వరకు వీరి జీతాలకే సరిపోయేవి. ఆలయ నిర్వహణ పర్యవేక్షణకు ఐదుగురు ధర్మకర్తలతో ఒక మండలి ఉండేది. దేశ విభజన నాటికి ఈ ఆలయ నిర్వహణ వ్యయం రూ.30 వేలకు చేరింది. రజాకార్ల పరోక్ష పాలన కాలంలో కూడా నిజాం ఈ ఆలయానికి నిధులు ఆపలేదు. ఇది భద్రాచలం ప్రాంతంతో తెలంగాణకు ఉన్న అనుబంధం. ఇవాళ చరిత్ర తెలిసీ తెలియని వారు భద్రాచలం ఏదో ఆంధ్ర సొమ్మయినట్టు తెలంగాణ వారు దాన్ని కలిపేసుకున్నట్టు కథలు చెబుతున్నారు. దీనితో పాటు మునగాల ఇతర చిల్లర మల్లర ప్రాంతాల ప్రసక్తి తీసుకువస్తున్నారు. మునగాల మొత్తానికి మొత్తం ఆంధ్రకు చెందింది కాదు.

మునగాల జమిందారు పెద్ద భూస్వామి. ఆయనకు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో భూములున్నాయి. తెలంగాణలో ఆయన మక్తేదారుగా పిలవబడేవాడు. ఆంధ్రలో జమిందారుగా పిలిచే వారు. అందుకే ఆయన భూ వివాదాలు ఇటు హైదరాబాద్, అటు మచిలీపట్నం కోర్టుల్లో నలుగుతూ వచ్చేవి. ఆయన జమీ మొత్తంగా తెలంగాణ ఆంధ్రలో చెరిసగం దాక ఉంటాయి. వాస్తవానికి నిజాంప్రాంతమైన పరిటాలను తీసుకున్నందుకు బదులుగానే మునగాలను నల్లగొండ జిల్లాకు ఇచ్చారు. ఇదీ వాస్తవ దృశ్యం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి