గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 23, 2014

కోచింగ్ సంస్ధల అడ్డగోలు దోపిడీ!

-ఏటా రూ.1000 కోట్ల టర్నోవర్
-నిరుద్యోగుల బలహీనతే ఆసరాగా వ్యాపారం
-గ్రామీణ పేదలకు కోచింగ్ అందని ద్రాక్ష
-ఆంధ్ర పాలకుల చేతుల్లో కోచింగ్ సంస్థలు
-సేవా సంస్థల ముసుగులో విద్యా వ్యాపారం
నాటి ఆంధ్రపాలకుల పుణ్యమా అని పోటీపరీక్షల కోసం శిక్షణ ఇచ్చే కోచింగ్ సంస్థల దోపిడీ నానాటికీ పెరిగిపోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ దోపిడీ మరింతగా పెరిగిపోయింది. సివిల్ సర్వీసెస్, గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై, టెట్, బ్యాంకింగ్ సర్వీసులు, రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ ఇస్తున్నామని చెప్పుకుంటున్న సంస్థల యాజమన్యాలు రూ.వేలకోట్లకు పడగలెత్తాయి. బతుకుదెరువు కోసమే కోచింగ్ సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పుకుంటూ అపరకుబేరులయ్యారు. వీరిలో 80 శాతం మంది సీమాంధ్రులే. వారి కనుసన్నలలోనే గత ప్రభుత్వాలు నడుచుకున్నాయంటే కోచింగ్ సంస్థల సామ్రాజ్యం ఏ మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ట్యుటోరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కోచింగ్ సంస్థలు ఏడాదికి రూ.1000 కోట్లు టర్నోవర్ సాధిస్తున్నాయి. విద్యా వ్యాపారం కోసం ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 150 కోచింగ్ సంస్థలు నడుస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రతిరోజు 50 వేలమంది శిక్షణ తీసుకుంటున్నారని నిరుద్యోగ సంఘాలు అంచనా వేశాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ పరీక్షల కోచింగ్ పేరుతో ఒక్కొక్క అభ్యర్థి నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి ఇష్టారీతిన ఒక్కో రకమైన ఫీజు నిర్ణయిస్తున్నారు. సివిల్ సర్వీసు ప్రిలిమినరీ పరీక్షల కోసం అక్షరాల రూ.లక్ష ఫీజు వసూలు చేస్తున్నారు. సివిల్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.35వేల చొప్పున నిరుద్యోగుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. 
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకైతే రూ.18వేలు ఫీజు కట్టాల్సిందే. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ఆప్షనల్స్‌లో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఐదు సబ్జెక్టులలో ఒక్కో దానికి రూ.15 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. గ్రూప్-2 పరీక్ష శిక్షణకు రూ.20వేలు, డీఎస్సీకి రూ.15 వేలు, డీఎస్సీలోని మెథడాలజీ సబ్జెక్టు కోసం రూ.15 వేల చొప్పున ఫీజు నిర్ణయించారు. వీటితోపాటు బ్యాంక్, రైల్వే ఉద్యోగాల కోసం ఒక్కో కోచింగ్ సంస్థ ఒక్కో రకంగా ఫీజు నిర్ణయించాయి. సగటున ఒక్కొక్క అభ్యర్థి నుంచి రూ.50వేలు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫీజుల విషయం ఇలా ఉంటే.. కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు అదనంగా భోజనం, వసతి ఖర్చుల పేరిట నెలకు రూ.6వేల వరకు ఖర్చు వస్తుందని కోచింగ్ తీసుకుంటున్న రమేష్‌రెడ్డి, సునీల్, కృష్ణప్రసాద్, కోటిరెడ్డి తదితరులు వాపోతున్నారు.

గ్రామీణ, పేదలకు అందని ద్రాక్ష...

గ్రామీణ, పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు అందని ద్రాక్షగా మారాయి. పోటీ బాగా పెరిగిన నేపథ్యంలో కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం వస్తుందన్న భ్రమలో గ్రామీణ యువత మునిగిపోయింది. ఈ భ్రమను కూడా కోచింగ్ సంస్థలే కల్పించాయి. కాని భరించలేని ఫీజులు ఉండడంతో గ్రామీణ, పేద విద్యార్థులు కోచింగ్ సంస్థలో చేరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే యువత కోచింగ్ సంస్థలలో చేరాలనుకున్నారు. కాని ఫీజులను చూసి భయపడ్డారు. ఆ నిస్పృహలోనే కోచింగ్ సంస్థలపై దాడులకు సిద్ధపడి వారి ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

ఆంధ్ర పాలకుల పుణ్యమే ఇది...

ఆంధ్ర పాలకుల పుణ్యమా అని కోచింగ్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చాయి. వాస్తవానికి కోచింగ్ సంస్థల ఏర్పాటుకు ఎలాంటి చట్టం లేదు. కానీ ట్యుటోరియల్స్ పేరిట ఈ సంస్థలు నడుస్తున్నాయి. ఏ ఒక్క కోచింగ్ సంస్థకూ ప్రభుత్వ అనుమతులు లేవు. గత ఆంధ్రప్రదేశ్ విద్య చట్టం-1982 సెక్షన్ 32 ప్రకారం ట్యుటోరియల్స్ ప్రారంభించాలంటే ఆయా జిల్లా విద్యాధికారి నుంచి అనుమతి పొందాలి. ట్యుటోరియల్‌లో అధ్యాపకులు సంబంధిత సబ్జెక్టుల్లో నిష్ణాతులై ఉండాలి. నిర్దిష్ట ప్రమాణాలు పాటించిన సంస్థలకే విద్యాశాఖాధికారులు అనుమతివ్వాలన్న నిబంధనలూ ఉన్నాయి. ఆయా కోచింగ్/ట్యుటోరియల్స్‌లో అన్ని వసతులను పరిశీలించిన తర్వాతే ఫీజులను నిర్ధారించాలన్న నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ట్యుటోరియల్ సంస్థల నిర్వాహకులకు ఆరు నెలలు జైలు, రూ.వెయ్యి జరిమానా లేదంటే రెండూ విధించే అధికారం జిల్లా విద్యాధికారులకు ఉంది. కానీ నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అసలు కోచింగ్ సంస్థలు ట్యుటోరియల్ పరిధిలోకి వస్తాయా? అన్న సందేహాన్ని విద్యాశాఖ అధికారులే వ్యక్తం చేయడం గమనార్హం.

listఈ నేపథ్యంలో కోచింగ్ సంస్థల నియంత్రణకు ఉన్న చట్టాన్ని సరిచేయడమా లేక కొత్తగా సమగ్ర చట్టం తీసుకురావాలా? అన్న మీమాంసలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోచింగ్ సంస్థల నియంత్రణపై దృష్టి పెట్టాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు. కోచింగ్ సంస్థల పేరుతో గ్రామీణ, పేద విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రేటరీ పీ మధుసూధన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శిక్షణ పొందిన వారిలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో అన్న లెక్క పత్రం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వీలైతే కోచింగ్ సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి