గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 22, 2014

ఇకనుండి సింగరేణి...మనదే!

-కేంద్రం వాటా కొనుగోలుకు నిర్ణయం
-నల్లసూరీళ్లపై చంద్రుడి వరాల జల్లు
-సింగరేణి ఉద్యోగులకూ తెలంగాణ ఇంక్రిమెంట్
-సెలవుగా సకల జనుల సమ్మె కాలం
-కోల్‌బెల్ట్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు..
-సింగరేణికి అనుబంధంగా మెడికల్ కాలేజీ
-అదనంగా మరో రెండు థర్మల్ స్టేషన్ల ఏర్పాటు
-సింగరేణి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
-ప్లాన్ బిగ్ - డ్రీమ్ బిగ్ లక్ష్యంతో సాగాలని పిలుపు
కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ)లో భాగంగా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో నేను మాట్లాడతా. వాయిదాల పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లింపులు చేద్దాం. సంస్థ పూర్తిగా మన ఆధీనంలోకి వస్తే ఇప్పటిదాకా మనం చెల్లిస్తున్న రూ.1500 కోట్ల రాయల్టీ మన ప్రభుత్వానికే మిగులుతుంది.. సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులను తవ్వడానికి చర్యలు తీసుకోవాలి. తద్వారా ఉద్యోగ అవకాశాలకు మెరుగైన విధానాన్ని రూపొందించాలి. 

kcrసింగరేణి కాలరీస్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను పూర్తిగా కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థగా మార్చే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ విధానం (డిజిన్వెస్ట్‌మెంట్ పాలసీ)లో భాగంగా సింగరేణిని తెలంగాణ సొంతం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో తాను మాట్లాడతానని అన్నారు. వాయిదాల పద్ధతిలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లింపులు చేద్దామని చెప్పారు.

సంస్థ పూర్తిగా మన ఆధీనంలోకి వస్తే ఇప్పటిదాకా చెల్లిస్తున్న రూ.1200 కోట్ల రాయల్టీ మన ప్రభుత్వానికే మిగులుతుందని చెప్పారు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కాలరీస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి బొగ్గు నిల్వలు, ఓపెన్‌కాస్ట్ మైనింగ్, అండర్‌గ్రౌండ్ మైనింగ్, సిబ్బంది, వారి పనివిధానం, ఉద్యోగులకు అమలుచేస్తున్న సెలవుల విధానం, బొగ్గు తవ్వకాలకు అనుసరిస్తున్న పద్ధతులు, యాంత్రీకరణవంటి అంశాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో కార్మికుల సంఖ్య లక్షా 15 వేల నుంచి 60 వేలకు తగ్గడానికి గల కారణాలు ఏమిటని సింగరేణి సీఎండీ, డైరెక్టర్లను అడిగారు.

singareni01యాంత్రీకరణ వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని వారు సమాధానం చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ యాంత్రీకరణవల్ల కార్మికుల సంఖ్య తగ్గితే అధికారుల సంఖ్య 1800 నుంచి 2600కు ఎందుకు పెరిగిందని నిలదీయడంతో అధికారులు బిత్తరబోయారు. సింగరేణి ఉద్యోగ వనరుగా ఉండాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో నూతన బొగ్గు గనులను తవ్వడానికి చర్యలు తీసుకోవాలని, తద్వారా ఉద్యోగ అవకాశాలకు మెరుగైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు.

ఇంకా 30, 40 చోట్ల అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు సంసిద్ధంగా ఉన్నారని, వచ్చే దసరా పండుగనాటికి అదనంగా ఒకటి రెండు అండర్ గ్రౌండ్ మైనింగ్ పనులు ప్రారంభించాలని, ఈ ఏడాది చివరినాటికి అదనంగా 6 అండర్‌గ్రౌండ్ మైనింగ్ ప్రాజెక్టులు చేపట్టి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా అధికారులు సింగరేణి సంస్థ దాదాపు రూ.12,300కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉందని, రాయల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,200కోట్లు చెల్లిస్తున్నదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ఉద్యోగులపై వరాల జల్లు

సమీక్ష సందర్భంగా వరాల వర్షం కురిపించిన సీఎం.. సింగరేణి ఉద్యోగులందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన సింగరేణి సిబ్బంది సకల జనుల సమ్మెలో పాల్గొన్న కాలాన్ని సెలవుగా పరిగణించాలని నిర్దేశించారు. డిస్మిస్డ్ కార్మికులకు ఒక్కసారి అవకాశం కల్పించాలని సూచించారు. వచ్చే మూడు నెలల్లో ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.


SINGARENIసింగరేణి పరిధిలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించాలని, సింగరేణికి అనుబంధంగా ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. రామగుండం వద్ద ఉన్న 1,500 ఎకరాల భూములను ఎన్టీపీసీ ఏర్పాటు చేసే 4,000మెగావాట్ల పవర్‌ప్లాంటుకు కేటాయించాలని సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్యకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 6,000మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా రామగుండం వద్ద 400 ఎకరాలు, మణుగూరు వద్ద 2,000 ఎకరాల భూములను అప్పగించాలన్నారు.

శ్రీరాంపూర్‌లో చేపట్టిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్షణం పూర్తి చేసి వేగవంతంగా ఉత్పత్తి జరిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాక్ ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు అవసరమా? అంటూ దీనిపై సమీక్షించాలని ఆదేశించారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విషయంలో తెలంగాణ, ఆంధ్ర అనే తారతమ్యాన్ని పాటించరాదని, ఇప్పటి వరకు విధుల్లోంచి తొలగించిన ఉద్యోగులు (డిస్మిస్డ్ ఎంప్లాయీస్), ఆధారపడ్డ ఉద్యోగుల (డిపెండెంట్ ఎంప్లాయిమెంట్) సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కార్మికులకు క్యాంటీన్, టౌన్ షిప్, డ్రెస్సింగ్ రూంలు, రక్షణకు సంబంధించిన విషయాలలో పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలని, కాంప్రమైజ్ కావడానికి వీల్లేదన్నారు. తాను ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తానని చెప్పారు. సింగరేణి మైనింగ్ ప్రదేశాల్లో కాలుష్య నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆయా ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

ఇతర రాష్ర్టాల్లోని ఆస్తులు రక్షించండి

తెలంగాణేతర ప్రాంతాల్లో ఉన్న సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయవాడలోని కొండపల్లి వద్దనున్న ఆప్మెల్ భూములు, విశాఖపట్నంలో ఉన్న భూములను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ (విశాఖ, విజయవాడ) ఉన్న భూముల చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆప్మెల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకునూరి కనకరాజును ముఖ్యమంత్రి అభినందించారు. సింగరేణి లాభాల వాటాను త్వరలోనే తాను సింగరేణి ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటిస్తానని, సింగరేణి బొగ్గు గనులను కూడా సందర్శిస్తానని, అక్కడి పరిస్థితులను కూడా స్వయంగా పరిశీలిస్తానని ప్రకటించారు.

విదేశాల్లోనూ టెండర్లు వేయండి

వచ్చే ఏడాది (2015) నవంబర్ 15వ తేదీ నాటికి 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు థర్మల్ పవర్ ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిలోకి రానున్నట్లు సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ విస్తరణకు చర్యలు తీసుకోవాలని, ఇతర రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో మైనింగ్ అవకాశాలను చేజార్చుకోవద్దని సూచించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మొజాంబియా, ఇండోనేసియావంటి దేశాల్లో పర్యటించి, బొగ్గు నిల్వలు, వాటి ప్రామాణికత అంశాలపై సమగ్ర నివేదిక అందజేయాలని సీఎండీ సుతీర్థను ముఖ్యమంత్రి ఆదేశించారు. అదానీ లాంటి చిన్న కంపెనీలు విదేశాలకు వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయని, 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి విదేశాలలో బొగ్గు బ్లాకులు కొనుగోలు చేపట్టి, బొగ్గు ఉత్పత్తి చేయొచ్చన్నారు. తద్వారా తెలంగాణ నిరుద్యోగులకు అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ప్లాన్ బిగ్ - డ్రీమ్ బిగ్ అనే లక్ష్యంతో ముందుకు సాగాలని సింగరేణి అధికారులకు సూచన చేశారు.

అతిపెద్ద కోల్ సరఫరాదారుగా మారాలి

భవిష్యత్తులో ప్రపంచస్థాయిలో సింగరేణి అతిపెద్ద బొగ్గు సరఫరా (కోల్ సప్లయర్) సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్పొరేట్ దృక్పథంతో, కొత్త ఆలోచనలు, పథకాలు, కార్యచరణతో ముందకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని, అందుకు వీలుగా సింగరేణి సీఎండీ, సీఎం ముఖ్యకార్యదర్శితో పాటు పదిమందితో కూడిన ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో విదేశాల్లో పర్యటించాలని సీఎం సూచించారు.

సింగరేణిలో సాంకేతిక నిపుణులను విదేశాలకు శిక్షణ నిమిత్తం పంపించాలని ఆదేశించారు. ప్రతీ కమిటీలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌కు ప్రాతినిథ్యం ఉండాలని ఆదేశించారు. రెండున్నరగంటలపాటు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య, తెలంగాణ జెన్‌కో సీఎండీ డీ ప్రభాకరరావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) రమేశ్ కుమార్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకునూరి కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. సింగరేణిపై సీఎం సుదీర్ఘ సమీక్ష చేయడంపై సింగరేణివ్యాప్తంగా కార్మికులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సింగరేణి కార్మికులకు, కోల్‌బెల్టుకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని సింగరేణి జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర్ నాయక్ తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి