గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 01, 2014

కాగితాల మీద ఇండ్లు...జేబుల్లోకి నిధులు...గత ప్రభుత్వాల నిర్వాకం!

-హౌసింగ్ స్కాం - 2
-తిననోందే పాపం..
-నాయకులు, అధికారుల సమైక్య కృషి!
-కోట్లకు కోట్లు నిధులు కైంకర్యం
-కాగితాల మీద ఇండ్లు.. జేబుల్లోకి నిధులు
-పాత ఇండ్లకు రంగులు.. కట్టని ఇండ్లకు బిల్లులు
-అదిలాబాద్ జిల్లాలో కాగజ్ మకాన్
-నిజామాబాద్ జిల్లాలో డీఎం మిస్సింగ్
-కరీంనగర్ జిల్లాలో రూ. 20 కోట్లు హాంఫట్
ఉత్తర తెలంగాణలోని మూడు జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లలో ఇందిరమ్మ ఇండ్ల పథకం రాజకీయనాయకులు, అధికారులు, మధ్యదళారుల పాలిట ధనజాతరగా వర్థిల్లింది. పథకం ప్రకటననుంచి లబ్ధిదారుల ఎంపికలు, మంజూరు, తనిఖీలదాకా అంతా వీరిదే హవా. కొత్తకొత్త దళారులు పుట్టుకువచ్చారు. జేబులో నయాపైసా లేనివాడు లక్షలు కుమ్ముకున్నారు.
indiramma

దోచుకోనివాడిదే పాపం అన్నట్టుగా ఈ జాతర జరిగినంత కాలం కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకూడా లేకుండా హడావుడి చేశారు. ఫలితంగా సర్కారు బొక్కసం బక్కచిక్కి పేదదైంది. ఇటు పేదల ఇండ్లు మాత్రం సాకారం కాలేదు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి అధికారులమీద, కాంట్రాక్టర్లమీద చర్యలకు ఆదేశించినా అమలు మాత్రం జరగలేదు. నిజామాబాద్ జిల్లాలో ఆరోపణల తీవ్రత ఉన్న ఓ అధికారిపై చర్యలు తీసుకుందామనుకుంటే ఆయన ఏళ్ల తరబడి కనిపించడం లేదట.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు, నిజమాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు, కరీంనగర్ జిల్లాలో గ్రామీణులు ఇలా వివిధ వర్గాల ప్రజలంతా ఇందిరమ్మ ఇండ్ల బాగోతంలో బాధితులే. అధికారులు, నాయకులు, మధ్య దళారులు ఎవర్నీ వదిలిపెట్టలేదు. నోరులేని అమాయక ప్రజల సొమ్మును అడ్డంగా, నిలువుగా దోచుకున్నారు. ఉన్నవారికే ఇండ్లు ఇచ్చి సున్నాలు వేయించి బిల్లులు ఎత్తుకున్నారు. కాగితాల మీద ఇండ్ల లెక్కలు రాసి పునాదులైనా తీయకుండా సొమ్ములు జేబులో వేసుకున్నారు. ఒక్కటే రేషన్ కార్డులో ఇద్దరేసి వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేశారు. రాజకీయ నాయకులు నీకిన్ని నాకిన్ని పద్ధతిలో కలిసికట్టుగా సర్కారు సొమ్మును పంచుకుతిన్నారు.

హౌసింగ్ అధికారులు జరిపిన ర్యాండమ్ విచారణలో భారీ ఎత్తున అవినీతి వెలుగు చూడగా బాధ్యులైన అందరినీ సస్పెండ్ చేయాలని, తిన్న సొమ్మును కక్కించాలని ఆదేశాలిచ్చారు. అయితే అవన్నీ బేఖాతర్ అయ్యాయి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి చేతులు దులిపేసుకున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రుల అండదండలుండడంతో ఉన్నతస్థాయి అధికారులపై ఈగ కూడా వాలలేదు.

నిజామాబాద్ జిల్లాలో రూ. 42.50 కోట్ల అవినీతి...

నిజామాబాద్ జిల్లాలోని 29 గ్రామాల్లో 2705 ఇండ్ల నిర్మాణాలపై గృహనిర్మాణశాఖ థర్డ్‌పార్టీ ద్వారా విచారణ చేయించింది. ఇక్కడ రూ.42.50 కోట్ల అవినీతి జరిగినట్లు నిర్ధారించి రికవరీకి ఆదేశించింది. అయితే వసూలైనవి మాత్రం కేవలం రూ.55.17 లక్షలే. కోటగిరి మండలం కొత్తపల్లిలో రూ.44.65 లక్షల అవినీతి జరిగినట్లు తేల్చారు. బాధ్యులైన ఉన్నతాధికారులను శాఖ పరంగా సర్వీసు నుంచి తొలగించినా రాజకీయ నాయకుల అండదండలతో వారు తిరిగి ఉద్యోగాల్లో చేరిపోయారు. 

నిజామాబాద్ శివారు గ్రామాలలో జరిగిన అవినీతిలో సాక్షాత్తూ జిల్లా మేనేజర్ జ్ఞానేశ్వర్‌రావు రూ.53.77 లక్షల అవినీతి జరిపి దొరికిపోయారు. సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగిస్తూ 2005లో జీవో నంబర్ 36ద్వారా ఆదేశించారు . కానీ గత తొమ్మిదేళ్లుగా ఇతని ఆచూకీ తెలియదని రికార్డుల్లో చూపిస్తున్నారు. ఈ జిల్లాలో చివరికి బీడీ కార్మికుల గృహనిర్మాణాలను కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు. కొమ్మరపల్లి మండలంలోని మానాల గ్రామంలో ముగ్గురు అధికారులు రూ. 6.84 లక్షల అవినీతికి పాల్పడినట్లు 
రుజువైంది. అయినా ఆసొత్తును ఇప్పటికీ రికవరీ చేయలేకపోయారు.

రికవరీ చట్టం ప్రయోగించాలని శాఖ అధికారులు ఇచ్చిన తీర్పు ఈ నాటికి అమలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్న పలు ప్రభుత్వాలు, రాజకీయనాయకులు, అధికారులు కలిసి కట్టుగా చేసిన నిలువుదోపిడికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. వాస్తవంగా నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5,90,733 నివాసాలుండగా, 3,88,185 మంచి ఇండ్లున్నాయి. నివాసానికి యోగ్యంగా 1,79,831 ఇండ్లు ఉండగా, శిధిలావస్ధలో కేవలం 22,717 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. అయినా జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద 2.80 లక్షల ఇండ్లు మంజూరయ్యాయి. 1.28 వేల ఇండ్లు కట్టామని అధికారులు రికార్డుల్లో రాశారు. ఇంకో 1.52 లక్షల ఇండ్లకు నిధులు మంజూరైనా పెండింగ్‌లోనే ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి.

అదిలాబాద్ జిల్లాలో బోగస్ ఇండ్లు..: అదిలాబాద్ జిలాల్లో 866 గ్రామపంచాయతీలుండగా విచారణ అధికారులు 73 గ్రామాలలో ఇందిరమ్మ అవినీతిపై విచారణ జరిపారు. ఇందులో 2 వేల ఇండ్లనిర్మాణంలో అవినీతి జరిగినట్లు నిర్థారణ అయింది. రెవెన్యూ రికవరీ చట్టం కింద రూ.29.0 కోట్లు అధికారుల నుంచి వసూలు చేయాలని నోటీస్‌లు ఇచ్చారు. ఈ అవినీతిలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ స్థాయి నుంచి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వరకు మొత్తం 92 మంది భాగస్వాములని తేలింది. ఎనిమిది మంది అధికారులు, తొమ్మిది మంది రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను, ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. అయితే అధికారులను వదిలేసి కేవలం ఔట్‌సోర్సింగ్‌లో పని చేస్తున్న ఐదుగురు అసిస్టెంట్ ఇంజనీర్లు, 9 మంది వర్క్ ఇన్‌స్పెక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. 

అవినీతి సొమ్మును వసూలు చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. ఇంతదాకా రూ.65.12 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ప్రభుత్వం మారిపోయింది..మనల్ని పట్టించుకునేవారే ఉండరన్న తీరుగా ఉన్నత స్థాయిలోని అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అవినీతికి పాల్పడిన అధికారులంతా రిలాక్స్‌గా ఉన్నారు. విచారణ కూడా అన్ని గ్రామాలలో జరపకపోవడం ఉన్నతాధికారులకు పెద్ద రిలీప్. ఏదో శాంపిల్‌గా విచారించారు, కానీ పూర్తి స్థాయిలో విచారణ చేయడం ఎవరికి సాధ్యం కాదని.. ఎలా చేస్తారని ఒక అధికారి ప్రశ్నించడం గమనార్హం. ఈ జిల్లాలోని కొన్ని గ్రామాలలో జరిగిన అవినీతిని పరిశీలిస్తేనే భారీ ఎత్తున అవినీతి బయటపడింది.

ఉదాహరణకు తాళ్లమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో కొన్ని ఇండ్లకు లబ్దిదారుల పేర్లను మార్చి రెండు రెండు సార్లు బిల్లులిచ్చారు. అసలు నిర్మాణాలు చేయకుండానే 10 ఇండ్లకు రూ.73 వేల బిల్లులు సృష్టించి సొమ్మును డ్రా చేసుకున్నారు..13 పాత ఇండ్లకు సున్నాలు వేసి కొత్తవిగా చూపించి రూ.2.60 లక్షల బిల్లులు ఎత్తుకున్నారు. ఒక్క కజ్జర్ల గ్రామంలోనే రూ.3.36 లక్షల అవినీతి జరిగింది. ఈ అవినీతిపై రాష్ట్రగృహనిర్మాణశాఖ మేనేజింగ్ డైరెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. అధికారులు తప్పించుకోవడానికి కింది స్థాయిలో ఉన్న, ఎలాంటి బాధ్యత లేని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులు బాధ్యులంటూ తొలిగించి చేతులు దులుపుకున్నారు.

ఫలితంగా అవినీతి సొమ్మును రాబట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే మండలంలోని కోదాడ్ గ్రామంలో నాలుగు ఇండ్లకు పునాదులు కూడా తీయకుండానే రూ.59 వేలు డ్రా చేసుకున్నారు. అసిఫాబాద్ మండలంలో 166 ఇండ్ల నిర్మాణంలో రూ.12.44 లక్షల సొమ్ము చేతులు మారాయి. ఇందులో 31 పాత ఇండ్లను చూపించి రూ.7.20 లక్షలు అమాంతం మింగారు. 61 ఇండ్లకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండానే రూ.2.80 లక్షలను డ్రా చేసుకున్నారు. 74 ఇండ్లకు రెండు సార్లు బిల్లులుపెట్టి రూ.2.44 లక్షలు అదనంగా నొక్కారు. ఇలా జిల్లాల్లోని ప్రతి గ్రామంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని తేలింది... ఈ అవినీతిపై అన్ని గ్రామాలలో విచారణ చేస్తే ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి కింది స్థాయి వర్క్ ఇన్‌స్పెక్టర్ల వరకు ఎవరి భాగస్వామ్యమెంతో బయటపడుతుందని అంటున్నారు. 

వాస్తవానికి అదిలాబాద్ జిల్లాలో మొత్తం 6,51,770 ఇండ్లున్నాయి. ఇందులో 4,04,863 మంచి ఇండ్లు ఉండగా, నివాసయోగ్యంగా 2,11,084 ఇండ్లున్నాయి. శిధిలావస్థలో కేవలం 35,823 ఇండ్లు మాత్రమే ఉన్నాయి కానీ ఈ జిల్లాలో 3.81 లక్షల ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2.15 లక్షల ఇండ్లు నిర్మించినట్లు రికార్డులో చూపారు. ఇంకా 1.66 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉందని హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఉన్న లెక్కలే చెపుతున్నాయి. 

జ్ఞానేశ్వర్రావు కనిపించుట లేదు..

నిజామాబాద్ జిల్లాలో గృహనిర్మాణ శాఖలో మేనేజర్(డీఎం) స్థాయిలో ఉండి కోట్లకు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆర్.జ్ఞానేశ్వర్‌రావుపై ప్రభుత్వ చర్యలు ప్రహసనంగా మారాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన జ్ఞానేశ్వర్‌రావు వద్దనుంచి సొమ్ము రికవరీ చేసి విధుల నుంచి తొలగించాలని 2005లో జీవో నెంబర్ 36 ద్వారా ఆదేశం వచ్చింది. ఈ వ్యవహారంనుంచి బయట పడే క్రమంలో ఆయన హఠాత్తుగా కనిపించకుండా పోయారు. గత తొమ్మిదేళ్లుగా జ్ఞానేశ్వరరావు జాడ తెలియడంల లేదని రికార్డులలో రాస్తూ వస్తున్నారు. 

ఒక సాధారణ వ్యక్తి ఒక్కరోజు కనిపించకుండా పోతేనే ఎంతో హడావుడి జరుగుతుంది. వరుసగా ఆరేళ్లు కనిపించకుండా పోతే సదరు వ్యక్తి చనిపోయినట్లుగా ప్రభుత్వమే ప్రకటిస్తుంది.. కానీ ప్రభుత్వ అధికారి, జిల్లా మేనేజర్ ర్యాంక్‌లో ఉన్న వ్యక్తి తొమ్మిదేళ్లుగా కనపడక పోయినా తదుపరి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారం బయటి సమాజానికి కూడా తెలియదు. పూర్తి స్థాయిలో సీబీఐ విచారణ జరిపితే ఎన్నో అనకొండలు బయటపడతాయని పలువురు చెబుతున్నారు. 

కరీంనగర్ జిల్లాలో మంత్రుల నీడ...

కరీంనగర్ జిల్లాలో 1207 గ్రామపంచాయతీలుండగా, హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు 54 గ్రామాలలో 791 ఇండ్లనిర్మాణాలపై మాత్రమే విచారణ జరిపారు. ఈ మాత్రం దాంట్లోనే దాదాపు రూ.20 కోట్ల అవినీతి జరిగినట్లు ధవీకరించారు. రికవరీకి ఆదేశిస్తే వసూలైంది రూ.22.95 లక్షలు మాత్రమే. మహదేవ్‌పూర్ మండలంలోని పలిమెల గ్రామంలో 75 ఇండ్ల నిర్మాణంపై విచారణ చేపట్టగా రూ.15.58 లక్షల అవినీతి నిర్థారించారు. ప్రత్యేక అధికారి ఇంతవరకు ఆ అవినీతిపై ఎలాంటి విచారణ కూడా జరిపించకపోగా కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. 

గత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన మంత్రి అండ సదరు అధికారికి ఉండడంతో , సంబంధిత అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. ఇదే జిల్లాలో ప్రజల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని, అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు బుక్ చేశారు. కానీ ఈ కేసులు ఏసీబీ వద్ద పెండింగ్‌లో ఉండడం గమనార్హం.భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన కొందరు అధికారులపై కార్పొరేషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా కేవలం ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కత్తిరించి లేదా మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

కొంత మంది అధికారుల సస్పెన్షన్‌ను రద్దు చేసి విధులలోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాకు చెందిన మంత్రి అండదండలతోనే ఈ తతంగమంతా జరిగినట్లు అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. జిల్లాలో మరికొంత మంది ఏఇ/ ఏఓ/ ఎమ్‌హెచ్‌ఓ/వీఓ, రాజకీయనాయకులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టినప్పటికీ గత ప్రభుత్వంలోని పెద్దనాయకుల అండదండలతో తప్పించుకు తిరుగుతున్నారు. వాస్తవానికి కరీంనగర్ జిల్లాలో 9,80,739 నివాసాలుండగా, మంచి కండిషన్‌లో 6,46,998 నివాసాలున్నాయి. నివాసయోగ్యమైన అవాసాలు 2,91,248 ఉండగా,శిథిలావస్థలో కేవలం42,493 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ జిల్లాలో 3.16 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే నిర్మించింది కేవలం 39.335 ఇండ్లుమాత్రమే.. ఇంకా ఈ జిల్లాలో హౌజింగ్ రికార్డుల ప్రకారం ఇంకా 2.77 లక్షల ఇండ్లు నిర్మించాల్సి ఉంది...

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి