-కేంద్ర హోంశాఖ సూచనల మేరకు సవరణలు
పలు సవరణలతో కూడిన తెలంగాణ ప్రభుత్వ రాజముద్రను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రభుత్వం రూపొందించిన రాజముద్రలో లోపాలు ఉన్నట్లు సూచనలు వచ్చాయి. దీంతో కేంద్రం కూడా దీనిలో మార్పులకు సూచించింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. కేంద్ర హోంశాఖ చేసిన సూచనల మేరకు మార్పులు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సవరణలతో కొత్త రాజముద్రను రూపొందించి కేంద్రానికి నివేదించారు. దీంతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ రాజముద్రకు ఆమోదముద్ర వేసింది.
గతంలో రూపొందించిన రాజముద్రలో వృత్తాకారం వెలుపల తెలుగులో ఉన్న సత్యమేవ జయతేను దేవనాగరి భాషలో మూడు సింహాలకు దిగువన ఉండేలా మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దీంతో రాజముద్ర వృత్తాకారం వెలుపల ఉన్న సత్యమేవ జయతేను వృత్తాకార లోపల ఉన్న మూడు సింహాల చిహ్నానికి దిగువన రెండు మిల్లీమీటర్ల పరిణామంలో ముద్రించారు. అలాగే పాత రాజముద్రలో చార్మినార్‌కు చెందిన మూడు మినార్లు మాత్రమే కనిపించేవి.
ఇప్పుడు నాలుగు మినార్లు స్పష్టంగా కనిపించేలా సవరణ చేశారు. ఈ మేరకు రాజముద్రలో అశోక చిహ్నం, సత్యమేవ జయతే పదాలతోపాటు వెలుపలి వృత్తం బంగారు రంగులో కనిపించేలా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం అని ఆంగ్లం, తెలుగు, ఉర్దూ భాషల్లో రాసి ఉన్న అక్షరాలు, మిగిలిన రెండు వృత్తాలు ఆకుపచ్చని రంగులో ఉండేలా నిర్ణయించారు. ఆకుపచ్చ వలయం పైభాగంలో సగం రాజముద్ర వరకు ఆంగ్లంలో గవర్నర్‌మెంట్ ఆఫ్ తెలంగాణ అని, వృత్తం దిగువన ఎడమవైపు తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో, కుడివైపున ఉర్దూలో ఉంటుంది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి