తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతానికి సరియైన దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రతి పథకంలోనూ వేల కోట్ల కుంభకోణం బయటపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని రూపుమాపేందుకు వ్యవస్థాపరమైన దిద్దుబాటు మొదలుపెట్టారు. దీన్ని కొనసాగించి అవినీతిపరుల బొక్కసాల్లోంచి అక్రమ ధనాన్ని బయటకు తీయాలి. ఇలా వచ్చిన ధనంతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలి.
అవినీతి చీడ పీడలేని చోటు అంగుళమైనా ఉన్నదా అంటే అనుమానమే. రాష్ట్రం లో దేశంలో అవినీతి రక్కసి జడలు విప్పి నాట్యం చేస్తున్నది. ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేస్తున్నది. మొత్తం పాలనా వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో అడుగు వేయాలన్నా అవినీతే పెద్ద అడ్డంకిగా తయారయింది. కాబట్టి అవినీతి రక్కసి రెక్కలు విరిచి వేయకుండా మన రాష్ట్రంలో మన పాలన సాగేట్టు లేదు. ఈ నేపథ్యంలోనే అవినీతి అనేది ప్రధాన చర్చగా ముందుకు వచ్చింది.
వ్యవస్థ మొత్తం అవినీతిమయమైందన్న మాట చాలా కాలంగా అందరూ అంటు న్నా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత ప్రభుత్వాల బట్టబయలవుతున్నా యి. ముఖ్యంగా పాలనా వ్యవస్థే అవినీతిని పెంచి పోషిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వ పథకాలన్నీ అవినీతికి కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలంటేనే అవినీతికి చిరునామాగా తయారయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల ఛత్రఛాయల్లో అధికారయంత్రాం గం, నేతలు, బ్రోకర్లు ఏకమై పథకాలన్నింటినీ అవినీతిమయం చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డులు,ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్ల పథకాల్లో అవినీతి కట్టలు తెగి ప్రవహించింది.
పేద, బలహీన వర్గాలకు చౌక ధరలకు నిత్యావసరాలను సరఫరా చేసే తెల్ల రేషన్ కార్డుల్లో కూడా అవినీతికి అంతేలేదు. తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షలు కుటుంబాలు ఉంటే 89 లక్షల తెల్లకార్డులు ఇచ్చారు. ఇవేగాక మరో 14లక్షల పింక్ కార్డులు ఉన్నాయి. ఒకానొక అధ్యయనంలో ఇందులో 30 శాతం బోగస్ కార్డులుంటాయని తేలింది. ఆరోగ్యశ్రీ పథకం అయితే బడుగు, బలహీన వర్గాల కోసం గాకుండా కార్పొరేట్ హాస్పిటళ్ల కోసమే తయారైనట్లుగా ఉన్నది. ఈపథకం కింద ఐదేళ్లలోనే 30 వేల కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ఇవన్నీ రాష్ట్రంలోని కొన్ని హాస్పిటళ్లకే స్వంతమయ్యాయి.
ఆరోగ్యశ్రీ పథకం కింద ఖర్చు చేసిన ఈ ప్రభుత్వ డబ్బుతో నిమ్స్ లాంటి పది ఆసుపత్రులను నిర్మించుకోవచ్చు. ఇక ఫీజు రీయింబర్స్‌మెంటు అనేది కూడా కాలేజీ యాజమాన్యాల కోసమే ఉన్నట్లుగా తయారైంది. కేవలం ఫీజు రీయింబర్స్ ఫండు కోసమే నడుస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు. కనీస బోధ నా సిబ్బంది, వసతులు లేకుండా, కనీస విద్యాప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న కాలేజీలే ఎక్కువ అని నిపుణుల కమిటీ ఒకటి తేల్చింది. ఇలాంటి వృత్తివిద్యా కళాశాలలు ప్రతి యేటా 4వేల కోట్లు దండుకుంటున్నాయి. దీనిలో కనీసం 2, 500 కోట్ల రూపాయలు అప్పనంగా బుక్కుతున్నాయి. పేదవాడి ఇంటి పథకంలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుకున్నాయి.
తెలంగాణలో 11,200 గ్రామాలుంటే 593 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దశాబ్దకాలంలో 22లక్షల 40 వేల ఇళ్లు నిర్మించినట్లు కాగితా ల్లో రాసుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం 293 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో 36 వేల ఇళ్లు కాగితాలపైనే ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వీటి పేరుమీద 235 కోట్లు దళారులూ, నేతల జేబుల్లోకి వెళ్లాయి. ఒక్క 2008-09 సంవత్సరంలోనే 5,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేసినట్లు రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే 45వేల ఇళ్లు నిర్మించినట్లు చెప్పుకున్నారు. ఇదే విధంగా మంథనిలో 41,099, కొడంగల్‌లో 32,337, పరిగిలో 30, 410 ఇళ్లు నిర్మించి పేదవాడికి సొంత ఇంటి భాగ్యం కల్పించినట్లు చెప్పారు. తీరా చూస్తే చాలా గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల్లో చూపినట్లు పేదల ఇళ్లూ లేవు, పేదలూ లేరు. అంటే ఇళ్లన్నీ కాగితాలపైనే ఉండి, కోట్ల రూపాయల ప్రజా ధనమంతా అవినీతి పరుల జేబుల్లోకి వెళ్లింది.
ఇంత జరుగుతున్నా ఈ సమాజమంతా చూస్తూ ఊరుకున్నదా? అంటే అదేం లేదు. అంతా అవినీతి గురించి మాట్లాడే వారే. రాజకీయనాయకులూ, సివిల్ సొసైటీ అని చెప్పుకునే అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యక్తులూ అందరూ మాట్లాడారు. అయితే వ్యవస్థీకృత అవినీతిని వ్యక్తిగత అవినీతిగా చూపి కొందరు అధికారులను బాధ్యులను చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తాము ఎంత ఘటికులో చెప్పుకునేందుకు ఇళ్ల కుంభకోణంలో 490 మంది అధికారులను సస్పెండ్ చేశారు.
ఇంకో 285 మందిని ఉద్యోగాలనుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నిజానికి అవినీతి వృక్షానికి వేర్లు పైన ఉంటాయి. శాఖలు కిందికి విస్తరిస్తాయి. అవినీతికి ఆయువు పట్టు పాలకుల్లో ఉన్నది. పథకాల విధివిధానాల రూపకల్పనలో ఉన్నది. వాటి అమలులో ఉన్నది. అవీనితికి బాధ్యులుగా చేసి శిక్షించ దలిస్తే మొదటి ముద్దాయిలుగా గత ప్రభుత్వాల్లోని పెద్ద మనుషులు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుం ది. ఇన్నాళ్లకైనా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతానికి సరియైన దిశలో అడుగులు పడుతున్నాయి. ప్రతి పథకంలోనూ వేల కోట్ల కుంభకోణం బయటపడుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని రూపుమాపేందుకు వ్యవస్థాపరమైన దిద్దుబాటు మొదలుపెట్టారు. దీన్ని కొనసాగించి అవినీతి పరుల బొక్కసాల్లోంచి అక్రమ సొమ్ము ను బయటకు తీయాలి. ఇలా వచ్చిన ధనంతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రజోపయోగ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాలి. అలాగే అవినీతిని రూపుమాపేందుకు సంక్షేమ పథకాల రూపకల్పనలోనూ, అమలులోనూ పారదర్శకత ఉండే విధంగా విధివిధానాలు రూపొందించాలి. ఇది తెలంగాణ ప్రజాకాంక్ష.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
మీరన్నది 100 శాతం కరెక్టు...
వారు, వీరు అని కాదు.. గత ప్రభుత్వాల్లో ఏ పధకం చూసినా మొత్తం అవినీతిమయమే... దానికి ఉదహారణ రేషన్ కార్డులే..
సీమాంధ్ర, తెలంగాణాలో ఉన్న కుటుంబాల కన్నా రేషన్ కార్డులు ఎక్కువున్నాయంటే ఎంత అవినీతి జరిగిందే చెప్పక్కర్లేదు...
వారు, వీరు అని కాదు ప్రతి రాజకీయనాయకుడు ఆ అవినీతిలో భాగం పంచుకున్నారు. అధికారులు కూడా తక్కువ తినలేదు...
అలాగే లేని ఇల్లులు రికార్డులో చూపించి కోట్లకు పడగెత్తినా నాయకులు (ఆంధ్ర ఆయినా, తెలంగాణా ఆయినా) నుండి ప్రభుత్వ సొమ్ము కక్కించి ఖజానాకి జమచేయించాలి.
ఫీజు రియంబర్సుమెంటు విద్యార్దుల కన్నా కాలేజిలకే ఎక్కువ ఉపయెగపడుతున్నాయి అన్న మీ వాదన నిజమే... ఆ పధకం ఉద్దేశ్యం మంచిదే కానీ, దాని నిర్వహణ సమగ్రంగా లేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి