గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 04, 2014

తాగునీళ్లపేరుతో సాగుకై నీటి తరలింపు కుట్ర...!

-డెల్టా నారుమడులకు నీటికోసమే తాగు ముసుగులు
-పులిచింతలలో నిల్వనీరూ డెల్టా ఆయకట్టుకే
-డెడ్‌స్టోరేజీకి చేరుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం
-510 అడుగులకు తగ్గితే ఏఎమ్మార్పీ మోటార్లే నడవవు
-జంటనగరాలకు, ఫ్లోరైడ్ ప్రాంతాలకు కటకటే
సమైక్య సంకెళ్లను తెంచుకుని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా ఆంధ్రోళ్లు కుట్రలకు పదును పెడుతూనే ఉన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో తాగునీటి ముసుగులో డెల్టా ఆయకట్టులో నారుమడులకు నీళ్లు మళ్లించుకున్న వలస పాలకులు, రాష్ట్రం విడిపోవడంతో కుట్రకోణాన్ని మార్చారు. విడిపోయాక కూడా కృష్ణాబోర్డును ఏపీ నేతలు ఆశ్రయించి తాగునీటి అవసరాలకు నీరుకావాలని, రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున వారంపాటు 3.6 టీఎంసీలు విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయించారు. గత నెల 25 నుంచి ఈనెల 2 వరకు 3.6 టీఎంసీల నీరు వదిలారు. నీటిలో కేవలం 0.5 టీఎంసీలే ప్రకాశం బ్యారేజీకి చేరిందని, మధ్యలో పులిచింతల వద్దే నీరు ఆగిందని లెక్కలు చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురవ్వని ఈ తరహా అవాంతరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాతే తలెత్తడంలోనే కుట్రకోణం స్పష్టంగా కనిపిస్తోంది.

dayam
ఈ సాకుతో మరో 3.6 టీఎంసీలు వారంపాటు రోజుకు 6వేల క్యూసెక్కులు ఇవ్వాలని అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సాగ ర్ ప్రధాన విద్యుత్ కేంద్రంతో 6015 క్యూసెక్కుల నీరు విద్యుత్తుత్పత్తి చేస్తూ వదలుతున్నారు. ఈ రకంగా నీరురాలేదనే సాకు చూపి 7.2 టీఎంసీలు తరలించుకుని పోవటంలో ఆంధ్రోళ్లు సఫలీకృతులయ్యారు. ఏటా తాగునీటి అవసరాలంటూ నారుమడులకు, నార్లు ముదిరాయని నాట్లకోసం తీసుకెళ్లటం రివాజుగా మారింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కారు కొలువుదీరటంతో కుట్రల రూపం మారుస్తున్నారు.


డెల్టా ప్రయోజనాల కోసమే పులిచింతల

సాగర్ ప్రాజెక్టుకు దిగువన 115 కి.మీ, ప్రకాశం బ్యారేజీకి ఎగువన 85 కి.మీ దూరంలో నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం వజినేపల్లి, గుంటూరు జిల్లా పులిచింతల మధ్యన పులిచింతల ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. 24 గేట్లకుగాను 18 గేట్లు పెట్టారు. క్రస్టుగేట్ల వరకు 4 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం పులిచింతల వద్ద 2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. క్రస్టుగేట్ల లెవల్ 32.50 అడుగులు. ప్రస్తుతం 32.30 అడుగుల వరకు నీరుంది. 19, 20, 21, 22 స్లూయిస్ గేట్ల ద్వారా నీరు ప్రకాశం బ్యారేజీకి పోతోం ది. సాగర్ నుంచి 6 వేల క్యూసెక్కులు రాగా.. కిందికి 5 వేల క్యూసెక్కులు వెళ్తున్నాయి. కష్ణా డెల్టాలో మూడో పంటకు సాగునీరు ఇచ్చేందుకు, అత్యవసరంగా నీటి అవసరం ఉన్నప్పుడు విడుదల చేసుకునేందుకే పులిచింతల ప్రాజెక్టు చేపట్టారు. ప్రాజెక్టులోని చుక్కనీరు కూడా నల్లగొండ జిల్లాకుగానీ, తెలంగాణకు గానీ ఉపయోగపడదు. పులిచింతలలో నిల్వఉండే నీటిని అవసరాన్నిబట్టి ఎప్పుడైనా ప్రకాశం బ్యారేజీకి విడుదల చేసుకోవచ్చు. స్లూయిస్ గేట్ల ద్వారా పులిచింతలలోని పూర్తి నీటిని తీసుకెళ్లే వీలుంది. ఇదంతా దాచేసి పులిచింతల వద్ద నీళ్లు ఆగాయని, ప్రకాశం బ్యారేజీకి చేరలేదని కట్టుకథలు అల్లారు.
nirasana
భయపెడుతున్న సాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి సామర్థ్యం 590 అడుగులు. డెడ్‌స్టోరేజీ సామర్థ్యం 510 అడుగులు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 515.10 అడుగులు (140.4917 టీఎంసీలు) నీరుంది. డెల్టాకు నీటి విడుదల పూర్తయ్యేసరికి నీటి మట్టం 513 అడుగులకు పడిపోనుంది. సాగర్‌లో 510 అడుగులకు నీటిమట్టం పడిపోతే ఏఎమ్మార్పీ మోటార్లు నడిచే పరిస్థితి లేదు. అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగునీరు వచ్చే పరిస్థితి ఉండదు. జూలై మొదటి వారం వచ్చినా వర్షాల జాడలేక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎగువన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన మేర లేకపోవటం.. వర్షాలు కూడా లేక శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో లేదు. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటిని తరలించటంతో శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 834.30 అడుగుల నీరుంది. ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగులు ఉంచాల్సిందే. ప్రస్తుతం శ్రీశైలంలో 54.2498 టీఎంసీల నీరుంది. 1925 క్యూసెక్కుల నీరు విద్యుత్తుత్పత్తితో కిందికి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతినీటి బొట్టును సరిగా వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది.

నీటి విడుదల నిలిపేయాలని టీఆర్‌ఎస్ ఆందోళన

తాగునీటి పేరుతో కృష్ణా జలాలను కాజేయడానికి ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, కృష్ణాడెల్టాకు నీటి విడుదల నిలిపేయాలని టీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం సాగర్ పైలాన్ కాలనీలోని విద్యుత్‌కేంద్రం గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. డెల్టాకు నీటి విడుదల చేయాలంటే సాగర్ ఎడమ కాల్వకు కూడా నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం శివాలయం ఘాట్ వద్ద నీటిలోకి దిగి కృష్ణా డెల్టాకు నీటివిడుదల నిలిపేయాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పెద్దవూర మండల రూరల్ అధ్యక్షుడు రమేశ్‌జీ తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి