గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 02, 2014

కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై.. ఆంధ్రా సర్కార్ తొండాట...!

-ఒప్పందం ప్రకారం నీరు చేరలేదంటూ తప్పుడు ప్రచారం
-అడ్డదారిలో ఆదేశాలు జారీ చేయించిన వైనం
-మరోవారం నీరివ్వాలని రివర్‌బోర్డు ఆదేశం
-ఏకపక్ష నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం
-కృష్ణాడెల్టాకు నీరివ్వాలంటే ఎడమకాలువకు నీరు కావాలి
-కేంద్రానికి లేఖ రాయనున్న కేసీఆర్ సర్కార్
నీళ్ల లెక్క బరాబర్ ఉన్నా ఆంధ్ర సర్కార్ తొండికి దిగుతోంది. కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదలపై ఆంధ్రసర్కార్ మరో పేచీ పెట్టింది. ముందు ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తాగునీటి అవసరాలకు పూర్తి కోటాను విడుదలచేసినా అది తమకు చేరలేదంటూ తప్పుడు ప్రచారం చేసి కేంద్రాన్ని మాయచేసింది. తాగునీటి ముసుగులో అదనపు నీటిని కొట్టేయడానికి అడ్డదారిలో ఆదేశాలు జారీ చేయించింది. దీనిపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ సర్కార్ కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటే నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు వదలాలని కేంద్రానికి లేఖ రాయనుంది. ఆంధ్రసర్కార్ తప్పుడు లెక్కలను నమ్మవద్దని, భౌతికంగా తనిఖీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలని రివర్‌బోర్డు తాత్కాలిక చైర్మన్‌కు సూచించింది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు మరో వారం రోజుల పాటు తాగునీటిని విడుదల చేయాలని కృష్ణా నది యాజమాన్యబోర్డు మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా ఆదేశాలు జారీచేసింది. ఎలాంటి సమావేశం ఏర్పాటుచేయకుండానే, తెలంగాణ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకుండానే రివర్‌బోర్డు చైర్మన్ ఆదేశాలు జారీచేయడం కలకలం సృష్టించింది.

waterదీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు రివర్‌బోర్డు చైర్మన్ పాండ్యతో ఫోన్‌లో మాట్లాడి తమ ప్రభుత్వంతో చర్చికుండా, భౌతికంగా తనిఖీలు చేయకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రివర్‌బోర్డు ఆకస్మిక నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రజలసంఘం ఆధ్వర్యంలోని రివర్‌బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడంపై, ఒకవేళ విడుదల చేస్తే ఎంతవరకు విడుదల చేయొచ్చన్న అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలంటే నాగార్జునసాగర్ ఎడమకాలువకు నీరు వదలాలని, తమకు కూడా తాగునీటి అవసరముందని తెలంగాణ సర్కార్ కేంద్రానికి లేఖ రాయనుంది.

ఆంధ్రసర్కార్ తప్పుడు లెక్కలు

వాస్తవానికి కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం 3.6 టీఎంసీ ఫీట్ నీటిని విడుదల చేయాలని గత నెల 25న ఒప్పందం కుదిరింది. కేంద్ర జలసంఘం చైర్మన్, కృష్ణా నది యాజమాన్య బోర్డు తాత్కాలిక చైర్మన్ పాండ్య సమక్షంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కేంద్ర జలసంఘం సూచించింది. దీనిలో భాగంగా కృష్ణా డెల్టాకు తాగునీరే కాకుండా తెలంగాణకు దాదాపు 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత నెల 25న సాయంత్రం నుంచి నీటిని విడుదల చేస్తోంది. మొదటిరోజు చాలినంత సమయం లేకపోవడంతో 4,539 క్యూసెక్కులను విడుదల చేశారు. రెండోరోజు జూన్ 26న గరిష్ఠంగా 7,536 క్యూసెక్కుల నీటిని, 27న 5,725 క్యూసెక్కులు, 28న 5,700 క్యూసెక్కులను, 29న 5,740 క్యూసెక్కులు, 30న 4,765 క్యూసెక్కులను విడుదల చేశారు. అంటే ఆరురోజుల్లో మొత్తం 2.98 టీఎంసీలను విడుదల చేశారు.

మంగళవారం నాటికే మూడు టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు ఎల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం వరకు 3.5 టీఎంసీల నీటి విడుదల పూర్తికానుంది. ముందుగా కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసినప్పటికీ ఆంధ్ర సర్కార్ మాత్రం తప్పుడు లెక్కలతో గారడీ చేసేందుకు యత్నించింది. తెలంగాణ సర్కార్ తమకు ఒప్పందం ప్రకారం కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం లేదని, ఇప్పటివరకు ఒక్క టీఎంసీ నీరు కూడా తమ డెల్టాకు చేరలేదని పేచీకి దిగింది. వాస్తవానికి నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజికి మధ్య 150 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ విడుదలైన నీరు విజయవాడలోని ప్రకాశం బ్యారేజికి చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి మూడురోజులు పడుతుంది. అంటే 27 లేదా 28 నాటికి విడుదలైన నీరు మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకుని ఉంటుంది. కానీ ఆంధ్ర సర్కార్ మాత్రం కుట్రలకు పాల్పడుతూ, అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెడుతోంది. అదనపు నీటి విడుదలకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. నిజానికి కృష్ణా డెల్టాలో తాగునీటి అవసరాలకు కేవలం ఒకటి నుంచి రెండు టీఎంసీలు సరిపోతాయని, సాగునీటికి మళ్లించడానికే ఆంధ్రసర్కార్ ఎక్కువనీటి వాటాను అడుగుతోందని తెలంగాణ సర్కార్ వాదించి కేంద్ర జలసంఘాన్ని ఒప్పించడంలో సఫలమైంది.

మానవతా దృక్పథంతోనే తాము తాగునీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తుందని ఒక కన్నేసి పెట్టాలని తెలంగాణ సర్కార్ కేంద్ర జలసంఘాన్ని కోరింది. అవసరమైతే నీటి చౌర్యం జరుగుతుందా లేదా అనే విషయాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించవచ్చు. కానీ కేంద్ర జలసంఘం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎస్‌ఇ స్థాయి అధికారిని పర్యవేక్షకుడిగా నియమించింది. నిజానికి నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి. నాగార్జున సాగర్ నీటి నిల్వ 515 అడుగులకు పడిపోయింది. మినిమమ్ డ్రాడౌన్ లెవల్ 510 కంటే కేవలం 4 అడుగుల ఎక్కువ ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే హైదరాబాద్‌కు తాగునీరు కూడా కష్టమే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వర్షాలు లేకపోవడంతో జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుందో లేదోనని రైతాంగం ఆందోలన చెందుతోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండాలని ఇప్పటికే ఆయా చోట్లా రైతులు వరుణపూజలు నిర్వహిస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి