-ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేసిన బడాబాబులు
-దిక్కులు, లేఅవుట్ మార్చి 40 ప్లాట్లకు మహవీర్ బిల్డర్స్ ఎసరు
-ఫస్ట్ లీఫ్ పేరుతో ప్రభుత్వ భూమిలో పూజా డెవలపర్స్ విల్లాలు
-రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల అండదండలు!
-కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
ఇటు చూస్తే భూకబ్జా.. కట్ చేస్తే క్రమబద్ధీకరణ! అది శివారు ప్రాంతమైనా.. నగరం నబొడ్డయినా! ఖాళీగా ఉంటే చాలు! ప్రభుత్వ స్థలమైనా.. ప్రైవేటు భూములైనా! ఆక్రమించుకోవాలన్న ఆలోచన రావడమే తరువాయి.. వందల కోట్ల విలువైన భూములు స్వాహా అయిపోతున్నాయి! రాత్రికి రాత్రే కాగితాలపై కాగితాలు పుట్టిస్తారు.. ప్లాన్లు మార్చేస్తారు.. అనుకూలమైన అధికారులను పట్టుకుని రికార్డులనే తిరగరాయిస్తారు! ఆ భూములు తమ ముత్తాతల సొమ్మయినట్లు అమాంతం తమ ఖాతాలో వేసుకుంటారు! ఇక జోరుగా నిర్మాణాలు.. విక్రయాలు.. లాభార్జన! రాజధాని నగరంలో ఏ మూల చూసినా ఇదే తతంగం! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి అత్యంత సమీపంలో ఉన్న గోపనపల్లిలో! ఈ తాజా కబ్జా కహానీ వంద కోట్ల రూపాయల పైచిలుకు ధరపలికే భూములది!-దిక్కులు, లేఅవుట్ మార్చి 40 ప్లాట్లకు మహవీర్ బిల్డర్స్ ఎసరు
-ఫస్ట్ లీఫ్ పేరుతో ప్రభుత్వ భూమిలో పూజా డెవలపర్స్ విల్లాలు
-రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల అండదండలు!
-కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ విస్తరించిన ప్రాంతానికి కూతవేటుదూరంలో ఉన్న భూములవి. ఆ ప్రత్యేకతే ఆ భూములకు మంచి విలువను తెచ్చిపెట్టాయి. ఖాళీగా ఉన్న ఆ భూములపై కబ్జారాయుళ్లు కన్నేశారు. ఒకరు పాత లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లు కలుపుకొని.. కొత్త లేఅవుట్ వేస్తే.. మరొకరు ఆక్రమించిన భూమిలో విల్లాలు మొలిపిస్తున్నారు! ఇదేం అన్యాయమని అసలు యజమానులు అధికారుల చుట్టూ తిరిగితే న్యాయం జరుగలేదు. ఆక్రమించిన భూమిలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చారా? అని సమాచార హక్కు చట్టం కింద అడిగితే.. అసలు మీ ప్రశ్నలో స్పష్టతలేదు పొమ్మన్నారు! ఎటుపోవాలో తెలియని బాధితులు ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. ఇవేవీ పట్టని నిర్మాణ సంస్థలు దర్జాగా కబ్జా చేసిన భూమిలో దిలాసాగా దందా చేసుకుంటున్నాయి. ఇది ఐటీ పరిశ్రమ వేళ్లూనుకుని ఉన్న శేరిలింగంపల్లి మండలంలోని గోపనపల్లిలో అక్రమార్కుల కబ్జా కథ!
గోపనపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్ 74లో ఏర్పడిన అతిపెద్ద వెంచర్ జర్నలిస్టు కాలనీ. సర్వే నంబర్ 74 కింద 105 ఎకరాల 18 గుంటల భూమి ఉంటే అందులో 60 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించారు. జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ దానిని లేఅవుట్ చేసి, ప్లాట్లుగా విభజించి, ఆనాటికి సొసైటీలో సభ్యులుగా ఉన్న జర్నలిస్టులకు కేటాయించింది. పక్కా ప్లాన్ కూడా ఉండడంతో ఇప్పటివరకు కబ్జారాయుళ్లు ఈ భూమిపై కన్నేయలేదు. జర్నలిస్టులతో తమకెందుకులే అనుకున్నారో.. లేక జర్నలిస్టులతో పెట్టుకుంటే అక్రమాల చరిత్ర అంతా బయటకు తీసి కటకటాల వెనక్కు తోయిస్తారని అనుకున్నారోగానీ ఈ భూమి జోలికి రాలేదు. కానీ.. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీని అనుకుని ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలపై కన్నేసిన బడాబాబులు.. వాటిని కబ్జా చేసి.. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ సర్వే నంబర్‌లో జర్నలిస్టు కాలనీ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఫస్ట్‌లీఫ్ పేరుతో పూజా వెంచర్స్ అనే సంస్థ విల్లాల నిర్మాణానికి దిగింది. ఈ విల్లాలను విక్రయించడానికి అందమైన బ్రోచర్లను విడుదల చేసింది. ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విల్లాలను నిర్మించే బడా సంస్థకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సహకరిస్తుండడంతో అక్రమణదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇది మహవీర్ బిల్డర్స్ కబ్జా కహానీ
మహవీర్ బిల్డర్స్ అనే సంస్థ జర్నలిస్టు కాలనీకి మరోవైపు ఉన్న పట్టా భూమి సర్వే నంబర్ 75లో గతంలో వెలసిన లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లను తీసుకుంది. పక్కనే ఖాళీగా ఉన్న 74 సర్వే నంబర్‌లోని దాదాపు ఎకరం భూమిని కబ్జా చేసింది. ఇంతటితో ఆగకుండా సర్వే నంబర్ 75లో 300 గజాల చొప్పున ఉన్న దాదాపు 40 ప్లాట్లను కూడా కలుపుకొని పాత లేఅవుట్‌ను మార్చి కొత్త లేఅవుట్ చేసి ప్రైవేట్ భూములను కబ్జా చేసింది. దీంతో ప్లాట్ల అసలు యజమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆక్రమణకు గురైన తమ ప్లాట్లను రక్షించుకోవడానికి రెవెన్యూ, జీహెచ్‌ఏంసీ కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకున్న అధికారులు లేకపోయారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని ప్లాట్ల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మహవీర్ బిల్డర్స్ సంస్థ ప్రభుత్వ భూమిని కూడా కలుపుకొని కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిన్నకుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రంగంలోకి దిగి కబ్జాకు గురైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కాపాడాలని బాధితులు కోరుతున్నారు. భూములను కబ్జా చేసిన సంస్థలు నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చారా? అని సమాచార హక్కు చట్టం కింద జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేస్తే, మీరు అడిగిన ప్రశ్న క్లారిటీగా లేదని రాతపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో ఆక్రమణదారులకు అధికారులు అండగా ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి