గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 11, 2014

తెలంగాణ ఇండస్ట్రీపై చిన్నచూపు...!

-రాష్ట్ర పారిశ్రామిక రంగానికి చేయూత కరువు
-బడ్జెట్‌లో ఒక్క ప్రాజెక్టూ  ఇవ్వని మోడీ సర్కారు
-తెలంగాణ నేతలు వేడుకున్నా కరుణ చూపని జైట్లీ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు గుప్పించిన నరేంద్రమోడీ ప్రభుత్వం చివరకు మొండి చేయ్యే చూపింది. పార్లమెంటులో గురువారం మోడీ సర్కారు ప్రవేశపెట్టిన 2014-15 బడ్జెట్‌లో తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఒక్క ప్రాజెక్టును కూడా కేటాయించలేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న నేతల రాష్ర్టాలకు అడిగిందే తడవుగా వరాలు కురిపించిన మోడీ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని గాలికొదిలేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి అనేక ప్రాజెక్టులు కేటాయించిన ఎన్డీయే పెద్దలు, తెలంగాణపై సవతితల్లి ప్రేమను కనబర్చారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ నౌకాశ్రయానికి సమీప ప్రాంతాలను ఫైనాన్షియల్ సెంటర్లుగా గుర్తించారు.

కాకినాడలో హార్డ్‌వేర్ పరిశ్రమ, కృష్ణపట్నాన్ని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా మార్చటం, విశాఖపట్నం- చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దేశ వ్యాప్తంగా ఏడు ఇండస్ట్రియల్ పార్కులను ప్రకటించినా తెలంగాణకు ఒక్కటీ దక్కలేదు. రాష్ట్రంలో బయోటెక్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నా పట్టించుకోలేదు. చేనేత, టెక్స్‌టైల్స్ రంగాల్లో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆయా రంగాల అభివృద్ధికి పైసా కూడా విదిలించలేదు. బడ్జెట్‌లో మూడు మెగా హ్యాండ్లూం, టెక్స్‌టైల్స్ క్లస్టర్లను ప్రతిపాదించినప్పటికీ, వాటిని ఇప్పటికే అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ర్టాలకే కేటాయించారు. 
నోటి మాటే.. నిధుల కేటాయింపు లేదు

కేంద్రం తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నోటి మాటతో సరిపెట్టడంతో తెలంగాణ పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పినప్పటికీ కచ్చితంగా ఏయే రంగాల్లో కేంద్రం తోడ్పాటునందిస్తుందో స్పష్టత ఇస్తే బాగుండేదని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు కే సుధీర్‌రెడ్డి అన్నారు. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు వెంచర్ క్యాపిటల్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించడం హర్షించదగిన పరిణామమని టిఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్‌రావు అభిప్రాయపడ్డారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి