గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 06, 2014

ఆంధ్రా పోలీసులవల్ల...మన పోలీసులకు...అజ్ఞాతవాసం ఇంకెన్నాళ్లు?

-తెలంగాణ పోలీసు అధికారుల ఆవేదన
-ఏళ్లకేళ్లు లూప్‌లైన్‌లోనే తెలంగాణ అధికారులు
-స్వరాష్ట్రంలోనూ సీమాంధ్రులకే అందలం
-సర్కారును తప్పుదోవ పట్టిస్తున్న ఐపీఎస్‌లు
- సీఎం కేసీఆర్ దృష్టిసారించాలని వినతి
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు స్వరాష్ట్రం వచ్చినా తెలంగాణ పోలీసు అధికారులకు సీమాంధ్రుల బెడద తప్పడం లేదు. పోలీసు శాఖలో ఇప్పటికీ ఆంధ్రా ప్రాంత అధికారులకే పోలీస్ ఉన్నతాధికారులు ప్రాధాన్యత కేటాయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

policeఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లకేళ్లుగా లూప్‌లైన్‌లో ఉండిపోయిన తెలంగాణ అధికారులు తమకు అజ్ఞాతవాసం తప్పుతుందని భావించారు. అయితే అది అడియాసే అవుతున్నది. రాష్ట్రం ఏర్పడి నెల దాటినా పరిస్థితిలో మార్పు రాలేదు. మూడు, నాలుగేళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్‌పీ,ఏసీపీలు, అడిషనల్ డీసీపీ,ఎస్పీల పరిస్థితి అలాగే కొనసాగుతున్నది.

సిటీలో ఆంధ్ర అధికారులదే హవా

రాష్ట్ర రాజధానిలో మొదటి నుంచి ఎస్‌ఐలు, సీఐలు, ఏసీపీలు, అడిషనల్ డీసీపీల్లో అంతా సీమాంధ్ర వారే అధికారం చెలాయిస్తూ వచ్చారు. తెలంగాణ ఇన్‌స్పెక్టర్లను లూప్‌లైన్‌లోకి నెట్టేసి హైదరాబాద్‌ను సొంత జాగీరుగా ఏలుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారే అవే పోస్టుల్లో దర్జా వెలగబెడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సీఐలను వెంటనే లూప్‌లైన్‌కు పంపించి తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐలు, ఏఎస్‌పీల్లో 65 శాతం సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. గతంలో ఫ్రీజోన్ సాకుతో దూరిన వీరు లాబీయింగ్‌తో మంచి పోస్టింగులు పొందారు. సైబరాబాద్ డివిజన్‌లో కూడా అధికారులు సీమాంధ్ర ప్రాంతం వారే. సిటీ నిండా వీరే తిష్ఠ వేయడంతో డీఎస్పీ ప్రమోషన్లు తీసుకున్న తెలంగాణ అధికారులు అప్పటినుంచి లూప్‌లైన్‌లోనే కొనసాగుతున్నారు. సీనియర్ డీఎస్పీలు కూడా సీఐడీ, ఇంటలిజెన్స్, ఎస్బీ, కంప్యూటర్స్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్, సీసీఎస్ ఇలా అప్రాధాన్యత పోస్టుల్లో మిగిలిపోయారు. ఈ ప్రధాన పోస్టుల్లో కొనసాగినంత కాలం వీరెవరూ ఏపీ సర్కారుకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు. ఇకనైనా ఈ ఈ ఏసీపీలు, డీఎస్పీలను తప్పించి తెలంగాణ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ఉద్యమాన్ని అణిచేసినవారికీ అందలమా?

సిటీలో ఎస్‌ఐగా జీవితం ప్రారంభించి అడిషనల్ డీసీపీ స్థాయి ఎదిగిన అధికారుల లాబీయింగ్ చాలా పవర్ ఫుల్. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయుగోళాలు ప్రయోగించి, కేసుల్లో ఇరికించిన అడిషనల్ డీసీపీలు ఇంకా కీలక పోస్టుల్లో కొనసాగడం తెలంగాణ అడిషనల్ డీసీపీల్లో ఆగ్రహాన్ని రగులిస్తోంది. వీరు సిటీలో ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో పనిచేశారు. ఎస్‌ఐగా, ఇన్‌స్పెక్టర్‌గా, ఏసీపీగా ఇప్పుడు అడిషనల్ డీసీపీలుగా అన్ని ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో బదిలీ చేసినా కోర్టులకు వెళ్లి మరీ పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. ఇలాంటి పలువురు అధికారులకు పోలీస్ ఉన్నతాధికారులు అండదండలు అందించడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఇంకా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులను ఐపీఎస్ అధికారులు పోత్సహించడం, ప్రభుత్వపెద్దలకు తప్పుడు సంకేతాలు పంపిస్తూ పోస్టింగ్‌లు ఇవ్వడం ఆందోళన కల్గిస్తోందని తెలంగాణ ప్రాంత పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు..

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏసీపీలు, అడిషనల్ డీసీపీలు ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని తెలంగాణ పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అవినీతి సీమాంధ్ర అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ఐపీఎస్ అధికారులు ప్రయత్నాలుచేస్తున్నారని, వీరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని తెలంగాణ ఐపీఎస్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి సీమాంధ్ర అధికారులను లూప్‌లైన్‌కు పంపించి, కోర్టు తీర్పు అడ్డుపెట్టుకొని పోస్టింగ్‌లు పొందే వారిపై అప్పీలుకు వెళ్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ గోడు పట్టించుకోవాలని వారు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి