గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 21, 2014

తెలంగాణ ఆలయాలకు...సీమాంధ్ర గ్రహణం...

-వేల ఎకరాలు అమ్మేసిన అధికారిణి
-కొమ్ముకాసిన సీమాంధ్రమంత్రులు
-అటకెక్కిన జస్టిస్ వెంకట్రామరెడ్డి నివేదిక
-విజిలెన్స్ రిపోర్డులు, లోకాయుక్త సిఫారసులు,
-అవినీతినిరోధకశాఖ నివేదికలు అన్నీ బేఖాతర్
ఒకనాడు తెలంగాణ ఆలయాలు చాలా సంపన్నమైనవి. ఎక్కడ ఏ ఆలయం నిర్మించినా దాతలు ధూపదీప నైవేద్యాలు నిరాటంకంగా సాగాలని అభిలషిస్తూ వందల వేల ఎకరాల భూములు అర్పించుకున్నారు. దేవుడికి, పూజారికీ కూడా వేరువేరుగా భూములు ఇచ్చి సమస్యలు రాకుండా చూశారు. భద్రాచలం ఆలయానికి నిజాం ఏటా 30 వేల రొఖ్కం ఇవ్వడంతో పాటు అనేక మాన్యాలు ఆలయం పేర ఉంచిన విషయం తెలిసిందే. ఇదే దారిలో ప్రతి ఆలయానికి దాని నిర్మాతలు తగిన భూములు కూడా ఇచ్చేవారు. విలువైన కానుకలు సమర్పించే వారు. 
templeకానీ ఉమ్మడి రాష్ట్రంలో అవన్నీ హరించుకుపోయాయి. ఆదాయాలు మళ్లించారు. భూములు కైంకర్యం చేశారు. ఒకనాడు ధర్మకర్తల చేతిలో కళకళలాడిన ఆలయాలు సీమాంధ్ర అధికారుల పాలబడి జీర్ణాలయాలుగా మారిపోయాయి. ఇష్టారాజ్యపు నియామకాలు, భూముల ఆక్రమణలు, నిధులు వినియోగంతో ఆలయాలను దివాళా తీయించారు. ఆ అధికారులే ఇంకా ఉన్నత పదవుల్లో కొనసాగుతూ తమ అక్రమాలను యధేచ్ఛగా సాగిస్తున్నారు.ఆ అక్రమాధికారుల జాబితాలోని ఓ సీమాంధ్ర అధికారిణి కథ ఇది.. 
వందల ఎకరాల మాన్యాలు ఉండి, నిత్యారాధనలతో కళకళలాడిన రంగారెడ్డి జిల్లాలోని దేవర్‌యామిజాల, కోహెడ, అల్వాల్ దేవాలయాలు, సీతారాంబాగ్ వంటి సుప్రసిద్ధ దైవక్షేత్రాలు సీమాంధ్ర పాలనలో జీర్ణ దేవాలయాలై పోయాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, మంత్రులు స్వలాభం కోసం మద్దతు పలికారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని వందలకోట్ల విలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, భూములను నకిలీ సంస్థకు ధారాదత్తం చేసిన ఉదంతమే దీనికి ఉదాహరణ. ఈ కుంభకోణానికి సూత్రధారి ఓ సీమాంధ్ర అధికారిణి. దేవాదాయశాఖలో ఆ అధికారిణి అక్రమాల చిట్టా చాలా పెద్దది. వరుస అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు వెలికి వస్తున్నా.. వివిధ నిఘా సంస్థలు విచారణ సంస్థల నివేదికలు దాన్ని ధ్రువ పరిచినా విచిత్రంగా అధికారులు ఆమెపై చర్యలు తీసుకోవడం అటుంచి పదోన్నతులు కల్పించారు. చివరికి ఈ కుంభకోణాల వ్యవహారాలు పర్యవేక్షించే విజిలెన్స్ బాధ్యతను కూడా ఆమెకే కట్టబెట్టారు. ఈ వరుస అవినీతి కథనాల్లో మాజీ మంత్రుల పేర్లుకూడా పదేపదే నలుగుతున్నాయి. ముఖ్యంగా గాదె వెంకటరెడ్డి ఈగ వాలకుండా చూశారని అధికారి సుందర్‌కుమార్ అండదండలు అందించారని అధికారుల స్థాయిలోనుంచి కూడా వినిపిస్తోంది.

అంతా పెద్ద తలలే...

ఈ సీమాంధ్ర అధికారిణికి గతంలో దేవాదాయశాఖ మంత్రులుగా బాధ్యతలను నిర్వర్తించిన నాయకులందరూ చేయూతనందించారు. సీమాం ధ్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, మంత్రుల పీఎస్‌లు సదరు అధికారిణికి సేవలను అందించి తాము ఇతోధికంగా సంపాదించుకొని మూటగట్టకున్నారు.మాజీ మంత్రులు ఎమ్మెస్సార్, గాదె వెంకటరెడ్డి, సీ రామచంద్రయ్య, కమిషనర్లు డీఎస్ మూర్తి, ఐ.వెంకటేశ్వర్లు, పీ సుందరకుమార్, బలరామయ్య, ముక్తేశ్వరరావులు దేవాదాయశాఖ అధికారుల అవినీతిని సమర్థించారు. విజిలెన్స్‌రిపోర్డులను, అవినీతినిరోధకశాఖ నివేదికలను, లోకాయుక్త సిఫారసులను కూడా పక్కన పెట్టేశారు.

సిఫార్సు చేసింది ఈ అధికారే...

బంజారాహిల్స్ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని తనఖీ చేశానని, హరేరామహరేకృష్ణకు ఈ దేవాలయాన్ని అప్పగించడం వల్ల దేవాలయానికి మేలు జరుగుతుందని ఈ అధికారిణే నివేదికను రాశారు. రిపోర్డును ఆనాటి కమిషనర్ సుందరకుమార్ ఆమోదించారు. ఈ మొత్తం ప్రక్రియకు గాదె వెంకటరెడ్డి మహదానందంగా ఆమోదముద్ర వేశారు.

ఎక్కడికి వెళ్లినా అరోపణల వెల్లువలే...

ఇక ఇదే అధికారిణి భద్రాచలం, యాదగిరిగుట్ట, సికింద్రాబాద్ దేవాలయాలకు ఇవోగా పనిచేసిన కాలంలో చేసిన అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిర్వాకాలన్నింటిపైన విజిలెన్స్ రిపోర్టులు ఉన్నాయి. లోకాయుక్త, ఉపలోకాయుక్త విచారణలు జరిగాయి. కానీ నాడు ఈ శాఖకు మంత్రిగా ఉన్న గాదె వెంకటరెడ్డి ఈ అధికారిణికి అండగా నిలిచారు. దానికి ఆనాటి ఫైళ్లే సాక్ష్యమని సిబ్బంది చెబుతున్నారు. ఆరోపణలున్న ఈ అధికారిణిని సీమాంధ్ర పాలకులు, ఉన్నతాధికారులు ఏకంగా తెలంగాణ దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా నియమించారు. 2005లో ఈ అధికారిణి దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ సందర్భంలో దేవాదాయచట్టం 30/87లోని సెక్షన్ 89ను ఉల్లంఘించి దేవర్‌యామిజాల భూములను విక్రయించినట్లు ఆరోపణలు పత్రికల్లో వెల్లువెత్తాయి. భూముల మార్కెట్ విలువలపై విచారణ జరుపకుండా, నిబంధనలను పాటించకుండా సబ్‌రిజిస్ట్రార్, ఎంఆర్‌వోల నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా, వేలంపాట నిర్వహించకుండా విక్రయించారని ఆరోపణలు వచ్చాయి.

2005, 2006లలో జరిగిన దేవాలయాల భూముల విక్రయాలన్నింటిపైన జస్టిస్ వెంకట్రామరెడ్డి విచారణలు జరిపారు. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దేవర్‌యామిజాల భూముల విక్రయాలకు సంబంధించిన 18 కేసులలో అక్రమాలు జరిగాయని రుజువులతో సహా నిగ్గుతేల్చారు. లోకాయుక్త విచారణ, విజిలెన్స్ ఇవే విషయాలను రుజువు చేశాయి. ఆనాటి కమిషనర్ పీ. సుందరకుమార్ ఈ నివేదికలన్నింటినీ అటకెక్కించారు. గుంటూరు జిల్లాకు చెందిన పీ సుందరకుమార్, ప్రకాశం జిల్లా నాయకులు గాదె వెంకటరెడ్డి ఈ అధికారణికి సంపూర్ణంగా అండదందలందించారు. ఆర్‌సీనెం.ఈ1/13205/ 2007 తేదీ 07.09.2007 నాటి ఉత్తర్వుల ద్వారా ఈ ఆరోపణలన్నింటినీ ఉపసంహరించుకున్నారు.

ఎమ్మెల్యేను అవమానించి..

2004-05లలో ఈ అధికారిణి యాదగిరిగుట్ట ఇవోగా వ్యవహరించిన సందర్బంలో టీఆర్‌ఎస్ ఆలేరు శాసనసభ్యులు నగేశ్‌ను ఈమె, ఈమె మిత్రులు ఈవో ఛాంబర్‌లోనే అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు శాసనసభ్యుడు శాసనసభ ప్రివిలేజ్‌కమిటీకి లిఖితపూర్వకంగా తెలియచేశారు. అయినప్పటికీ అప్పట్లో శాసనసభ్యుల ప్రివిలేజ్‌కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన గాదె వెంకటరెడ్డి అమెను గుంటూరుకు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేసి ఉత్తుత్తి చర్యతో సరిపెట్టారు. ఇదే సందర్భంలో శాఖలోని 8 మంది సీనియర్ అసిస్టెంట్‌లకు జీవోనెం.262, జీవోఎంఎస్ నెం.245లను ఉల్లంఘించి గ్రేడ్-1, గ్రేడ్-2లకు చెందిన ఇవోలకు అక్రమంగా పదోన్నతులతో సూపరింటెండెంట్ హోదాలు దక్కాయి. దీనిపై అనేక వదంతులు వినిపించాయి.

అద్దాల మేడల్లో రాజభోగాల విలాసం..

ఈమె అధికార దుర్వినియోగానికి, విలాసవంతమైన జీవన విధానినికి, అవినీతికి సఫిల్‌గూడాలో ఆమె నిర్మించుకున్న భవనమే సాక్ష్యమని దేవాదాయశాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పడానికి ఈ బంగ్లా నిదర్శనమంటున్నారు. ప్రస్తుతం ఈమె దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్న దేవాలయ ఉద్యోగి నరేందర్‌రెడ్డి రెడ్‌హిల్స్ వేణుగోపాలస్వామి దేవాలయంలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా పదోన్నతులతో 6(ఏ) కేటగిరీలోని అమీర్‌పేట కనకదుర్గ దేవాలయానికి బదిలీ అయ్యారు. అక్కడి నుండి డిప్యూటేషన్ పద్ధతిలో ఆమె పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించారు. నరేందర్‌రెడ్డి దేవాలయం ఉద్యోగులకు లక్షల రూపాయలు వడ్డీలకు తిప్పుతుంటారని ఉద్యోగులు చెబుతున్నారు.

తప్పుపట్టిన ఏసీబీ నివేదిక

అదేవిధంగా సుందరకుమార్ కమిషనర్‌గా వ్యవహరించిన సందర్భంలోనే ఏసీ అశోక్‌కుమార్, ఈ అధికారిణి కలిసి అర్హతలు లేనివారిని వ్యవస్థాపక ట్రస్టీలుగా గుర్తించి ప్రకటించినట్లు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వందలకోట్ల ఆలయాల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరించిన కాలంలో భూములను నిబంధనలకు వ్యతిరేకంగా విక్రయించినట్లు భద్రాచలం ఇవో గా వ్యవహరించిన కాలంలో అక్రమ నియామకాలు కొమరవెల్లి, వేములవాడ దేవస్థానాల ఇవోగా వ్యవహరించిన కాలంలో భక్తులను దూషించారన్న విమర్శలు వచ్చాయి.

వేములవాడ ఇవోగా ఉన్న సందర్భంలో ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, దేవస్థానానికి సరుకులు ఇచ్చే కాంట్రాక్టర్లు, ఇతర కాంట్రాక్టర్లను బెదిరించినట్టు ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ఆమె దగ్గర పనిచేసే ఉద్యోగి నరేందర్‌రెడ్డి, ఆనాటి దేవాదాయశాఖ మంత్రి సీ రామచంద్రయ్య, ఓఎస్‌డీ రవీందర్‌రావు వేములవాడలో రెడ్‌హ్యాండెడ్‌గా విలేకరులకు దొరికిపోగావిలేకరులపైన ఎస్ సీ,ఎస్‌టీ అట్రోసిటీస్ కేసు పెట్టేందుకు వెళ్లగా పోలీస్‌స్టేషన్‌లో వ్యవహారం సద్దుమణిగింది. తరచుగా ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ అస్ర్తాన్ని ప్రయోగిస్తుందని విమర్శలు ఉన్నాయి. మంత్రి సీ రామచంద్రయ్య అండదండలతో హైదరాబాద్‌కు విజిలెన్స్ ఆఫీసర్‌గా బదిలీ చేయించుకొని తనమీద ఉన్న ఆరోపణల ఫైళ్లన్నింటినీ చక్కపెట్టుకొన్నారని, తనకు తానే క్లీన్‌చిట్ రాతలు రాసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి