గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జులై 16, 2014

సీమాంధ్ర అవశేష రాజకీయం మనకు అవసరమా?

-బాబుల క్రీనీడలు ఇంకానా..?
-కాలంతో కలిసి నడువాలంటున్న జనం
-తెలంగాణవాదుల్లో జరుగుతున్న చర్చ
కొంత విస్మయం..కొంత ఆనందం కలిగే వార్త. సీపీఐ నేతృత్వంలో ఉన్న విశాలాంధ్ర దినపత్రిక తెలంగాణలో మరో పేరుతో మరో రూపంలో రానుందట. సరే.. సీపీఐ ఒక పార్టీగా తెలంగాణ స్వాతంత్య్ర నినాదాన్ని చాలా రోజుల కిందటే తీసుకున్నది. కానీ విశాలాంధ్ర ఒక ఆశయసాధన కోసం వచ్చిన పత్రిక. ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. అయినా.. ఇపుడు ఆ పేరుతో ఆ భావజాలంతో ఒక పత్రిక తెలంగాణకు అవసరంలేదని భావిస్తున్నది.

APకాలంతో కలిసి అడుగు వేయాలని భావిస్తున్నది. కాస్త ఆలస్యంగానే కావొచ్చు. సీపీఎం తెలంగాణ విభాగం ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. అదే దారిలో అనేక పార్టీలు వెళుతున్నాయి. ప్రముఖ దినపత్రికలన్నీ తెలంగాణకు వేరుగా పత్రికలను ముస్తాబు చేస్తున్నాయి. ఒకటి రెండు టీవీలు కూడా తెలంగాణకు వేరుగా చానెళ్లను ప్రారంభించాయి. ఈ మొత్తం పరిణామాల సారాంశం ఏమిటి? సీమాంధ్ర భావజాలానికి కాలం చెల్లిపోయిందనే.. తెలంగాణ ఇపుడు ప్రత్యేక రాష్ట్రం. ఈ రాష్ర్టానికి తన అవసరాలు తనకున్నాయి. తన ఆకాంక్షలు తనకున్నాయి. తన భావజాలం తనకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ గడ్డమీద ఇతరుల అవసరం తీరి పోయింది. విశాలాంధ్ర పత్రిక పరిణామం చెబుతున్నది అదే.

ఇంకా సీమాంధ్ర పెత్తనం అవసరమా?

కాలంతో కలిసి నడిచే వాడే విజ్ఞుడు. ఈ దారిలో మార్పును గమనించి తెలంగాణ రాజకీయాలు సీమాంధ్ర ఆధిపత్య శక్తుల నుంచి పూర్తిగా విముక్తి కావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. గురుకుల ఆక్రమణల తొలగింపు, పార్లమెంటులో పోలవరం సందర్భం, సాగర్ నీటి విడుదల వంటి అంశాల్లో టీటీడీపీ, టీబీజేపీ నాయకత్వం అనుసరించిన తీరు తెలంగాణవాదులను కలవరపరిచింది. ఆ పార్టీల స్థానిక నాయకులు ఇంకా సీమాంధ్ర నాయకత్వం అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, మాట్లాడుతున్నారని వారు భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు తెలుగు ప్రజలను తిరిగి కలుపుతానంటూ పదేపదే మాట్లాడుతున్నా తెలంగాణకోసం పోరాడామని చెప్పుకునే టీటీడీపీ నాయకత్వం మాటైనా మాట్లాడకపోవడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మాటల మర్మమేమిటి?

ఎంతో బాధతో, ఆవేదనతో రాష్ట్రం విడిపోయింది. రాజకీయ స్వార్థంకోసం రాష్ట్ర విభజన జరిగింది. తెలుగుజాతి ఎప్పటికైనా కలవాలి...తాజాగా విజయవాడలో తనకు జరిగిన సన్మానసభలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి. ఆయన ఇలా మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో కూడా ఇలాగే మాట్లాడారు.

తెలంగాణలో మళ్లీ 2019లోగానీ, అంతకంటే ముందుకానీ అధికారంలోకి వస్తాం అని ఆయన తెలంగాణను కవ్వించారు కూడా. చంద్రబాబు వ్యాఖ్యల సారాంశం ఏమిటి? రెండు రాష్ర్టాలను కలిపేయండి అసలీ సమస్యలే ఉండవుకదా అన్నాడో బెంగాల్ ఎంపీ ఆషామాషీగా... చంద్రబాబునాయుడు కూడా ఎప్పటికైనా అటువంటి పరిస్థితులు వస్తాయని, సృష్టిద్దామని అనుకుంటున్నాడా? ఆయన ధోరణి చూస్తే మాత్రం అలాగే అనిపిస్తున్నదని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో ఆయన ఇటీవల మాట్లాడుతూ 1956 ముందు ఆంధ్ర ప్రాంతాల ప్రస్తావన తెచ్చారు. భద్రాచలం డివిజన్ అన్నారు. మునగాల అన్నారు. మరొకటని అన్నారు.

ఇదంతా కలగాపులగంగా మారింది. నెటిజన్లలో ఆసక్తికర చర్చ.. సీమాంధ్ర ఆధిపత్యం తిరిగి తెలంగాణవైపు కన్నెత్తి చూడకుండా చేయాలంటే ఏం చేయాలి? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ఇది చాలా మంది ప్రశ్న. దీని వెనక భయాలున్నాయి. 12వందల మంది బలిదానాల విషాదం ఉంది. సోమవారం రాజ్యసభలో ఖమ్మం జిల్లాను ముంచే పునర్వ్యవస్థీకరణ చట్టంపై అంత జగడం జరుగుతూ ఉంటే తెలంగాణ నుంచి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కనీసం నోరైనా మెదపలేదు. నాగార్జున సాగర్ నీటిని తరలించుకుపోతూ ఉంటే మాటమాత్రంగానైనా ఖండించలేదు. తెలంగాణకు నష్టం కలిగించే విధంగా పీపీఏలను రద్దు చేస్తే నోరే విప్పలేదు. కానీ కేసీఆర్‌పై దాడికి మాత్రం ముందుంటున్నారు. ఇటువంటి పార్టీ మనకు ఇంకా అవసరమా? అని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ప్రశ్నించారు.

మారిన పార్టీల వైఖరి..

తెలంగాణలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సీమాంధ్ర ఆధిపత్యం నుంచి విముక్తి పొందాయి. తెలంగాణ కాంగ్రెస్‌పై జాతీయ పెత్తనం తప్ప సీమాంధ్ర పెత్తనం లేదు. ఆ పార్టీ స్థానికంగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. సీపీఐ ఎప్పుడో బంధనాలు తెంచుకుంది. విడిపోయిన తర్వాత సీపీఎం కూడాతెలంగాణ ఎజెండాతోనే పనిచేస్తున్నది. తెలంగాణ బీజేపీ కూడా స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఆరాటపడుతున్నా కేంద్ర నాయకత్వం వారికి ప్రతిబంధకాలు కల్పిస్తున్నది.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రభావం వారిపై పనిచేస్తున్నది. సీమాంధ్రలో బీజేపీ చంద్రబాబు తానా అంటే తందానా అంటోంది. చంద్రబాబు చెప్పినట్టు చేస్తామని హరిబాబు ఇటీవల ప్రకటించారు. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. సర్కారు వచ్చి నెలరోజులు పూర్తి కాకుండానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎస్ ప్రభాకర్ నోరు చేసుకుంటున్నారు. అయినా వారితో పెద్దగా తెలంగాణకు ప్రమాదం లేదు.

ఆందోళన కలిగిస్తున్న టీడీపీ తీరు..

ఇక ఫక్తు సీమాంధ్ర తొత్తు పార్టీగా మిగిలింది టీడీపీ ఒక్కటే. సీమాంధ్ర జెండాను, ఎజెండాను మోస్తున్న పార్టీ అదొక్కటే. విభజన మనకు ఆనందం కలిగిస్తే ఆయనకు బాధను కలిగిస్తున్నది. మనకు బాధ కలిగినప్పుడు మనతో బాధపడనివాడు, మనకు కోపం వచ్చినప్పుడు మనతో కలిసి నడవని వాడు మనకెందుకు? ఆ పార్టీ ఎప్పటికయినా తెలంగాణకు ప్రమాదకరమే. చంద్రబాబు ఆడిస్తే ఆడే మనుషులు, తిట్టమంటే తిట్టే మనుషులు ఇక్కడ ఉన్నంతకాలం తెలంగాణ ప్రశాంతంగా ఉండజాలదు అని సీనియర్ జర్నలిస్టు ఒకరు అన్నారు.

పైగా ఆయన మాటిమాటికి తెలుగుజాతిని కలుపుతానంటున్నాడు. ఇక్కడకూడా తిరిగి అధికారంలోకి వస్తానంటున్నాడు. అధికారంలోకి రావాలనుకోవడం వేరు. తెలుగుజాతిని కలుపుతామనడం వేరు.. తెలంగాణ ప్రజలు ఆయనను లేక మరో సీమాంధ్ర నేతను తిరిగి అధికారంలోకి తీసుకురావడం కల్ల. కానీ తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపే పేరుతో అక్కడి ప్రజలను మరోసారి మోసం చేయాలన్నది బాబు వ్యూహం కావచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. గత నెల రోజుల వ్యవధిలో టీటీడీపీ, టీబీజేపీ నేతలు తెలంగాణకు జరిగిన అన్యాయాలపై స్పందించింది తక్కువ.

తెలంగాణ ప్రభుత్వంపై నోరుపారేసుకుంది ఎక్కువ. ఉప్పల్ ఎమ్మెల్యే అయితే ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వం అని నిందించారు. వీళ్ల వల్ల తెలంగాణకు ఏమి ప్రయోజనం? అని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల అదుపాజ్ఞల్లో పనిచేసేవారు తెలంగాణకు ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర సర్కారు పరుగులు పెడుతున్నదని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం సచివాలయానికి వచ్చినపుడు ఏపీ చాంబర్లలో ఎక్కడి ఫైళ్లు అక్కడ పడి ఉన్నాయి. ఖాళీ చేసిన ఇల్లులా ఉంది. దాన్ని మీడియా మరో రూపంలో చిత్రించవచ్చు కానీ... ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రభుత్వం ఉంది. ఉద్యోగులున్నారు. నిధులున్నాయి. ఒక వ్యవస్థ ఉంది. అధికారం చేపట్టిన నెల తర్వాత ఫైళ్లు ఫర్నిచర్ కూడా సర్దని పరిస్థితి ఏం చెబుతున్నది?

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి