గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 07, 2014

కృష్ణపట్నం పవర్‌పై ఆంధ్రా కిరికిరి...!

-ఎస్డీఎస్టీపీఎస్‌లో తెలంగాణకు వాటా లేదని వాదన
-వాటా ఇవ్వాల్సిందేనన్న తెలంగాణ డిస్కమ్‌లు
-రెండో యూనిట్ ఉత్పత్తిపై నీలినీడలు
రాష్ట్ర విభజనను సాకుగా చేసుకుని తెలంగాణ విద్యుత్‌వాటాలపై తొండి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిపై కొత్తగా మరో తిరకాసు కుట్రలకు తెరతీస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఉమ్మడి వాటాలతో ఏర్పాటైన నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డీఎస్‌టీపీఎస్) ఉత్పత్తిలో తెలంగాణకు మొండిచెయ్యి చూపేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థల్లో దేశంలోనే మొట్టమొదటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ( కృష్ణపట్నం) గత ఏడాది ఆగస్టులో బాయిలర్ లైట్‌ఆప్ చేసి ఏపీజెన్‌కో సరికొత్త చరిత్ర సృష్టించింది.

వాస్తవానికి ఏపీజెన్‌కో, నాలుగు డిస్కమ్‌లు సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) కింద ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) ఏర్పాటు చేశాయి. దీని ఆధ్వర్యంలో 2X800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును నిర్మించాలనేది వాటి లక్ష్యం. అందులో ఏపీజెన్‌కో 51 శాతం వాటా, నాలుగు డిస్కమ్‌లు 49 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. డిస్కమ్‌లలో సీమాంధ్రలోని రెండు డిస్కమ్‌లు (ఈస్ట్రన్, సదరన్), తెలంగాణలోని రెండు డిస్కమ్‌లు (సెంట్రల్, నార్తరన్) ఉన్నాయి. వీటికి వాటాలను కూడా గతంలోనే నిర్దేశించారు. ఈ పవర్ ప్రాజెక్టుకు ఒడిశాలోని తాల్చేరు నుంచి 70 శాతం శుద్ధిచేసిన దేశీయ బొగ్గు కేటాయింపులున్నాయి.

మిగతా 30 శాతం విదేశీ దిగుమతి బొగ్గును వినియోగించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీదామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్‌డిఎస్‌ఎస్‌సిటిపిఎస్)గా నామకరణం చేసింది. తొలి 800 మెగావాట్ల యూనిట్ బాయిలర్ కాంట్రాక్టును అమెరికాకు చెందిన ఆల్‌స్ట్రామ్ కంపెనీ చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేసింది. రెండవ యూనిట్ 800 మెగావాట్ల కాంట్రాక్టును బీహెచ్‌ఈఎల్ పొందింది. తొలి యూనిట్ గత ఏప్రిల్‌లో విద్యుత్ ఉత్పత్తిని ప్రాంభించింది. ప్రారంభంలో 175 నుంచి 250 మెగావాట్ల మేరకు విద్యుత్ ఉత్పత్తిని సాధించింది. అయితే ఇది ఇన్‌ఫార్మ్ పవర్ పారంభంలో విద్యుత్తు కావడం వల్ల వెంటవెంటనే సమస్యలు వచ్చే అవకాశాలున్నందున దీనిని తెలంగాణ డిస్కమ్‌లు పట్టించుకోలేదు. ఇదే సమయంలో మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణపనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ డిస్కమ్‌లకు పంపకాలు (వాటా) చేయకుండా ఆంధ్రా సర్కారు కుట్రతో మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. 

పీపీఏల్లో వాటాల్లేవు

కృష్ణపట్నం పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విద్యుత్‌కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లో తెలంగాణ డిస్కమ్‌లకు వాటాలు లేవు. కానీ, ఒప్పందాలకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో)లో డిస్కమ్‌ల వారీగా వాటాల పంపకాలున్నాయి. ఎస్‌డీఎస్‌ఎస్‌సీటీసీఎస్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నాలుగు డిస్కమ్‌లతో ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) లేని కారణంగా తెలంగాణలోని రెండు డిస్కమ్‌లకు ఆ ప్రాజెక్టులో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆంధ్రా సర్కారు వాదిస్తున్నది.

ఈ పవర్ స్టేషన్ యాజమాన్య హక్కులు కలిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కంపెనీ (ఏపీపీడీసీఎల్) బోర్డు సమావేశం శనివారం విద్యుత్‌సౌధలో జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన రెండు డిస్కమ్‌ల సీఎండీలు ఎస్‌ఎం రిజ్వీ, కార్తికేయ మిశ్రా హాజరయ్యారు. ప్లాంటు పనుల పురోగతి, బొగ్గు నిల్వలు, ఖర్చులు వంటి అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ వాటాపై ఇద్దరు సీఎండీలు ప్రస్తావించినట్లు సమాచారం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి