గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 14, 2014

ఓడిస్తారా ఓటేస్తారా?

-ఏ క్షణంలో అయినా రాజ్యసభ ముందుకు పోలవరం బిల్లు
-కాంగ్రెస్ కాదంటే ఖేల్ ఖతం.. వైఖరి చెప్పని అధిష్ఠానం చుట్టూ టీ కాంగ్రెస్ ఎంపీల చక్కర్లు
-విప్ జారీ యోచనలో టీడీపీ అధినేత.. సంకటంలో టీ టీడీపీ ఎంపీలు
-రంగులు మారుస్తున్న రాజకీయం.. తెలంగాణ వైపు నిలువాలని ప్రజల డిమాండ్


parlamentరెండున్నర లక్షల మంది ప్రజల భవితవ్యం ఇపుడు మూడు పార్టీల చేతిలో ఉంది. అవి తీసుకోవాల్సిన నిర్ణయం ఆ పార్టీల తెలంగాణ నేతల చేతిలో ఉంది. ఆ నిర్ణయం కోసం తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మందబలంతో లోక్‌సభలో పోలవరం బిల్లును గట్టెక్కించిన ఎన్డీఏ ఇపుడు రాజ్యసభముందు చేతులు కట్టుకుని నిలబడింది. ఆ కూటమి పప్పులు రాజ్యసభలో ఉడకవు. నంబర్ గేమ్‌లో అక్కడ ఇపుడు కాంగ్రెస్‌ది పైచేయిగా ఉంది.
ఆ పార్టీ తెలంగాణను ముంచుతుందా? ఆపన్నహస్తమై నిలుస్తుందా? అన్నది ప్రశ్న. జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఆయా ప్రాంతాల నుంచి ఉండే సభ్యుల శక్తి సామర్థ్యాలు, చొరవ ఆధారంగానే వైఖరి ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు చెందిన తెలంగాణ నాయకులు అధిష్ఠానాన్ని ఒప్పిస్తారా? సీమాంధ్ర నాయకుల చుట్టూ పొర్లు దండాలు పెడతారా తేలే సమయం ఆసన్నమైంది. అగ్ని పరీక్షకు నిలిచినపుడే అసలు రంగు తెలిసేది. సన్నాయి నొక్కులతో ఏరు దాటాలంటే కుదరదు. తెలంగాణ ఇపుడు మేల్కొన్న బెబ్బులి. బిల్లుకు ఓటేస్తారో.. ఓడిస్తారో తేటతెల్లం కావాల్సిందే! అసలు రంగులు బయటపడాల్సిందే!
babaluఎన్డీఏ ప్రభుత్వం మందబలంతో లోక్‌సభలో ఆమోదముద్ర వేయించుకున్న పోలవరం బిల్లు ఏ క్షణమైనా రాజ్యసభ ముందుకు రానుంది. ప్రభుత్వానికి లోక్‌సభలో ఉన్న బలం రాజ్యసభలో లేక పోవడంతో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికితే తప్ప బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేకపోవడంతో ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభలో బలం లేనందువల్ల కాంగ్రెస్ అక్కడ ఈ బిల్లుపై పెద్దగా స్పందించలేదు. చర్చ కూడా జరగకపోవడం వల్ల ఆ పార్టీ వైఖరి కూడా వెల్లడి కాలేదు.

ఇపుడు రాజ్యసభలో ఆ పార్టీ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్,తెలుగుదేశం, బీజేపీ సభ్యులు బిల్లుపై ఎలా స్పందిస్తారు? తమ తమ పార్టీలను ఎలా ఒప్పిస్తారు? అనే విషయమై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రజలను నీట ముంచే ఈ బిల్లును ఈ నాయకులు అడ్డుకుంటారా? లేక పారిపోతారా? అనే విషయమై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. అగ్నిపరీక్ష ఎదురైన ఈ సమయంలో వారు ప్రజల వైపో.. సీమాంధ్ర నాయకత్వం వైపో తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రాజ్యసభలో పప్పులుడకవు..

లోక్‌సభ రాజ్యసభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాల్లో చాలా వ్యత్యాసం ఉంది. రాజ్యసభలో ఎన్డీయే, యూపీఏ, ఇతరులు సమ ఉజ్జీలు. అధికారపక్షం కంటే ప్రతిపక్షం, థర్డ్ ఫ్రంట్‌లకే సంఖ్యా బలం అధికంగా ఉంది. 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకంటే కాంగ్రెస్‌కే ఎక్కువ బలముంది. కాంగ్రెస్‌కు 69 మంది సభ్యులుండగా బీజేపీకి మాత్రం 43 మంది మాత్రమే ఉన్నారు. శివసేనలాంటి ఎన్డీఏ కూటమి పార్టీలకు కూడా స్వల్ప స్థాయిలో సభ్యులున్నారు. ఇక తెలుగుదేశం, పార్టీకి ఇక్కడ ఆరుగురు సభ్యులున్నారు. ఈ ఆర్డినెన్స్ గట్టెక్కాలంటే కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇతర పార్టీల మద్దతు ఎన్డీయేకు అనివార్యం.

లోక్‌సభలో అధికార పక్షం వ్యవహరించిన తీరు అన్ని పక్షాలు వ్యతిరేకించిన నేపథ్యంలో సోమవారం ఏం జరుగుతుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఏ పక్షాన నిలుస్తుందన్న ప్రశ్న అందరి మదిని తొలుస్తున్నది. ఇది యూపీఏ కాలంలోనే రూపొందించిన ఆర్డినెన్స్ అంటూ బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే రాజ్యసభలో బీజేపీ కల్పించిన అడ్డంకుల కారణంగానే కాంగ్రెస్ ఏడు మండలాల ముంపునకు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే బీజేపీ మొత్తం నిందను కాంగ్రెస్ పైకి తోసేసి ఆత్మరక్షణలో పడేయాలనే ఎత్తుగడ వేసింది. మరోవైపు పోలవరం ఆర్డినెన్స్ విషయంలో అధికార పక్షానికి మద్దతు ఇవ్వొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కే జానారెడ్డి, డీ శ్రీనివాస్ వంటి వారు ఢిల్లీకి వెళ్లి పెద్దలను కోరారు.

ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తే రాజ్యసభలో ఎట్టి పరిస్థితుల్లో బిల్లు గట్టెక్కే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పోలవరం బిల్లును ఇప్పటికే మూడో ఫ్రంట్‌లోని వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సైతం కొన్ని పార్టీలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేశాయి. ఇక రాష్ర్టాల వారీగా తీసుకుంటే ముంపు పరిధిలో ఉండే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాలు పూర్తిగా విభేదిస్తున్నాయి. రాజ్యసభలో సైతం ఈ రాష్ర్టాల ప్రతినిధులు భిన్నంగా వ్యవహరించే అవకాశాలు లేవు.

అంతా కాంగ్రెస్‌దే భారం..

రాజ్యసభలో ఏ ఆర్డినెన్స్, ఏ బిల్లు అయినా అధికార పక్షానికి ప్రతిపక్ష సహకారం అనివార్యమని లెక్కలు చెబుతున్నాయి. దీనితో పోలవరం బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయట పడకతప్పదు. బీజేపీ ఇప్పటికే తాను పూర్తిగా సీమాంధ్ర పక్షపాతినని చెప్పకనే చెప్పింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ విషయం బట్టబయలైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడగా తెలంగాణకు అండగా నిలబడుతుందా!? మరో మార్గం అనుసరిస్తుందా? తేలాల్సి ఉంది. ఇక థర్డ్ ఫ్రంట్‌లోని పార్టీలు, ఇండిపెండెంట్లు కూడా కీలకంగా మారనున్నారు. ఓ ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ గైర్హాజరు కావాలన్న నిర్ణయానికి వస్తే అపుడు ఈ పార్టీల వైఖరి కీలకమవుతుంది.

తెలంగాణ ఎంపీల మాటేమిటి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వీ హన్మంతరావు, రాపోలు ఆనందభాస్కర్ వంటి వారు బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. టీటీడీపీ సభ్యులే నోరు విప్పడం లేదు. రాజ్యసభలో మన రాష్ట్రంనుంచి టీడీపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆదివారం రాత్రి వరకు వీరు ఏ నిర్ణయాన్నీ ప్రకటించలేదు. సంప్రదించినా ముఖం చాటేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోలవరం కోసం ఉరకలు వేస్తున్న నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం నిలబడతారా? వేచి చూడాల్సి ఉంది.

వామపక్షాలు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలతో సంబంధం లేకుండా గిరిజన, ఆదివాసీలకోసం పోలవరం డిజైన్‌ను మార్చాలని అంటున్నాయి. ముంపును తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుత రూపంలో పోలవరం బిల్లును వామపక్షాలు ఆమోదించే అవకాశం లేదు.
బిల్లు ప్రవేశం ఎప్పుడు?
రాజ్యసభలో ఈ బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. కానీ జూలై 18వ తేదీలోగా పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ పూర్తయ్యి ఆమోదం పొందాల్సి ఉంటుందని మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన నేపథ్యంలో రానున్న నాలుగైదు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తికానుంది. సోమ, మంగళవారాల్లో ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు వస్తున్నట్లు సెక్రటరీ జనరల్ తన లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో ఎక్కడా పేర్కొనలేదు.

అధిష్ఠానంపై టీ కాంగ్రెస్ ఒత్తిడి...

తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు మాత్రం పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత డిజైన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా సుమారు రెండు లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతారని, సుమారు 270 గ్రామాలు ముంపుకు గురవుతాయని, అందువల్ల ప్రత్యామ్నాయ డిజైన్ ద్వారా నిర్మిస్తే ముంపు గ్రామాల సంఖ్యను తగ్గించడంతో పాటు గిరిజనుల జీవితాలకు ఇబ్బంది లేకుండా చేయవచ్చని కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ ప్రాజెక్టు వెనక ఉన్న ఉద్దేశాలు, గిరిజనులకు జరగనున్న నష్టం, ప్రత్యామ్నాయ డిజైన్ గురించి సోనియాగాంధీకి వివరించే ప్రయత్నం చేసి పార్టీ వైఖరి ఎలా ఉండాలనేదానిపై సూచనలు చేస్తామని టీ మీడియాకు ఆయన వివరించారు.

ఇరుకున పడిన తెలంగాణ టీడీపీ

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై తెలంగాణ టీడీపీ ఇరుకున పడింది. అధినేత చంద్రబాబునాయుడు పోలవరం బిల్లును నెగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి వల్ల తెలంగాణలో టీడీపీ నేతలకు సంకట స్థితి ఏర్పడింది. బిల్లుకు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడలేని పరిస్థితి.. పార్టీ ఆదేశిస్తే మద్దతు ఇవ్వలేని స్థితి తెలంగాణ టీడీపీ నేతలకు ఏర్పడింది. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేనందున తెలంగాణ టీడీపీ ఎంపీల ఓట్లు కీలకం కానున్నాయి.

టీడీపీ తెలంగాణ ఎంపీలు దేవేందర్‌గౌడ్, గరికపాటి మోహన్‌రావు, గుండుసుధారాణి ఎటువైపు నిలబడతారన్న చర్చ తెలంగాణ ప్రజానీకంలో జరుగుతున్నది. ఈ ముగ్గురు ఎంపీలు పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా? లేక బిల్లు పాస్ కావడానికి అనుకూలంగా గైర్హాజరు అవుతారా? లేక బిల్లును పాస్ చేయించడానికి రాజ్యసభకు హాజరై ఓటు వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ బిల్లు విషయంలో స్పష్టత లేని తెలంగాణ టీడీపీ ఎంపీలు, నాయకులు మీడియాకు మొఖం చాటేస్తున్నారు. టీడీపీ తెలంగాణ నేతల వైఖరిని తెలుసుకోవడానికి టీ మీడియా ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఫోన్లు రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు.

ఒక ఎంపీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయగా.. మరో ఎంపీ ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు.. సదరు ఎంపీ అసిస్టెంట్‌కు ఫోన్ చేస్తే తరువాత మాట్లాడిస్తానని చెప్పినా మాట్లాడలేదు. సారీ అంటూ మెసేజ్ పంపించారు. బీజేపీ ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తీసుకునే ప్రయత్నాలు చేస్తూనే, టీడీపీకి చెందిన ఇరు ప్రాంతాల ఎంపీలు కూడా ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాలని టీడీపీకి స్పష్టం చేసినట్లు సమాచారం. విప్ జారీ చేస్తే పరిస్థితి ఏమిటని టీడీపీ తెలంగాణ ఎంపీలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

కాలం తిరగబడితే.....

తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో నాడు కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితే ఇపుడు బీజేపీకి ఎదురవుతున్నది. ఆనాడు తెలంగాణ బిల్లుకు వెంకయ్యనాయుడు రాజ్యసభలో నిర్దాక్షిణ్యంగా అడ్డంకులు కల్పించి నానా యాగీ చేసి, జైరాం రమేశ్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలందరికీ నిద్రలేని రాత్రులను మిగిల్చిన విషయంతెలిసిందే. ఆయన మోకాలడ్డడం కారణంగానే రాజ్యసభకు సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్ హాజరైన సందర్భం ప్రజల ముందు ఇంకా తాజాగానే ఉంది. నాడు రాజ్యసభలో తమకున్న బలాన్ని అడ్డు పెట్టుకుని సీమాంధ్రకు భారీ ప్రయోజనాలతో పాటు సరిగ్గా ఈ ముంపు గ్రామాల బదలాయింపునకు ఆర్డినెన్స్ జారీ చేస్తామని కాంగ్రెస్‌తో బలవంతంగా ఒప్పించిన విషయం అందరికీ తెలుసు. ఇపుడు కాలం తిరగబడింది.

సరిగ్గా ఆ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లే ఇపుడు బీజేపీ ప్రవేశ పెట్టింది. ఆ బిల్లు ఆమోదం బాధ్యత ఆనాడు జైరాం రమేశ్ మీద ఉన్నట్టే ఇపుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్యనాయుడు మీద పడింది. బిల్లు ఆమోదానికి ఆయన ఇవాళ కాంగ్రెస్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది ప్రశ్న.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి