-గోపన్‌పల్లిలో 189 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సర్కార్
-తెలంగాణ ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు
హైదరాబాద్ శివార్లలోని గోపన్‌పల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థలాన్ని ప్రభుత్వం వాపసు తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు గురువారం సదరు స్థలాలను స్వాధీనం చేసుకుని తెలంగాణ ప్రభుత్వ స్థల సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.-తెలంగాణ ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు
మొత్తం 189 ఎకరాల 11 గుంటల స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు స్థలం ఏపీఎన్‌జీవోలదంటూ గోడలపై రాసిన రాతలను తుడిచివేశారు. తెలంగాణ ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ మార్కింగ్ వేశారు. గోపన్‌పల్లిలోని 36, 37 సర్వే నంబర్లలోని 189 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు జారీ అయిన మెమో మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేశ్‌పోద్దార్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో విద్యాసాగర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది గురువారం అక్కడకు వచ్చి ఆ భూమిని ప్రభుత్వ కస్టడీలోకి తీసుకున్నారు. గోపన్‌పల్లిలోని భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడం, నిర్ణీత సమయంలో ఉపయోగించకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలవల్ల వెనుకకు తీసుకున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ కోసం 2004లో అప్పటి ప్రభుత్వం 189 ఎకరాలను కేటాయించింది. అయితే వివిధ రకాల వివాదాలవల్ల కొంతకాలానికే కేటాయింపును రద్దు చేసింది. తిరిగి 2008లో భూమిని అదే సొసైటీకి కట్టబెడుతూ నాటి వైఎస్ సర్కార్ మెమో జారీచేసింది. తర్వాత ఏపీఎన్జీవోలలో విభేదాల వల్ల సొసైటీ భూమిని అభివృద్ధి చేయలేకపోయింది. అశోక్‌బాబు, గోపాల్‌రెడ్డి వర్గాలు భూమి పంపకాలలో అవకతవకలు జరిగాయంటూ రచ్చకెక్కాయి. గతంలో ప్రభుత్వం సొసైటీకి కేటాయించినప్పటికీ హక్కును బదలాయించలేదు.
ఇప్పటివరకు మ్యూటేషన్ కూడా కాలేదు. దీంతో ఎలాంటి చిక్కులు లేకుండా సర్కార్ ఆ భూమిని వెనుకకు తీసుకోగలిగింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ మీనా స్థల స్వాధీనానికి మెమో జారీచేశారు. శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది మొత్తం భూమి కొలతలు తీసుకుని తమ కస్టడీలోకి తీసుకున్నారు. రాయదుర్గలోని 83 సర్వే నంబర్‌లోని వివాదాస్పద ఏపీఐఐసీ భూములపై కూడా సర్వే జరుగుతోంది. ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలని స్థానికులు కోరుతున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి